గుణపాఠాలు నేర్వని మోడీ సర్కార్‌

గుణపాఠాలు నేర్వని మోడీ సర్కార్‌భారతదేశంలో కేంద్ర బడ్జెట్‌ గురించి జరిగిన ప్రచారం అతిశయోక్తిగా మారింది, అయితే అందరి దష్టిని ఆకర్షించింది. ఎందుకంటే అది కేంద్ర ప్రభుత్వ స్వభావాన్ని, ఉద్దేశ్యాల్ని తెలియజేస్తుంది. మిత్రపక్షాల మద్దతుపై ఆధారపడే మైనార్టీ ప్రభుత్వంగా నరేంద్రమోడీ ప్రభుత్వం ఎలా పని చేస్తుంది, ఆర్థిక వ్యవస్థనెలా నడుపుతుందనే విషయం గురించి ఈ పూర్తి స్థాయి కేంద్ర బడ్జెట్‌ మనకు ఏమి చెపుతుంది?మొదటగా, కొన్ని సంవత్సరాల తిరస్కరణ అనంతరం చివరికి, నిరుద్యోగమే ఒక పెద్ద సమస్య అని కేంద్ర ప్రభుత్వం అంగీకరించే పరిస్థితికి వచ్చింది. అయితే ఇబ్బంది ఏమిటంటే, ఇప్పటివరకు ప్రభుత్వం ఈ సమస్యను విస్మరించింది. దానిని ఎదుర్కొనే వ్యూహం అంటూ ఒకటి ప్రభుత్వం వద్ద లేదు. కాబట్టి బడ్జెట్‌ ప్రసంగం, ‘ఎంప్లారుమెంట్‌’ అనే పదాన్ని ఏర్పరచడానికి పది వేరు వేరు పదబంధాల్లో దాని లక్ష్యాలను సంగ్రహించాల్సి వచ్చింది. కానీ అసలు విషయానికి సంబంధించిన అంశాలు దానిలో తక్కువగా ఉన్నాయి. నిలిచిపోయిన ఉపాధి అవకాశాల కల్పనకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి, నిలిచిపోయిన ఉపాధి అవకాశాలకు గల కారణాలను తెలుసుకోవడం కనీస అవసరం. కానీ ఈ ప్రభుత్వానికి ఆ పనిచేయడం ఇష్టం లేదనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. అయితే వాటికి గల కారణాలు కూడా స్పష్టంగానే ఉన్నాయి.
ఉపాధి సవాలు
స్వల్ప ఉపాధికల్పన అనేది, భారతీయ అభివద్ధి క్రమంలో ఒక దీర్ఘకాలిక సమస్య. అయితే గడిచిన దశాబ్దం అత్యంత దారుణమైన కాలం. సంఘటిత, అసంఘటిత రంగాలు రెండింటిలో ఉపాధి అవకాశాలు దాదాపుగా పెరగలేదు. కేవలం ‘ఫ్యామిలీ ఎంటర్‌ ప్రైజెస్‌లో చెల్లింపుల్లేని సహాయకుల’ కారణంగానే ఇటీవల కాలంలో మహిళల ఉపాధి కొద్దిగా పెరిగినట్టు నమోదైంది. వీరు, నమోదైన మహిళా ‘కార్మికుల్లో’ 37శాతం పైగా ఉన్నారు. గడచిన దశాబ్ద కాలానికి పైగా చాలామంది కార్మికులకు నిజ వేతనాలు కూడా నిలిచిపోయి,దాదాపు సగానికి తగ్గాయి.
దీని ఫలితంగా సామూహిక వినియోగం ఆగిపోయి, దేశీయ మార్కెట్లలో వద్ధి లేకుండా పోయింది. ఉపాధి సష్టిని నిలిపివేసే ఒక హానికరమైన వత్తం ఏర్పడింది. తగినంత డిమాండ్‌ లేకపోవడం వల్ల ఇప్పుడు పెట్టుబడి పైన నిర్బంధం ఏర్పడింది. ఈ పెట్టుబడి, 2007-08లో జీడీపీ లో 36శాతంగా ఉంటే 2023-24 లో 31శాతం కన్నా తక్కువగా ఉంది. ఈ క్రమంలో సాంకేతిక మార్పులు అంటే ఉత్పత్తి చేయబడిన వస్తువులు, నూతన సేవలు – ఈ రెండింటికి సంబంధించిన సంఘటిత రంగంలో భారీస్థాయి ఉత్పత్తికి చాలా నైపుణ్యం కలిగిన కార్మికుల అవసరం ఉంటుంది.
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ) అధిక సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి. కానీ అవి గడిచిన దశాబ్ద కాలంలో వరుసగా అనేకసార్లు దెబ్బలు తిన్నాయి. అవి:2016లో పెద్ద నోట్ల రద్దు, 2017లో దెబ్బతిన్న జీఎస్టీ రోల్‌ఔట్‌, 2020-2021 కాలంలో కోవిడ్‌-19 కారణంగా అనాగరికమైన లాక్‌ డౌన్‌లు (ఎలాంటి నష్టపరిహారం లేకుండా). అయినా బతికి బయటపడడం ఆశ్చర్యమే. భారీ సంఖ్యలో ఖాళీలున్నా కనీస వేతనాలు కూడా లేని అనేకమంది మహిళా ‘స్కీం కార్మికుల’తో సహా కాంట్రాక్ట్‌, క్యాజువల్‌ కార్మికులపై ఎక్కువగా ఆధారపడడంతో ప్రభుత్వ ఉపాధి అవకాశాలు కూడా నిలిచిపోయా యి.ఫలితంగా స్వయం ఉపాధి పని ఈ భూభాగంలో ఆధిపత్యం చెలాయిస్తుంది. వత్తిగా వ్యవసాయం లాభదాయకం కాకపోయిన ప్పటికీ ప్రజలు వ్యవసాయంలోనే ఉంటున్నారు ఎందుకంటే దానికి వెలుపల వారికి కొన్ని అవకాశాలున్నాయి. నిరుద్యోగ సమస్యను పరిష్కారించాలంటే ఈ సమస్యలన్నింటినీ పరిష్కారించాలి.
అయితే బడ్జెట్‌ ఈ సమస్యల్ని వేటినీ స్పశించలేదు. దానికి బదులుగా యువత నిరుద్యోగ సమస్య పరిష్కారానికి గాను చిన్నచిన్న చర్యల్ని ‘ఉపాధి – అనుసంధాన ప్రోత్సాహకం’ ప్రధానంగా సంఘటి తరంగ కార్మికులకు, వారి యజమానులకు ప్రతిపాదించారు. సంఘటితరంగ ఉపాధిలో కొత్తగా నియమితులైన వారికోసం ఒక పరిమిత కాలానికి ఎంప్లాయీస్‌ ప్రావి డెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌కు లేదా పెన్షన్‌ ఫండ్‌కు చిన్న రాయితీని చెల్లించే విధంగా మూడు పథకాలు వర్తి స్తాయి. దీని ద్వారా ప్రతీ వ్యక్తికీ అందే పైకం కొద్ది మొత్తంలోనే ఉంటుంది. అధ్వాన్నమైన విషయం ఏమటే, అవి మొత్తం ఉపాధిలో చిన్న భాగంగా ఉన్న సంఘటితరంగంలోని ఉద్యోగులకే పరిమితమ య్యాయి.
అయితే ఈ విధానాల కోసం మోడీ ప్రభుత్వం తమ స్వంత ప్రణాళికను అనుకరిస్తుందని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపిస్తుంది. కానీ ఈ విధానంలో విస్తతి, సారం లోపించింది కాబట్టి అనుకరించిన వారెవరైనా వారి ప్రతిపాదిత పథకాన్ని చదవలేదు, అవగాహన చేసుకోలేదు. ఏదీ ఏమైనా దేశం ఎదుర్కొంటున్న విపరీతమైన ఉపాధి సవాలు పరిష్కారానికి ఈ విధానం చేసేది చాలా తక్కువే.
ఈ బడ్జెట్‌ నుండి మనం చేసే రెండవ దురదష్టకరమైన నిర్ధారణ ఏమంటే, ఇటీవల జరిగిన ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బల నుండి మోడీ ప్రభుత్వం ఎలాంటి గుణపాఠాల్ని నేర్చుకోలేదు. ఇది ఇంతకుముందు అనుసరించిన విధానాలనే మూడు కీలకమైన అంశాల్లో కొనసాగిస్తుంది. ఆ మూడు: వాస్తవాన్ని దాచిపెట్టడానికి అనుసరించే నైపుణ్యమైన వ్యూహం పట్ల మితిమీరిన ప్రేమ; తీవ్ర రాజకీయ, ఆర్థిక కేంద్రీకరణ ;ధనికుల నుండి పేదలకు వ్యాపించే ఆర్థిక వ్యవస్థకు అనుకూలమైన ఉన్నత వర్గాల పైన ఆధారపడడం. ఇవి దేశానికి ప్రమాదకరమే కాక ఎలాంటి రాజకీయ ప్రయోజనాలను కూడా నెరవేర్చవు.
ఆర్థిక వివరాల సమర్పణలో ప్రభుత్వం అనుకూలమైన అంశాల్ని ఎంపిక చేసుకోవడం ద్వారా మోసపూరితంగా వ్యవహరించింది. మోడీ ప్రభుత్వం యొక్క ప్రధానమైన దష్టి మౌలిక సదుపాయాల పెట్టుబడిపై ఉంది. అందుకు ప్రభుత్వం ప్రశంసలు అందుకుంది. ఇది ఖచ్చితంగా పెరిగింది, కానీ బడ్జెట్‌ వ్యయాలను స్థిరంగా అతిగా అంచనా వేశారు. వాస్తవ ప్రభుత్వ పెట్టుబడి గణనీయంగా తగ్గింది.
2023-24 బడ్జెట్‌లో మూలధన పెట్టుబడి కోసం 10 లక్షల కోట్లకు పైగా చేసిన ప్రకటన పతాక శీర్షికల్లో కనిపించింది, కానీ వాస్తవ ఖర్చు 52,455 కోట్ల రూపాయలు తగ్గింది. ఆఖరి మూలధన వ్యయం 1,18,656 కోట్ల రూపాయలు తగ్గింది. ఇది, ప్రస్తుత బడ్జెట్‌లో ప్రకటించిన 11 లక్షల కోట్లకు పైగా వ్యయం అవుతుందా లేదా అనే అనుమానాన్ని కలిగిస్తుంది. ఇటీవలే జరిగిన ఎన్నికలు, మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీవ్ర కేంద్రీకరణ విధానంలో మార్పు తెస్తుందని చాలామంది పరిశీలకులు ఆశించారు. దురదష్టవశాత్తు, ఈ ప్రస్తుత బడ్జెట్‌ ఆర్థిక సమాఖ్య వ్యవస్థ పై మరొక దాడి చేసింది. అది, ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు ‘నిటి ఆయోగ్‌’ సమావేశ బహిష్కరణకు దారితీసింది. ఈ కేంద్ర ప్రభుత్వం ఆర్థిక వనరులు, ఆర్థిక నిర్ణయాధికారం, రెండింటినీ కేంద్రీకరించింది. బీజేపీ దాని మిత్రులు పాలించే రాష్ట్రాల్లో ఎక్కువ వనరుల్ని సమకూర్చడం, ప్రతిపక్ష పార్టీలు పాలించే రాష్ట్రాలకు మొండిచెయ్యి చూపించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుంది.
ఇది ప్రస్తుత బడ్జెట్‌లో మరింత తేటతెల్లమైంది. బీజేపీకి మద్దతుగా నిలిచిన రెండు కీలకమైన మిత్రపక్ష పార్టీలు తమ స్వంత రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, బీహార్‌ల కోసం భారీ ఆర్థిక బదిలీ బహుమతులను పొందాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలతో పంచుకునే అవసరం లేని సెస్‌లు, సర్‌చార్జీల వైపు పన్నులను మళ్లించే ప్రయత్నాన్ని కొనసాగిస్తుంది. మొత్తం కేంద్ర ప్రభుత్వ వ్యయంలో (ఫైనాన్స్‌ కమిషన్‌ అవార్డులు, ఇతర గ్రాంట్లు,రుణాలతో సహా) అన్ని బదిలీల వాటా 2022-23 లో 22.1శాతం ఉంటే 2023-24లో అది 20.7శాతానికి పడిపోయింది.
కొనసాగుతున్న ఆశ్రితవాదం
పెద్ద కార్పొరేట్‌ వ్యాపారస్తులపైన ఆధారపడడం అనేది ఈ ప్రభుత్వ ప్రాథమిక ఆర్థిక విధానం. వారిలో కూడా ఆర్థిక వద్ధిని అందించడానికి కొద్దిమంది అనుకూలురైన ఆశ్రితులపై ఆధారపడే విధానం మారలేదు. అంటే దీనర్థం, వివిధ మార్గాల ద్వారా పెద్ద కార్పోరేట్లకు సబ్సిడీలందించి, వారికి పన్ను మినహాయింపులిచ్చే విధానాన్ని కొనసాగించడం, అదే విధంగా ప్రజల జీవితాలను ప్రభావితం చేయడానికి అవసరమైన సామాజిక వ్యయానికి కోత విధించడం. చాలా హీనమైన పోషకాహార సూచికలు, పెరుగుతున్న ఆకలి సూచికలు గల దేశంలో, 80 మిలియన్ల మంది ప్రజలను ఆహార హక్కు నుండి మినహాయించినందుకు సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన తరువాత కూడా అసాధారణమైన రీతిలో ఆహార సబ్సిడీకి బడ్జెట్‌ చాలా తక్కువగానే కేటాయించారు.
పెన్షన్లను అందించే నేషనల్‌ సోషల్‌ అసిస్టెన్స్‌ ప్రోగ్రాంకు సంబంధించిన డబ్బులో గత సంవత్సరం నుంచి ఎలాంటి మార్పు లేదు. కాబట్టి హాస్యాస్పదంగా ఒక పెన్షనర్‌కు నెలకు రూ.500 చొప్పున కొనసాగడం, లబ్దిదారుల సంఖ్యలో కూడా ఎలాంటి పెరుగుదల లేకుండానే కొనసాగు తుంది. గత సంవత్సరం ఆరోగ్యం, కుటుంబ సంక్షేమంపై చేసిన ఖర్చు బడ్జెట్‌లో13,020 కోట్ల రూపాయలకు తగ్గింది. ఇది జీడీపీలో కేవలం 0.25శాతం మాత్రమే. ప్రస్తుత సంవత్సరం ఖర్చు అంచనా వేసిన ద్రవ్యోల్బణం కంటే ఎక్కువగా ఉంది. ఇది జీడీపీలో మరింత తక్కువ వాటాకు క్షీణిస్తుంది. ఉపాధి హామీ పథకానికి కేటాయింపులు ప్రస్తుత సంవత్సరంలో జరిగిన ఖర్చులకు సమానంగా ఉన్నాయి. కానీ వాస్తవానికి కేటాయింపులో తగ్గుదల ఉంటుంది. పట్టణ ఉపాధి హామీ పథకాన్ని అసలు పరిగణలోకే తీసుకోలేదు. సామాజిక రంగాలపై తక్కువ ఖర్చు చేయడం వల్ల భారీ అవకాశాలు కోల్పోవడం జరుగుతుంది, ఎందుకంటే ఈ రంగాలు ఉపాధి అవకాశాల్ని పెంచడానికి ఉపయోగపడతాయి. వాస్తవానికి ఎంఎస్‌ఎంఈలు ఉపాధి అవకాశాలు పెరగడానికి దోహదం చేస్తాయి. ఇలాంటి రంగాల్లో ప్రభుత్వ వ్యయం పెంచడం, ఉపాధిని తీవ్రతరం చేసే కార్యక్రమాల్ని పెంచడం అనేవి మెరుగైన, నాణ్యమైన పౌరజీవితానికి దారి తీయడమే కాక డిమాండ్‌ను సష్టించి దాని ఫలితంగా ఉపాధి కల్పనకు కూడా కారణమవుతుంది. దీన్ని గుర్తించడంలో ప్రభుత్వ ఆర్ధిక వ్యూహంలో వైఫల్యం ఉందనే పెద్ద విమర్శ ఉంది. అయితే ఇది భారతీయ ప్రజలకు చాలా దురదష్టకరమైన వార్త.
(వ్యాసకర్త జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్రం ప్రొఫెసర్‌గా 35 సంవత్సరాలు పని చేశారు)
(‘ఫ్రంట్‌ లైన్‌’ సౌజన్యంతో)
అనువాదం: బోడపట్ల రవీందర్‌, 9848412451
జయతీ ఘోష్‌

Spread the love