‘నీట్‌’పై మోడీ నోరు విప్పాలి

'నీట్‌'పై మోడీ నోరు విప్పాలి– కృష్ణానది నీటి వాటాలు తేల్చాలి :సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-పెన్‌పహాడ్‌
నీట్‌ పరీక్షలో జరిగిన అవకతవకలపై ప్రధాని మోడీ నోరు విప్పాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌ మండల కేంద్రంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్‌పై నీట్‌ అవకతవకలు నీలి నీడలను కమ్మాయన్నారు. రాష్ట్రం విడిపోయి పదేండ్లు గడచినా కృష్ణా నది నీటి వాటాలు తేల్చడం లేదని, న్యాయంగా తెలంగాణకు రావాల్సిన నీటిని అందించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం శ్రామికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం లేదన్నారు. దేశాన్ని కార్పొరేట్ల చేతిలో పెట్టి సామాన్య ప్రజలను లూటీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టుల్లో.. విద్యుత్‌ కొనుగోలు విషయంలో పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సమగ్ర విచారణ జరపడానికి జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తే దానిని కేసీఆర్‌ వక్రీకరించడం సరికాదని, న్యాయవ్యవస్థను ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని అన్నారు. మెదక్‌లో మత ఘర్షణలకు తావివ్వకుండా.. ఇటీవల జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలన్నారు. రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలని, ఏకకాలంలో రుణమాఫీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, కోట గోపి, నాయకులు ధనియాకుల శ్రీకాంత్‌ వర్మ, వీరబోయిన రవి, వేల్పుల వెంకన్న, మండల కార్యదర్శి రణపంగ కృష్ణ తదితరులు ఉన్నారు.న

Spread the love