– సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు
నవతెలంగాణ -రామన్నపేట
రాజ్యాంగ విలువల్ని కాలరాసి రాచరికాన్ని ముందుకు తెస్తున్న మోడీ సర్కార్ విధానాలను తిప్పికొట్టాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు అన్నారు. యాదాద్రిభువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని కొమ్మాయిగూడం గ్రామంలో సోమవారం పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం నూతన భవన నిర్మాణానికి చెరుపల్లి శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో మొదటి ప్రతిపక్ష నాయకుడు, ఉత్తమ పార్లమెంటేరియన్ పుచ్చలపల్లి సుందరయ్య పేరున నిర్మించే విజ్ఞాన కేంద్రం గ్రామంలో విద్యార్థులకు శాస్త్రీయ ఆలోచన, సామాజిక సేవాదక్పథం పెంపొందిస్తుందన్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగం మనదన్నారు. పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంలో భారత లౌకిక, సారభౌమత్వానికి వ్యతిరేకంగా క్రతువులు నిర్వహించి, దేశ ఔన్నత్యాన్ని దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాచరికపు కాలంనాటి రాజదండాన్ని పట్టుకుని మత మౌఢ్యంతో పూజలు నిర్వహించడం, భారత రాష్ట్రపతిని ఆహ్వానించకుండా సాధువులు, సన్యాసుల కాళ్లకు దండం పెట్టడం ఏంటని ప్రశ్నించారు. మోడీ నియంతలా వ్యవహరిస్తూ దేశ ప్రతిష్టతను దేబ్బతీశారని విమర్శించారు. చట్టాలను రూపొందించే భారత పార్లమెంటును మత ఛాందసాల కేంద్రంగా మార్చడంలో బీజేపీ పాలన లక్ష్యం ఎమిటో ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుం దన్నారు. అదే సమయంలో నిరసన తెలిపిన రెజ్లర్లపై దాడి హేయమైన చర్య అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి. జహంగీర్, రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మేక అశోక్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు జల్లెల పెంటయ్య, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, వనం ఉపేందర్, మండల కార్యదర్శివర్గ సభ్యులు కూరెళ్ళ నరసింహా చారి తదితరులు పాల్గొన్నారు.