అవినీతిపై మోడీ వ్యాఖ్యలు హాస్యాస్పదం

– వారి వైపు అవినీతి పార్టీలు : తమిళనాడు సీఎం స్టాలిన్‌
న్యూఢిల్లీ : ప్రధాని మోడీ ప్రతిపక్ష పార్టీలపై ఇటీవల చేసిన వ్యాఖ్యల మీద తమిళనాడు సీఎం ఎం.కె స్టాలిన్‌ స్పందించారు. అవినీతిపై మోడీ చేసిన వ్యాఖ్యలు ‘బ్లాక్‌ కామెడీ’ అని వివరించారు. అక్రమాస్తుల కేసులను ఎదుర్కొంటున్న నాయకులు వారి పక్షాన ఉన్నారని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలకు రాసిన లేఖలో స్టాలిన్‌ పై విధంగా పేర్కొన్నారు. ప్రతిపక్ష నేత పళనిస్వామి ‘ఏఐఏడీఎంకేలోని ఒక విభాగానికి’ నాయకత్వం వహించే నాయకుడని వ్యంగ్యాస్త్రం సంధించారు. బహిష్కరణకు గురైన నాయకుడు పన్నీర్‌సెల్వం ఏఐఏడీఎంకే నాయకత్వంపై రాజకీయ, న్యాయపరమైన వాదనలను కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. ”జులై 18న ఢిల్లీలో ఎన్డీయే సమావేశాన్ని హడావుడిగా ఏర్పాటు చేశారు. ప్రతిపక్షాల బెంగళూరు సమావేశాన్ని ముందుగానే ప్లాన్‌ చేశారు. పళనిస్వామి వంటి పలువురు నాయకులు దేశ రాజధానిలో జరిగిన సమావేశంలో పాల్గొనడం ద్వారా తమ ‘విధేయతను’ ప్రదర్శించవలసి వచ్చింది. బీజేపీ, దాని కూటమి పార్టీలైన అన్నాడీఎంకే రెండూ చేతులు కలపడం తప్ప మరో మార్గం లేదు. ‘నిజం’ ఏమిటంటే, రెండు వైపులా కాషాయ పార్టీ దాని మిత్రపక్షాలకు ప్రజల్లో ఎటువంటి ప్రభావం లేదు” అని స్టాలిన్‌ పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలపై అవినీతి ఆరోపణలు చేయడం, అవినీతి కేసులను ఎదుర్కొన్న పార్టీలను తన దగ్గర ఉంచుకోవడంపై ప్రధాని మోడీ మాట్లాడటం హాస్యభరితమైన వేదన అని అభివర్ణించారు. ప్రజల్లో ఉన్న ‘మత, ప్రజావ్యతిరేక శక్తుల’ను బయటపెట్టాలని స్టాలిన్‌ తన పార్టీ కార్యకర్తలకు ఉద్బోధించారు. ‘నలభై మాది (తమిళనాడులో 39 లోక్‌సభ స్థానాలు, పుదుచ్చేరిలో ఒకటి), దేశం మనది’ అనే లక్ష్యంతో ఎన్నికలకు సిద్ధం కావాలని డీఎంకే కార్యకర్తలను ఆయన కోరారు.

Spread the love