నయా ఫాసిస్టు మోడీ

– సామ్రాజ్యవాదులకు తలొగ్గుతున్న ప్రధాని
– వాణిజ్య పంటలతో ఆహారభద్రతకు పెనుముప్పు
–  వ్యవసాయాన్ని సరుకుగా మార్చడమే సామ్రాజ్యవాదుల లక్ష్యం
– వారికి లొంగిపోతే ఆఫ్రికా దేశాలకు పట్టిన గతే
– సాగు చట్టాల ప్రమాదం ఇంకా పొంచే ఉంది
– రైతు రక్షణ కోసం అప్రమత్తత అవసరం : అరిబండి లక్ష్మినారాయణ 5వ స్మారకోపన్యాసంలో ప్రభాత్‌ పట్నాయక్‌
– ప్రొఫెసర్‌ ప్రభాత్‌ పట్నాయక్‌
అంతర్జాతీయ సామ్రాజ్యవాదులకు తలొగ్గుతున్న నయా ఫాసిస్టు ప్రధాని నరేంద్రమోడీ. వ్యవసాయాన్ని సరుకుగా మార్చడమే లక్ష్యంగా సామ్రాజ్య వాదులు ప్రయత్నాలు చేస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు అందుకనుగుణంగానే మూడు వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చింది. రైతులు పోరాడి ఆ చట్టాలను వెనక్కి తిప్పికొట్టారు. అయినా దేశానికి సాగు చట్టాల ప్రమాదం పొంచే ఉంది. రైతులపై వలసవాదులు క్రూర పద్దతులు ప్రయోగించి దోపిడీ చేశారు. నేటి పాలకులు పరోక్ష పద్దతులతో దోపిడీ చేస్తున్నారు. సామ్రాజ్యవాదులకు లొంగిపోతే ఆఫ్రికా దేశాలకు పట్టిన గతే మనకీ పడు తుంది.ఆయా దేశాల్లో ఆహారభద్రత కరువైంది. రైతు రక్షణ కోసం అప్రమత్తతతో ఉండడం మరింత అవసరం వలసపాలకులది అణచివేత ధోరణి నేటి పాలకులది నమ్మకద్రోహం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
సామ్రాజ్యవాదులు వ్యవసాయ రంగంలోకి చొచ్చుకొస్తున్నారని ప్రఖ్యాత ఆర్థికవేత్త, ప్రొఫెసర్‌ ప్రభాత్‌ పట్నాయక్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఇంగ్లాండ్‌లో పత్తి పంట సాగు కాదనీ, అయినా ఆ దేశంలో పెద్ద సంఖ్యలో పత్తి పరిశ్రమలు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. ‘మారుతున్న ప్రపంచ సంబంధాలు, వాతావరణం… వ్యవసాయ జాతీయ విధానం’ అనే అంశంపై మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అరిబండి ఫౌండేషన్‌, తెలంగాణ రైతు సంఘం సంయుక్తంగా రాష్ట్ర సదస్సు నిర్వహిం చాయి. ఈ సదస్సుకు అరిబండి ఫౌండేషన్‌ మేనేజింగ్‌ ట్రస్టీ అరిబండి ప్రసాదరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రభాత్‌ పట్నాయక్‌..అరిబండి లక్ష్మినారాయణ 5వ స్మారకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వలస దేశాల్లో పండిన పత్తి మీద ఆధారపడి పరిశ్రమలు ఏర్పట య్యాయని తెలిపారు. రైతు పండి స్తున్న పంటల్లో వాణిజ్యం లేదన్నారు. మొఘల్‌ సామ్రాజ్యంలోనూ ఆ పరిస్థితులు లేవన్నారు. వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్‌ సరుకుగా మార్చేందుకు పెట్టుబడిదారి వర్గం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసిందన్నారు. అందుకు రైతుల భూములను తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలనేది వారి కుట్రగా ఉందన్నారు. దేశంలో సాగు విస్తీర్ణంతోపాటు ఉత్పాదకత పెరిగింది కానీ, పెట్టుబడిదారీ విధానానికి అను కూలంగా మారలేదన్నారు. అందుకనే వ్యవ సాయంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమ య్యారని చెప్పారు. వలసదేశాల్లో తమకు అనుకూలమైన పంటలు సాగు చేసేలా ఒత్తిడి తెచ్చారని గుర్తు చేశారు. నాడు భూమిపై పన్నులే కాకుండా పంటలపై కూడా పన్నులేశారన్నారు. పంటలు పండకపోయినా పన్నులు కట్టాల్సి వచ్చేదన్నారు. పన్నుల కోసం రైతులు అప్పులు చేసే పరిస్థితులు ఉన్నాయన్నారు. అప్పులు తీర్చకపోతే భూములను స్వాధీనం చేసుకునేవారని చెప్పారు. భయంకరమైన కరువులొచ్చి లక్షల మంది మరణించినప్పటికీ నాటి పాలకులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆహార భద్రతకు పాలకులు ప్రాధాన్యత ఇచ్చారనీ, అందుకు కావాల్సిన చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. దేశ ప్రజల అవసరాలు తీర్చుకుంటూనే విదేశాలకు వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి చేసేస్థాయికి చేరుకున్నాయన్నారు. ఈ క్రమంలో నయా ఉదారవాద విధానాలు అమల్లోకి వచ్చాయని చెప్పారు. ఈ నేపథ్యంలో నేడు భిన్నమైన పద్దతులతో పేద దేశాలను దోచుకునేందుకు సామ్రాజ్యవాదులు ఉదారవాద విధానాలను ప్రారంభించారని విమర్శించారు. వేతనాలు కత్తిరించడం, వడ్డీ రేట్లు పెంచడం, సబ్సిడీలు తగ్గించడం, అంతర్జాతీయ మారకం రేటులో మార్పులు చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ఇలాంటి చర్యలతో కృత్రిమ పరిస్థితులు సృష్టించి పెట్టుబడిదారులు లబ్దిపొందుతున్నారని చెప్పారు.
వ్యవసాయరంగ నిపుణులు డాక్టర్‌ అల్ధాప్‌ జానయ్య మాట్లాడుతూ ఆహార భద్రత కల్పించడానికి గత ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకున్నాయన్నారు. నేటి ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయని చెప్పారు. ప్రతి ఏటా వ్యవసాయానికి 30శాతం బడ్జెట్‌ తగ్గించుకుంటూ వస్తున్నారని విమర్శించారు. వ్యవసాయంలోకి కార్పొరేట్‌ శక్తులు రాకుండా ఉద్యమించాలని రైతు సంఘాల నేతలకు సూచించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ రాజిరెడ్డి మాట్లాడుతూ, వానాకాలం, యాసంగి పంటల ప్రణాళికలను ముందుగా సిద్దం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎఐకెఎస్‌ జాతీయ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌, ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌ మాట్లాడారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి, నంద్యాల నర్సింహారెడ్డి, బొంతల చంద్రారెడ్డి, పి జంగారెడ్డి, సహాయ కార్యదర్శి మూడ్‌ శోభన్‌, అరిబండి ఫౌండేషన్‌ సభ్యులు డాక్టర్‌ అరిబండి మనోహర్‌, డాక్టర్‌ అరిబండి అనిల్‌, అమర్‌నాథ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
రైతుల ఆదాయం రెట్టింపేమైంది?
– ఏఐకేఎస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి విజ్జూకృష్ణన్‌

రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామనీ, వ్యవసాయ ఉత్పత్తులకు 50శాతం కలిపి మద్దతు ధర నిర్ణయిస్తామంటూ మోడీ హామీ ఇచ్చారని ఏఐకేఎస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి విజ్జూకృష్ణన్‌ చెప్పారు. సబ్సిడీ విత్తనాలు, ఎరువులు కూడా ఇస్తామని చెప్పినప్పటికీ అమలు కాలేదన్నారు. రైతు ఆదాయం రెట్టింపు కాకపోగా ఉన్న ఆదాయం కకూడా తగ్గిపోయిందన్నారు. రైతులకు ఆదాయం రూ .10200 వస్తుందని దీంతో రైతుబతికెదెట్టా అని ప్రశ్నించారు. వ్యవసాయరంగంలో సంక్షోభ ఫలితంగా దేశంలో నాలుగు లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా (2014- 23) లక్ష మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులే కాకుండా కూలీలు, నిరుద్యోగ యువకులు ఉపాధి కరువై చనిపోయారని గుర్తు చేశారు. పల్లెల నుంచి పట్టణాలకు వలసలు పెరుగుతున్నాయని తెలిపారు. స్వేచ్ఛా, వాణిజ్య ఒప్పందాలతో శ్రీలంక తీవ్రమైన వ్యవసాయ సంక్షోభంలోకి పోయిన విషాయన్ని గుర్తు చేశారు. వ్యవసాయ విధానంలో బీజేపీకి, కాంగ్రెస్‌ పెద్ద తేడా లేదన్నారు. వ్యవసాయంలో ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. ఆదాయం మాత్రం తక్కువగా వస్తున్నదని చెప్పారు. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వ్యవసాయం కార్పొరేట్‌ శక్తుల చేతుల్లోకి పోతే వారిదే పెత్తనం అవుతుందన్నారు.

Spread the love