కులతత్వాన్ని పెంచి పోషిస్తోన్న మోడీ

– నేడు ఏపీ బీజేపీ కార్యాలయాల ముట్టడి : అరుణ్‌కుమార్‌
గుంటూరు : ఇప్పటి వరకు మతతత్వ పార్టీగా ఉన్న బీజేపీ ఇప్పుడు కులతత్వాన్ని పెంచి పోషించే పార్టీగా మారిందని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోళ్ల అరుణ్‌కుమార్‌ విమర్శించారు. హైదరాబాదులో జరిగే మాదిగల విశ్వరూప సభకు ప్రధాని ముఖ్య అతిథిగా హాజరవ్వడం మాల, మాదిగల మధ్య వైరాన్ని పెంచడమేనని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్‌సి వర్గీకరణపై సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండగా హైదరాబాద్‌లో సభకు మోడీ హాజరు కావడం సరికాదన్నారు. మోడీ పర్యటనను వ్యతిరేకిస్తూ జెఎసి పిలుపు మేరకు రాష్ట్రంలో బీజేపీ కార్యాలయాలను శనివారం ముట్టడించాలని కోరారు. మాలల సత్తా తెలియజేసేందుకు జనవరిలో లక్షలాది మందితో విజయవాడలో సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ మాలమాహానాడు అధ్యక్షులు తాళ్లపల్లి రవి మాట్లాడుతూ.. తెలంగాణలోనూ మోడీ పర్యటనకు వ్యతిరేకంగా బిజెపి ఆఫీసు ఎదుట ఆందోళన చేస్తామని తెలిపారు.

Spread the love