
నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణ ప్రజల సొమ్మును కేసీఆర్ కుటుంబం దోచుకుంటుందని ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్‌లో తెలంగాణ బీజేపీ మంగళవారం తలపెట్టిన ఇందూరు జనగర్జన సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఎంతో మంది బలిదానాలతో తెలంగాణ సాకారమైందని.. కానీ తెలంగాణ ప్రతిఫలాన్నీ ఒక్క కేసీఆర్ కుటుంబమే అనుభవిస్తోందన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్, ఆయన కొడుకు, కూతురు, అల్లుడు మాత్రమే ధనికులయ్యారని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ కుటుంబ స్వామ్యంగా మార్చారని మండిపడ్డారు. తెలంగాణ యువత కుటుంబ పాలనకు మరో అవకాశం ఇవ్వొద్దని ఈ సందర్భంగా మోడీ కోరారు. తెలంగాణ అభివృద్ధికి ఇప్పటికే ఎన్నో నిధులు ఇచ్చామని.. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.