– ఎక్కడ రక్తం పారిందో చూపించాలి
– కెేసీిఆర్ పోరాట ఫలితంగానే రాష్ట్రం ఏర్పాటు :
– విలేకర్ల సమావేశంలో శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి
నవతెలంగాణ- నల్గొండ కలెక్టరేట్
‘మోడీ మనసు నిండా విషం ఉంది. పార్లమెంట్ సాక్షిగా సోమవారం ప్రధాన మంత్రి మోడీ పచ్చి అబద్ధాలు మాట్లాడారు. తెలంగాణపై మరోసారి విషం చిమ్మారు’ అని శాసనమండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండలోని క్యాంపు కార్యాలయంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావుతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎక్కడ రక్తం ఏరులై పారిందో ప్రధానమంత్రి చూపించాలని డిమాండ్ చేశారు. గుజరాత్లో రక్తఫుటేరులు పారిన ఘటనలు ఇంకా మోడీ మరువనట్టు ఉందని, అవి గుర్తొచ్చి మాట్లాడుతున్నట్టు ఉందని ఎద్దేవా చేశారు. వాజ్‌పేయి హయాంలో జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలను ఏర్పాటు చేసి తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఎందుకు ప్రకటించలేదో చెప్పాలని ప్రశ్నించారు. బీజేపీ చేసిన అన్యాయాలు, అక్రమాలు చాలా ఉన్నాయని, కేసీఆర్ అలుపెరుగని పోరాట ఫలితంగానే కేంద్రం దిగొచ్చి రాష్ట్రాన్ని ఇచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టేలా హామీలు ఇస్తున్నదని ఆరోపించారు. ఆ పార్టీ అనౌన్స్ చేసిన 6 గ్యారంటీ హామీలు ఉత్తివేనని, ఆచరణకు సాధ్యం కాని హామీలను కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తుందని విమర్శించారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలన్నారు. కాంగ్రెస్, బీజేపీ కల్లబొల్లి మాటలను ప్రజలు నమ్మొద్దన్నారు. తెలంగాణ కోసం రాజీనామా చేయాలంటే పారిపోయిన వ్యక్తి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అని విమర్శించారు. యెండల లక్ష్మినారాయణ రాజీనామా చేస్తే కిషన్ రెడ్డి చేయలేదని గుర్తు చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టడం బీజేపీ పనని, ఆ పార్టీ పతనం ప్రారంభమైందని, అందుకే మహిళా రిజర్వేషన్ బిల్లు అంటూ హడావుడి చేస్తోందని విమర్శించారు.