– రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయలేదు
– అన్నదాతల ఆత్మహత్యలు రెట్టింపయ్యాయి : శరద్ పవార్
న్యూఢిల్లీ: దేశంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ఇచ్చిన హామీని నెర వేర్చడంలో ప్రధాని మోడీ విఫల మయ్యారని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ ఆరోపించారు. దేశంలో రైతులు కష్టాల్లో ఉన్నారనీ, వారి ఆత్మహత్యలు రెట్టింప య్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహా రాష్ట్రలోని షోలాపూర్ జిల్లాలో జరిగిన ఎన్సీపీ కార్యక్రమంలో పాల్గొన్న శరద్ పవార్ పై విధంగా స్పందించారు. రైులు తమ ఉత్పత్తులకు తగిన రాబడిని పొందలేక తీవ్ర చర్యలు తీసుకుంటున్నారని ఆయన అన్నారు. ” ప్రభుత్వం రైతులను పట్టించుకోవటం లేదు. రైతుల పంటలకు కేంద్రం సరైన ధర ఇవ్వటం లేదు. దీంతో వారు తీవ్ర చర్య (ఆత్మహత్య) తీసుకుంటున్నారు. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను పరిరక్షించే కొత్త పాలనను ఏర్పాటు చేయటం ప్రస్తుతానికి అవసరం. కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాలు రైతుల కష్టాలను తగ్గించటానికి, యువతకు ఉపాధి అవకాశాలను కల్పించటానికి తమ శక్తిని ఉపయోగించలేదు. ఉద్యోగాలు లేకపోవటంతో యువత కష్టాల్లో కూరుకుపోవటం చూస్తారు. ప్రభుత్వాన్ని మార్చాలి” అని శరద్ పవార్ పిలుపునిచ్చారు. మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) ఐక్యంగా ఉన్నదనీ, ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఓడించటమే లక్ష్యంగా ఉన్నదని ఆయన చెప్పారు.