మోడీ, కేసీఆర్‌ ఫెవికాల్‌ బంధం

– ప్రధాని నోట…చీకటి మిత్రుడి మాట
– కాంగ్రెస్‌ చెప్పినట్టే…ముసుగు తొలిగింది : టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య ఉన్నది ఫెవికాల్‌ బంధమేనంటూ కాంగ్రెస్‌ అనుమానాన్ని ప్రధాని నరేంద్ర మోడీ నిజామాబాద్‌ సాక్షిగా మరోసారి రుజువు చేశారని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి పేర్కొ న్నారు. ఆ రెండు పార్టీల నేతలు చీకటి మిత్రులేననీ, ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ పడుతున్నారని ఒక ప్రకటనలో రేవంత్‌ పేర్కొన్నారు. తాము మొదటి నుంచి చెబుతున్నదే నిజమని మోడీ మాటల ద్వారా స్పష్టంగా తేలిపోయిం దని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ ఎన్డీయేలో చేరాలనుకున్నది నిజమేననీ, మోడీ ఆశీస్సులతో కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేయాలనుకున్నది నిజమేనని వివరించారు. ఇప్పటికీ మోడీ, కేసీఆర్‌ చీకటి మిత్రులేని ఆరోపించారు. నిజం నిప్పులాంటిదనీ, అది ఎప్పటికైనా నిగ్గుతేలక మానదని అభిప్రాయ పడ్డారు. ఇప్పటికైనా తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. గడిచిన తొమ్మిదేండ్లలో మోడీ తీసుకున్న ప్రతి నిర్ణయంలో కేసీఆర్‌ మద్దతు ఉందని పేర్కొన్నారు. వాటికి పార్లమెంట్‌ రికార్డులే సాక్ష్యమని గుర్తు చేశారు. కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లి చీకట్లో మోడీతో ఏమేం లాలూచీ పడ్డాడో మోడీనే చెప్పిన తర్వాత ఇక వారిద్దరి బంధం, అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని వెల్లడించారు. తెలంగాణ సమాజం జాగురుకతతో ఉండి, ఆ రెండు పార్టీల చీకటి సంబంధాన్ని గుర్తెరిగి వచ్చే ఎన్నికల్లో తగిన నిర్ణయం తీసుకోవాలని రేవంత్‌ విజ్ఞప్తి చేశారు.

Spread the love