నవతెలంగాణ – ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రసంగాలతో సమాజాన్ని విభజిస్తున్నారని ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ మండిపడ్డారు. కొద్ది రోజులుగా ఆయన చేస్తున్న ప్రసంగాలు, లేవనెత్తుతున్న అంశాలను చూస్తే ఈ విషయం అర్థమవుతోందన్నారు. ఓ జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన పవార్ మహాయుతి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మహారాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో విముఖత ఏర్పడిందన్నారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మతతత్వ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలు ‘విడిపోతే చస్తారు’ అనే నినాదంతో వారిలో భయాన్ని, అభద్రతను సృష్టిస్తున్నారని విమర్శించారు. ఆయన మాటలను బీజేపీ నాయకులు, ఎన్డీఏ మిత్రపక్షాలు సైతం వ్యతిరేకించాయన్నారు. ఎన్సీపీలో చీలిక ఏర్పడినా తమ వర్గానిదే గెలుపు అని శరద్ పవార్ ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై యువత, రైతులు అసంతృప్తితో ఉన్నారని.. అదే తమకు అనుకూలంగా మారే అవకాశం ఉందని స్పష్టం చేశారు.