మోడీ ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి..

– రాష్ట్రానికి బీజేపీ సర్కార్‌ చేసిన అన్యాయాన్ని ఎండగట్టాలి
– నిధులివ్వకుండా ప్రగతిని అడ్డుకుంటున్న తీరును వివరించాలి
– పార్టీ ఇన్‌ఛార్జీలు, సమన్వయకర్తలు, ప్రజా ప్రతినిధులకు కేటీఆర్‌ దిశానిర్దేశం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పెట్రోల్‌, డీజీల్‌ ధరలతో పాటు నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలకు మోడీ ప్రభుత్వ విధానాలే కారణమని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. వీటితో పాటు బీజేపీ నాయకుల వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలని ఆయన పిలుపునిచ్చారు. వీటన్నింటినీ కార్యకర్తలకు అర్థమయ్యేలా విడమరిచి చెప్పాలని బీఆర్‌ఎస్‌ బీఆర్‌ఎస్‌ కార్యకర్తలను ఆయన ఆదేశించారు. సోమవారం పార్టీ విస్తృతంగా నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలు, ఇతర కార్యక్రమాలను సమన్వయ పరుస్తున్నఇన్‌ ఛార్జీలు, సమన్వయకర్తలు, ప్రజా ప్రతినిధులతో సోమవారం ఆయన టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. చర్చించిన విషయాలను ప్రజా బహుళ్యంలోకి తీసుకువెళ్లేలా చూడాలని సూచించారు. దీంతోపాటు దేశంలోని ప్రస్తుత సామాజిక, ఆర్థిక పరిస్థితులతో పాటు మోడీ ప్రభుత్వం దేశానికి, రాష్ట్రానికి చేసిన అన్యాయాలను ప్రత్యేకంగా చర్చించాలని కోరారు. రాష్ట్రానికి నిధులు రాకుండా అడ్డుకోవడం, ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టడం, తద్వారా తెలంగాణ ప్రగతిని అడ్డుకుంటున్న తీరును కూడా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపైన్నేఉందని కేటీఆర్‌ గుర్తుచేశారు. అకాల వర్షాల వల్ల సమస్యలు ఎదుర్కొంటున్న రైతులను స్థానిక వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పరామర్శించాలనీ, నష్టానికి గురైన వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లి వారికి భరోసా ఇచ్చేలా మమేకం కావాలని కోరారు. ప్రభుత్వం వేగంగా చేపడుతున్న కార్యక్రమాలను పార్టీ ఎమ్మెల్యేలు పర్యవేక్షించాలనీ, పంచాయతీరాజ్‌ రోడ్ల బలోపేతంపైన దృష్టి సారించి వర్షాకాలంలోపు పనులు పూర్తయ్యేలా సమన్వయం చేసుకోవాలని తెలిపారు. గ్రామస్థాయిలో ఉపాధి హామీతో పాటు పంచాయతీరాజ్‌ శాఖ, పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి వంటి కార్యక్రమాల్లో భాగంగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని కేటీఆర్‌ వారిని కోరారు. ఉపాధి హామీకి సంబంధించిన రూ.1,300 కోట్లను కేంద్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిందని వివరించారు.
ఏప్రిల్‌ 29 నాటికి
ఆత్మీయ సమ్మేళనాలు పూర్తి…
వచ్చే నెల 29 నాటికి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు పూర్తి కావాలనీ, ప్రతి కార్యకర్తా ఉద్యమ కాలం నుంచి పార్టీకి అండగా ఉంటూ రెండుసార్లు ప్రభుత్వం ఏర్పాటుకు దోహదం చేసిన విషయాన్ని వారికి గుర్తు చేయాలని కేటీఆర్‌ ఈ సందర్భంగా కోరారు. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి పంపే ప్రత్యేక సందేశాన్ని ప్రతి కార్యకర్తకు చేరేలా చూడాలని కోరారు. ప్రతి నాలుగైదు డివిజన్లకు కలిపి ఒక ఆత్మీయ సమ్మేళనాన్నీ, పార్టీ కార్యకర్తల ప్రాధాన్యత, వారితో ఉన్న అనుబంధాన్ని వివరించేలా కార్యక్రమాలుండాలని ఆయన స్పష్టం చేశారు. సమావేశాల్లో పార్టీ శ్రేణుల ప్రాధాన్యత, రాష్ట్ర ప్రగతి ప్రస్థానం, తెలంగాణ రాకముందు ఉన్న పరిస్థితులు, వచ్చిన తర్వాత మారిన రాష్ట్ర ముఖచిత్రం వంటి అంశాలను అర్థమయ్యేలా వివరించాలని కోరారు. రాష్ట్రంలో మహిళల అభివృద్ధి కోసం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వారికి చేరేలా చూడాలని కేటీఆర్‌ కోరారు. ఇంకా ఎక్కడైనా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు ప్రారంభం కాకుంటే వెంటనే ప్రారంభించాలని కార్యకర్తలకు, నాయకులకు సూచిచారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఆత్మీయ సమ్మేళనాలకు రాష్ట్రస్థాయి నాయకులు, పార్టీ నేతలు ప్రత్యేక అతిథులుగా హాజరవుతారని తెలిపారు. ఏప్రిల్‌ 20 నాటికి ఆత్మీయ సమ్మేళనాలు పూర్తి చేసుకుంటే ఆ నెల 25న నియోజకవర్గస్థాయిలో పార్టీ ప్రతినిధుల సమావేశం నిర్వహించుకోవచ్చని చెప్పారు. ఒక్కో పార్టీ ప్రతినిధుల సమావేశంలో 1,000 నుంచి 1,500 మంది పార్టీ ప్రతినిధులతో ఈ సమావేశాలుంటాయని తెలిపారు. అదే నెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో జెండా పండుగ కార్యక్రమం ఉంటుందని వివరించారు. అదే రోజు పార్టీ ప్లీనరీని నిర్వహిస్తారని తెలిపారు. పార్టీ ఆహ్వానించిన ప్రతినిధులు మాత్రమే హాజరవుతారని కేటీఆర్‌ తెలిపారు.

Spread the love