– మూడోసారి అధికార పగ్గాలు
– 17వ లోక్సభ రద్దుకు కేంద్ర మంత్రివర్గం సిఫారసు
– రాజీనామా లేఖను రాష్ట్రపతికి అందజేసిన ప్రధాని మోడీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో సాధారణ మెజారిటీ కంటే తక్కువ స్థానాలకే పరిమితమైన ఎన్డీఏ భాగస్వామ్యపక్షాలతో కలిసి మరోమారు బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఈనెల 9న నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 7న కూటమి ఎంపీల సంతకాలు సేకరించి రాష్ట్రపతి ముర్ముకు సమర్పిస్తారు. లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడటంతో 17వ లోక్సభ రద్దుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర మంత్రివర్గం బుధవారం సిఫారసు చేసింది. దీంతో 18వ లోక్సభ ఏర్పాటుకు, కొత్త ప్రభుత్వం పగ్గాలు చేపట్టడానికి మార్గం సుగమమైంది.
ప్రస్తుత లోక్సభ పదవీకాలం జూన్ 16తో ముగియడంతో మోడీ 2.0 చివరి మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రధాన మంత్రి నివాసంలో జరిగిన సమావేశంలో అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. సమావేశ అనంతరం ప్రధానమంత్రి నరేంద్రమోడీ రాష్ట్రపతి భవన్కు చేరుకుని తన రాజీనామా లేఖను రాష్ట్ర ద్రౌపది ముర్ముకు అందజేశారు.
ప్రభుత్వ ఏర్పాటుకు పూర్తిస్థాయి మెజారిటీ లేకుండానే..
కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బీజేపీకి పూర్తిస్థాయి మెజారిటీ లేదు. దేశంలో 543 స్థానాలకు ఎన్నికల జరగగా బీజేపీకి 240 స్థానాలు వచ్చాయి. ప్రభుత్వం ఏర్పాటుకు 272 స్థానాలు అవసరం. కానీ 32 స్థానాలు తక్కువ ఉన్నాయి. గత ఎన్నికల్లో 303 స్థానాలు గెలుచుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అందుకు టీడీపీ (16), జేడీయూ (12), ఏక్ నాథ్ షిండే (శివసేన) 7, ఎల్జేపీి 5, జనసేన 2, అజిత్ పవర్ ఎన్సీపీ 1, ఏజీపీ 1, హెచ్ఎఎం 1, అప్నాదల్ 1, ఇతరులు ఇద్దరు సభ్యులు ఉన్నారు. వీరి మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.