కాంగ్రెస్‌పై మోడీ ఎదురుదాడి

నవతెలంగాణ హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల్లో దేశ ప్రజలంతా పరిపక్వతతో తీర్పునిచ్చారని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. వరుసగా మూడోసారి తాము అధికారంలోకి రావడంతో కొందరు తీవ్ర మనస్తాపానికి గురయ్యారని కాంగ్రెస్‌కు పరోక్షంగా చురకలంటించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం చర్చ సందర్భంగా ప్రధాని మోడీ మంగళవారం లోక్‌సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా విపక్షాలపై విరుచుకుపడ్డారు. ఎన్ని అబద్ధాలు చెప్పినా లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాలకు మళ్లీ ఘోర ఓటమి తప్పలేదని.. వారి బాధను అర్థం చేసుకోగలనని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీపై మోడీ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.
‘‘కాంగ్రెస్‌  ప్రతిపక్షంలోనే కూర్చోవాలని ప్రజలు మరోసారి తీర్పునిచ్చారు. వరుసగా మూడు సార్లు ఆ పార్టీ 100 మార్క్‌ దాటలేదు. ఇన్నిసార్లు ఓడినా వారిలో ఎలాంటి మార్పు రాలేదు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో ప్రతిపక్ష నేతలకు అర్థం కావట్లేదు. 99 సీట్లు వచ్చాయని కాంగ్రెస్‌ నేతలు మిఠాయిలు పంచుకుంటున్నారు. కాంగ్రెస్‌కు వందకు 99 సీట్లు రాలేదు. 543లో 99 వచ్చాయి. వారి స్ట్రైక్‌ రేట్‌ 26శాతం మాత్రమే. ప్రజా తీర్పును వారు ఇకనైనా గౌరవించాలి’’ మోడీ దుయ్యబట్టారు.
‘‘వికసిత్‌ భారత్‌ లక్ష్యంగా రాష్ట్రపతి మార్గదర్శనం చేశారు. రాష్ట్రపతి ప్రసంగంపై పలువురు సభ్యులు అభిప్రాయాలు చెప్పారు. సభ గౌరవాన్ని, హుందాతనాన్ని కాపాడాల్సిన బాధ్యత మనదే. పదేళ్లలో అవినీతిరహిత పాలన అందించాం. అది చూసే ప్రజలు మరోసారి మాకు అవకాశమిచ్చారు. గత పదేళ్లలో ప్రపంచ దేశాల్లో దేశ ప్రతిష్ఠ మరింత పెరిగింది. ఇవాళ ప్రపంచమంతా మనవైపు చూస్తోంది. భారత్‌ ప్రథమ్‌ అనే మా విధానాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం. ఏ కార్యక్రమం చేపట్టినా భారత్‌ ప్రథమ్‌ కేంద్రంగానే తీసుకుంటున్నాం. మా పథకాలన్నీ అట్టడుగు వర్గాలకు చేరాలనేదే మా విధానం’’ అని ప్రధాని మోడీ తెలిపారు.

Spread the love