చైనా కార్లు వద్దు అమెరికన్‌ వాహనాలు ముద్దంటున్న మోడీ!

చైనా కార్లు వద్దు అమెరిన్‌ వాహనాలు ముద్దంటున్న మోడీ!ప్రపంచంలో ఎలక్ట్రానిక్‌ కార్ల యుద్ధానికి తెరలేచే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే చైనా ఒక వైపు, ఐరోపా సమాఖ్య- అమెరికా మరోవైపు మోహరిస్తు న్నాయి. అమెరికా కంపెనీ టెస్లా కార్ల దిగుమతికి మన కేంద్ర ప్రభుత్వంతో ఒక ఒప్పందం కుదిరిందని, వచ్చే ఏడాది నుంచి ఓడల్లో కార్లు దిగనున్నాయని వార్తలు. అధికారికంగా జనవరిలో ప్రకటించవచ్చు. రానున్న రెండు సంవత్సరాల్లో కార్ల తయారీ (విడి భాగాలను తీసుకువచ్చి ఇక్కడ అమ ర్చటం) కూడా ప్రారంభించే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. ప్రపంచంలో అత్యధిక కార్లను అమ్ముతున్న చైనా బివైడి కంపెనీతో కలిసి కార్ల తయారీని ప్రారంభిస్తామన్న మెఘా ఇంజనీరింగ్‌ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. టెస్లా రెండు వందల కోట్ల డాలర్ల మేర కార్ల తయారీ కేంద్రానికి పెట్టుబడి పెడుతుందని మన దేశం నుంచి 1,500కోట్ల డాలర్ల విలువగల విడిభాగాలను కొనుగోలు చేస్తుందని చెబుతున్నారు. కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్‌ గోయల్‌ సెప్టెంబరు నెలలో కాలిఫోర్నియాలోని టెస్లా కంపెనీని సందర్శించి వచ్చిన సంగతి తెలిసిందే. వంద కోట్ల డాలర్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో ఏటా పది నుంచి పదిహేను వేల కార్ల తయారీ, ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు చేస్తామని చైనా బివైడి-మెఘా చేసిన ప్రతిపాదనను కేంద్రం పక్కన పెట్టింది. ప్రస్తుతం ఉన్న నిబంధనలు చైనా నుంచి వచ్చే పెట్టుబడులను అనుమతించే అవకాశం లేదని కారణం చెప్పింది. మెఘా కంపెనీ పెట్టుబడిపెడితే సాంకేతిక పరి జ్ఞానం చైనా కంపెనీ అందచేస్తుందని చెప్పినప్పటికీ అంగీకరించ లేదు. దీనికి కారణం అమెరికన్‌ కంపెనీ టెస్లాను అనుమతించేందుకు సముఖంగా ఉండటమే అని చెప్పవచ్చు. మనం ఎలాగూ తయారు చేయలేనపుడు రెండు విదేశీ కంపెనీలు పోటీపడి ధరలను తగ్గిస్తే మన వినియోగదారులకు లాభం, కొన్ని విడిభాగాలు ఇక్కడే తయారీ ద్వారా కొంత మేరకు ఉపాధి కల్పించే అవకాశం ఉన్నప్పటికీ టెస్లావైపే మొగ్గుచూపటం ఏమిటన్న ప్రశ్న ముందుకు వస్తున్నది. చైనాలో స్వంతంగా తయారు చేసే కంపెనీలు ఉన్నప్పటికీ టెస్లాను కూడా అనుమతించిన కారణంగా పోటీబడి అది కూడా తక్కువ ధరలకే అక్కడ కార్లు అమ్ముతున్నది. మెఘా ఇంజనీరింగ్‌ కంపెనీ ఇప్పటికే చైనా కంపెనీతో కలసి ఎలక్ట్రిక్‌ బస్సులను తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. దానికి లేని అడ్డంకి కార్లకు వచ్చిందంటే 2020లో జరిగిన సరిహద్దు ఘర్షణలు, చైనా వ్యతిరేక కూటమిలో మన దేశం మరింతగా భాగస్వామి కావటమే అని చెప్పవచ్చు.
ఎలక్ట్రిక్‌ వాహనాల ఉత్పత్తిలో చైనా జోరు ప్రపంచ మార్కెట్లను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నది.సాంప్రదాయ కార్ల నుంచిఎలక్ట్రానిక్‌ వాహనాలకు మారితే ప్రస్తుతం తమ సంఘంలోని లక్షా యాభై వేల మంది కార్మికుల్లో 35వేల మందికి ఉపాధిపోతుందని అమెరికా యునై టెడ్‌ ఆటో వర్కర్స్‌ యూనియన్‌ తెలిపింది. తమ దేశంలో 2032 నాటికి మూడింట రెండువంతులు ఎలక్ట్రానిక్‌ కార్ల విక్ర యమే ఉంటుందని అమెరికా ప్రకటించగా, 2035 నుంచి కేవలం ఎలక్ట్రిక్‌ కార్లనే అమ్ముతామని ఐరోపా సమాఖ్య పేర్కొన్నది. ఈ లక్ష్యాలను సాధించటానికి చైనా నుంచి వాహనాల దిగుమతు లను అనుమతించాలా వద్దా అని ఆ దేశాలు మల్లగుల్లాలు పడు తున్నాయి. కేవలం ఎలక్ట్రిక్‌, ఇంథనంతోనూ నడిచే హైబ్రిడ్‌ కార్లతో సహా 2022లో ప్రపంచంలో నూటికి 60 చైనాలోనే ఉత్పత్తి చేశారు. చైనాలో ఐదువేల నుంచి 90వేల డాలర్ల వరకు ధర ఉండే 90 రకాల కార్లను అందుబాటులో ఉంచారు. సగటు ధర 53,800 డాల ర్లుండగా ఐరోపాలో 94,100 డాలర్లుంది. ఈ ఏడాది చైనాలో మొత్తం కార్ల అమ్మకాల్లో నాలుగో వంతు(80లక్షలు) ఎలక్ట్రిక్‌ కార్లుండగా, ఐరోపా సమాఖ్య దేశాల్లో 22, అమెరికాలో ఆరు, జపాన్‌లో కేవలం మూడు శాతమే ఉంటాయని అంచనా వేస్తున్నారు.
ఐరోపా సమాఖ్య(ఇయు) 2022లో చైనా నుంచి దిగుమతి చేసుకున్న కార్లు సమాఖ్య మొత్తం ఎలక్ట్రిక్‌ కార్ల అమ్మకాల్లో మూడు శాతమే. అవి 2030నాటికి 20శాతానికి చేరతాయని స్థానిక కార్ల కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. చైనా పెద్ద మొత్తంలో సబ్సి డీలు ఇచ్చిన కారణంగా తక్కువ ధరలకు విక్రయిస్తున్నట్లు ఆరోపిస్తూ వాటి మీద విచారణ జరపాలని ఇయు నిర్ణయించింది. దిగుమతి సుంకాల మీద ఒక నిర్ణయం తీసుకొనేందుకు పూనుకుంది. ఇయు నిర్ణయం రక్షణాత్మక చర్యలు తప్ప మరొకటి కాదని వెంటనే చైనా స్పందించింది. అక్కడ ఇస్తున్న సబ్సిడీల సంగతేమిటని ప్రశ్నించింది. ఏ హౌదాతో తమపై విచారణ జరుపుతుందని నిలదీసింది. చైనా నుంచి వస్తున్న దిగుమతులతో స్థానికంగా ఉన్న కార్ల గిరాకీ 20 శాతం తగ్గుతుందని అంచనా. చైనా కస్టమ్స్‌ సమాచారం ప్రకారం వర్తమాన సంవత్సరం ఏడునెలల్లో గతేడాది కంటే 113శాతం పెరగ్గా, 2020తో పోల్చితే3, 205 శాతం ఎక్కువ. చైనా ఇస్తున్న సబ్సిడీలు ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే పోరాడాల్సిందేనని జర్మనీ మంత్రితో భేటీ అయిన ఫ్రెంచి ఆర్థిక మంత్రి బ్రూనో లీ మెయరే చెప్పాడు. అయితే కొందరు ఐరోపా వాణిజ్యవేత్తలు దర్యాప్తును వ్యతిరేకిస్తున్నారు. దీంతో చైనా కూడా ఎదురుదాడికి దిగితే తమ ప్రయోజనాలు దెబ్బతింటాయని ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు అనేక దేశాలు చైనా నుంచి చౌకగా వచ్చే కార్లను దిగుమతి చేసుకోవాలని ఉన్నా స్థానిక కార్మికులకు పని లేకుండా పోతుందనే భయం మరోవైపు ఉంది.ప్రపంచంలో ఆటో పరిశ్రమల్లో కార్మికులు కోటీ నలభై లక్షల మంది ఉండగా చైనాలో 40లక్షలు,ఇయులో 25, అమెరికా, మెక్సికో, జపాన్లలో పది లక్షల వంతున ఉన్నారు. గతేడాది ప్రపంచ కార్ల ఎగుమతి విలువ 780 బిలియన్‌ డాలర్లు కాగా ఇయు 407, జపాన్‌ 87, అమెరికా 58, దక్షిణ కొరియా 52, మెక్సికో 47 బి.డాలర్ల వాటా కలిగి ఉండగా చైనా 45 బి.డాలర్ల మేరకే ఎగుమతి చేసింది. ఉక్కు రంగంలో 2021లో మిగతా దేశాలను వెనక్కు నెట్టేసినట్లుగా రానున్న రోజుల్లో కార్లలో కూడా చైనా అగ్రస్థానానికి వస్తుందేమోనన్న భయం వెల్లడవుతోంది.
అమెరికాలో పికప్‌ ట్రక్కుల మీద 25శాతం తప్ప సాధారణ పన్ను 2.5శాతమే, అయితే చైనాతో వాణిజ్యపోరు ప్రారంభించిన డోనాల్డ్‌ ట్రంప్‌ చైనా కార్ల మీద 25శాతం విధించగా దాన్ని జోబైడెన్‌ కొనసాగిస్తున్నాడు. జపాన్‌లో అసలు పన్ను లేదు, పదిశాతం వసూ లు చేస్తున్న ఇయు చైనా కార్ల మీద పన్ను పెంచాలని చూస్తున్నది. చైనా కంపెనీలు తక్కువ ధరలకు కార్లను ఎందుకు విక్రయించగలు గుతున్నాయన్నది ప్రశ్న. ఎలక్ట్రిక్‌ కార్లలో కీలకమైనవి. లిథియం – అయాన్‌ బ్యాటరీలు. వీటి పరిశోధన-అభివృద్ధికి చైనా ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టింది. ఆ రంగంలో ఉన్నవారికి రాయితీలి చ్చింది. దానికి తోడు వాటి తయారీకి అవసరమైన ముడిపదార్దాలు చైనాలో పుష్కలంగా ఉండటం అక్కడి కంపెనీలకు కలసివచ్చింది. దీంతో స్థానిక వినియోగదారులు ఆకర్షితులౌతున్నారు. ప్రపంచంలో వందకార్లు అమ్మితే గతేడాది చైనాలోనే 59 అమ్మారు. ఈ ఊపుతో ప్రపంచ మార్కెట్లకు విస్తరించాలని అక్కడి కంపెనీలు చూస్తున్నాయి. ఐరోపా దేశాల్లో తలెత్తిన కాలుష్యం కారణంగా రోడ్ల మీద ధ్వనితో 40శాతం మంది బ్రిటీష్‌ పౌరులు అనారోగ్యానికి గురవుతు న్నట్లు తేలింది.వాయు కాలుష్యంతో శ్వాస సమస్యలు పెరుగుతు న్నాయి. పెట్రోలు, డీజిల్‌ కార్లతో పోలిస్తే ఎలక్ట్రిక్‌ కార్ల వలన 17 నుంచి 30శాతం వరకు గ్రీన్‌హౌస్‌ గ్యాస్‌ విడుదల తగ్గుతుందని అంచనా. అందుకే 2035నాటికి బ్రిటన్‌లో మొత్తం ఎలక్ట్రిక్‌ కార్లనే అమ్మాలని నిర్ణయించారు. ఒకవైపు చమురు ఇంథన కాలుష్యం తగ్గుతుందనే సానుకూలత ఉన్నా ప్రతికూలతల గురించి కూడా చర్చ మొదలైంది. హరిత ఇంథనం కోసం ధనికదేశాల ప్రయత్నం పేద దేశాల్లో పర్యావరణ సమస్యలను సృష్టిస్తున్నది.
ప్రస్తుత తీరుతెన్నులను చూస్తే చైనా – ఇతర దేశాల మధ్య కార్ల ధరల యుద్దం జరిగే సూచన కనిపిస్తున్నది. అమెరికా కంపెనీ టెస్లా దీనికి నాంది పలికింది.దీంతో చైనాలోని కొన్ని రకాల కార్ల ఉత్పత్తిని ఆపివేయాల్సి వచ్చింది.ఈ ఏడాది తొలి ఏడు నెలల్లో దేశీ య మార్కెట్లో 114లక్షల కార్లను విక్రయించగా 20లక్షలు ఎగుమతి చేసింది. విదేశీ ఎగుమతులు 80శాతం పెరగ్గా, స్వదేశీ మార్కెట్‌ 1.7శాతమే పెరిగినందున ధరల పోటీకి దిగితే చైనా కూడా నష్ట పోవచ్చని కొందరు చెబుతున్నారు.గతేడాది డిసెంబరు నాటికి చైనాలో 4.3 కోట్ల కార్ల ఉత్పత్తి సామర్ధ్యం ఉందని, ఉన్న సామ ర్ధ్యంలో 2017లో 66.6శాతం వినియోగిస్తే గతేడాది 54.5శాతంగా ఉందని రాయిటర్స్‌ పేర్కొన్నది. అక్కడ ఆటోపరిశ్రమ మీద ప్రత్య క్షంగా పరోక్షంగా మూడు కోట్ల మంది ఆధారపడి ఉన్నారు. జపాన్‌ కార్ల పరిశ్రమకు సైతం చైనా సెగతగులుతోంది. టయోటా తదితర కంపెనీలు తమ డిమాండ్‌ పడిపోకుండా చూసుకుంటున్నాయి. చైనాలో హైబ్రిడ్‌ కార్లకు మార్కెట్‌ ఎక్కువగా ఉంది. నిజంగా కార్ల ధర యుద్దమే తీవ్రమైతే చైనాకు తక్షణమే ఇబ్బంది ఉండదు. ఇప్ప టికే సామర్ధ్యాన్ని సమకూర్చుకున్నందున పూర్తిస్థాయిలో ఉత్పత్తి వెంటనే జరపవచ్చు, అదే మిగతా దేశాల్లో సామర్ధ్యాన్ని పెంచుకొనేందుకు భారీగా పెట్టుబడులను కూడా పెట్టాల్సి వస్తుంది.
మన దేశంలో ఎలక్ట్రానిక్‌ కార్ల తయారీకి పూనుకుంటే ముడి పదార్దాలు, బ్యాటరీల కోసం చైనా మీద ఆధారపడటం పెరుగుతుం దని గ్లోబల్‌ ట్రేడ్‌ రిసర్చ్‌ ఇనీషియేటివ్‌(గిట్రి) ఈ ఏడాది మార్చి నెలలో తన నివేదికలో పేర్కొన్నది. భారత్‌లో తయారయ్యే వాహనాలకు అవసరమైన వాటిలో 70శాతం వస్తువులను చైనా, ఇతర దేశాల నుంచి సమకూర్చుకోవాల్సి ఉంటుంది.కాలుష్యం, ఉపాధిపై తలెత్తే పర్యవసానాల వంటి 13 అంశాలను గిట్రి గుర్తించింది. ఈ వాహ నాల బ్యాటరీలను దిగుమతి చేసుకోవాలి, ధరలు ఎక్కువగా ఉంటాయి, ఆరేడు సంవత్సరాల తరువాత కొత్తవాటిని వేసుకోవాలి, వాటిని రీసైకిల్‌ చేయాలంటే వెలువడే విషపదార్దాలు సమస్యగా మారతాయి, దీని వలన విద్యుత్‌ గిరాకీ పెరుగుతుంది, బొగ్గుద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్‌ ప్రక్రియలో కాలుష్యం పెరుగుతుంది. దూరప్రయాణాలకు అనువుగా ఉండవు, ప్రజా రవాణాకు పెద్దగా ఉపయోగ పడవు, చైనామీద ఎక్కువగా ఆధారపడటం వంటి అంశాలను పేర్కొన్నది. ఆటో విడిభాగాలను తయారు చేసే ఏడు వందల సంఘటిత రంగ సంస్థలతో పాటు పదివేల అసంఘటిత రంగ సంస్థల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. విడిభాగాలు అమ్మేవారు, లక్షలాది గారేజ్‌ షాపులు, సర్వీసు సెంటర్ల ఉనికి ప్రశ్నార్ధకం అవుతుందని కూడా పేర్కొన్నది. తమ కాలుష్యకారక పరిశ్రమలను రక్షించుకొనేందుకు, ప్రపంచ వాణిజ్యాన్ని చిన్నాభిన్నం చేసేందుకు ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మళ్లాలని ఐరోపా దేశాల చెబుతున్నాయి తప్ప ప్రపంచ మంతా అలా లేదు. ఎలక్ట్రిక్‌ స్కూటర్లకు చార్జర్లకు ఒక ప్రమాణం లేదు, అందువలన ప్రతి సంస్థ తనదైన నమూనాను ఇస్తున్నది, దేశ మంతటా ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నదని గిట్రి పేర్కొన్నది.
ఎం కోటేశ్వరరావు
8331013288

Spread the love