– పరిహారం ఇచ్చాకే పోలవరం కట్టాలి
– సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.ఉమామహేశ్వరరావు
– ఏజెన్సీ జిల్లా ఏర్పాటుపై ఇక పోరుబాట : మంతెన సీతారాం
– ఏలూరు జిల్లా మహాసభ సందర్భంగా ప్రదర్శన, బహిరంగ సభ
ఏలూరు : అదానీని కాపాడడమే మోడీ లక్ష్యమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.ఉమామహేశ్వరరావు విమర్శించారు. గడిచిన పదేళ్లలో ప్రజలకు ఉపయోగపడే పని ఏదైనా మోడీ చేశారా? అని ప్రశ్నించారు. ఒకే దేశం, ఒకే ఎన్నిక, ఒకే సంస్కృతి అంటూ దేశాన్ని చిన్నాభిన్నం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. 22 మంది ఎంపిలతో మోడీకి చంద్రబాబు ఆక్సిజన్ ఇస్తున్నారని, అయితే పోలవరం నిర్వాసితుల గురించి మాత్రం ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ఇది జాతీయ ప్రాజెక్టు అని, పునరావాసం కల్పించాల్సిన బాధ్యత కేంద్రానిదేనన్నారు. రూ.35 వేల కోట్లు ఉంటే తప్ప పునరావాసం పూర్తి కాదన్నారు. ఖనిజ, వృక్ష సంపదను కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని వివరించారు. రాజ్యాంగాన్ని కాపాడుకోకపోతే బానిసలా బతకాల్సి వస్తుందన్నారు. మూడు రోజులపాటు జరగనున్న సిపిఎం ఏలూరు జిల్లా 26వ మహాసభలో భాగంగా తొలిరోజు శుక్రవారం మండల కేంద్రమైన బుట్టాయగూడెం శివారు కన్నాపురం రోడ్డులోని పెట్రోలు బంకు నుంచి సినిమా హాలు సెంటర్ వరకూ భారీ ప్రదర్శన నిర్వహించారు. గిరిజన నృత్యాలు, విల్లంబుల ప్రదర్శన, నాయకుల నినాదాలతో ప్రదర్శన సాగింది. ఈ సందర్భంగా సినిమా హాలు సెంటర్‌లో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ముఖ్యఅతిథులుగా వి.ఉమామహేశ్వరరావుతోపాటు రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం పాల్గొన్నారు. వి.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ… తమకు తామే మంచి ప్రభుత్వం అని టిడిపి కూటమి ప్రభుత్వం స్టిక్కర్లు అంటించుకుంటుందని, సూపర్ సిక్స్‌లో భాగమైన ఉచిత బస్సు వంటివేమీ అమలు కాలేదని అన్నారు. రోడ్లు బాగు చేయమంటే టోలు గేటు పెట్టి తోలు తీస్తామంటున్నారని వ్యాఖ్యానించారు. విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పి రూ.13 వేల కోట్లు భారం వేశారని, మరో రూ.ఐదు వేల కోట్లు వడ్డింపునకు సిద్ధంగా ఉన్నారని వివరించారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం ఏ ఒక్కటీ అమలు కాలేదని విమర్శించారు. రూ.మూడు లక్షల కోట్లు విలువ చేసే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని రూ.పది వేల కోట్లుకు కట్టబెట్టాలని చూస్తున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అంచనాలు, డిజైన్ల గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడుతున్నాయే తప్ప సర్వం కోల్పోతున్న లక్షలాది మంది నిర్వాసితుల పునరావాసం గురించి మాట్లాడడం లేదని, నిర్వాసితులకు పునరావాసం కల్పించిన తర్వాత ప్రాజెక్టు నిర్మించాలని డిమాండ్ చేశారు. మంతెన సీతారాం మాట్లాడుతూ.. పోలవరం, రంపచోడవరం నియోజకవర్గాలను కలిపి కొత్త జిల్లాగా ఏర్పాటు చేయాలని త్వరలో ఉద్యమించనున్నామన్నారు. ఆదివాసీల భూ ఉద్యమం 30 ఏళ్లుగా సజీవంగా ఉందని, మున్ముందు కూడా అలానే ఉంటుందని తెలిపారు. భూమే అన్ని సమస్యలకూ పరిష్కారమన్నారు. భూమే అన్ని సమస్యలకూ పరిష్కారమన్నారు. ఇప్పటి వరకూ 20 శాతం భూమి గిరిజనులకు దక్కిందని, మిగిలింది కూడా పోరాటాల ద్వారా సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఏజెన్సీలో యువత భూ ఉద్యమాల దిశగా ఆలోచించాలన్నారు. భూమి ఉంటే చదువు, ఇల్లు అన్నీ సమకూరుతాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్.లింగరాజు, డిఎన్‌విడి.ప్రసాద్, తెల్లం రామకృష్ణ, మొడియం నాగమణి, జి.రాజు, జిల్లా నేతలు పాల్గొన్నారు.