మోడీ ‘గ్యారంటీలు’ చాలవు

Modi's 'guarantees' are not enough– వ్యవసాయం పైనా దృష్టి సారించాలి
– ఉద్యోగ కల్పనే ప్రధాన సవాల్‌
న్యూఢిల్లీ : ‘మోడీ గ్యారంటీలు’ సరిపోవని లోక్‌సభ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. నిరుద్యోగం, వ్యవసాయం వంటి కీలక అంశాలపై ప్రభుత్వం పటిష్టవంతమైన విధానాలు రూపొందించుకోవాల్సిన అవసరం ఉన్నదని ప్రజలు కోరుకుంటున్నారు. గత దశాబ్ద కాలంగా దిగువసభలో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ ఉంది. అయితే ఈసారి మ్యాజిక్‌ ఫిగర్‌ను చేరుకోలేక చతికిలపడింది. సమాజంలోని కొన్ని వర్గాల్లో నెలకొన్న ఆర్థికపరమైన అశాంతికి పరిష్కారం కనుగొనడంలో మోడీ ప్రభుత్వం విఫలమైంది. అదే ప్రస్తుత ఫలితాల్లో ప్రతిబింబిస్తోంది. ముఖ్యంగా యువత, అన్నదాతల ఆకాంక్షలను ప్రభుత్వం నెరవేర్చలేకపోయింది.
యువతకు ఉపాధి కల్పించే విషయంలో రాబోయే ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకోసం ముందుగా జాతీయ ఉపాధి విధానాన్ని రూపొందించుకోవాలి. దానిపై విధానపరమైన సంప్రదింపులు జరపాలి. 2014కు ముందు కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రభుత్వం ఇలాంటి విధానాన్నే రూపొందించి, వివిధ వర్గాలతో చర్చించింది. అయితే జాతీయ ఉపాధి విధానాన్ని అభివృద్ధి చేసే ఆలోచన ఏదీ లేదని ఆ తర్వాత 2022లో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం తేల్చి చెప్పింది.
ఉద్యోగ కల్పన దిశగా ప్రయివేటుకు రాయితీలు
దేశంలోని 90 శాతానికి పైగా కార్మికులు ప్రభుత్వ మద్దతు, నియంత్రణ లేని ఆర్థిక వ్యవస్థలో పనిచేస్తున్నారు. అలాంటి కార్మికులకు ఉద్యోగాలు కల్పించి, సామాజిక భద్రత చేకూర్చే దిశగా ప్రతి ఒక్కరితోనూ చర్చలు జరపాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఇప్పుడు ప్రయివేటు రంగానికి అనేక రాయితీలు అందిస్తోంది. అయితే ఉద్యోగ కల్పన సామర్ధ్యం ఉన్న సంస్థలకే రాయితీలందించేలా విధానాలు రూపొందిం చుకుంటే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి.
మహిళల్లోనే నిరుద్యోగం అధికం
దేశం అధిక వృద్ధి రేటు సాధించిందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నప్పటికీ అది ఉద్యోగ కల్పనకు పెద్దగా దోహదపడడం లేదు. దేశంలోని కార్మికుల్లో 15-29 సంవత్సరాల మధ్య వయస్కుల్లోనే నిరుద్యోగ రేటు అధికంగా ఉన్నదని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. మరో ముఖ్యమైన విషయమేమంటే లింగ అసమానతలు. పురుషులతో పోలిస్తే మహిళలకు ఉద్యోగావకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ ఏడాది మొదటి త్రైమాసిక కాలంలో యువతలో నిరుద్యోగ రేటు 17 శాతంగా ఉంది. యువ మహిళా కార్మికుల్లో నిరుద్యోగ రేటు 22.7 శాతానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం లేబర్‌ మార్కెట్‌లో చోటుచేసుకున్న ఒత్తిడిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రయివేటు రంగం నుండి పెట్టుబడులను ప్రోత్సహించి ఉపాధి కల్పనను పెంచాలి.
వ్యవసాయంలో ఆదాయం అంతంత మాత్రమే
వ్యవసాయ రంగానికి సంబంధించి ఎన్డీఏ ప్రభుత్వం అవలంబిస్తున్న ఆర్థిక విధానాలు నష్టదాయకంగా ఉంటున్నాయి. దేశంలోని కార్మికుల్లో ఎక్కువ మంది వ్యవసాయ రంగం పైనే ఆధారపడుతున్నారు. 2022-23 సంవత్సరపు ఆర్థిక సర్వే ప్రకారం దేశ జనాభాలో 65 శాతం మంది (2021 సమాచారం) గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. జనాభాలో 47 శాతం మంది జీవనాధారం కోసం వ్యవసాయంపై ఆధారపడ్డారు. అయితే వారికి తగినంత ఆదాయం లభించడం లేదు. గ్రామీణ కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదే.
సమస్యలకు పరిష్కారాలు ఏవి?
2020లో మోడీ ప్రభుత్వం మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చింది.వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకు బడా వ్యాపారులను అనుమతిం చేందుకు ఈ చట్టాలను రూపొందించారు.1960వ దశకం నుంచి రైతుల నుండి ప్రభుత్వ సంస్థలే వ్యవసాయోత్పత్తులను కొనుగోలు చేస్తున్నాయి.వాటి స్థానంలో బడా వ్యాపారులను అనుమతించడమే వ్యవసాయ చట్టాల ముఖ్యోద్దేశం.అయితే రైతుల ఆందోళన కారణంగా ప్రభుత్వం ఈ చట్టాలను వెనక్కి తీసుకున్నప్పటికీ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న వ్యవసాయ రంగ సమస్యలను పరిష్కరించాలంటూ రైతులు చేస్తున్న డిమాండ్‌ను మాత్రం ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. జాతీయ వ్యవసాయ విధానాన్ని రూపొందించే విషయంలో రాజకీయ చిత్తశుద్ధి కొరవడింది.అమెరికా ప్రభుత్వం వ్యవసాయ చట్టాన్ని, యూరోపియన్‌ యూనియన్‌ సభ్యులు ఉమ్మడి వ్యవ సాయ విధానాన్ని రూపొందించినప్పటికీ స్వాతంత్య్రా నంతరం ఏర్పడిన భారత ప్రభుత్వాలు మాత్రం ఆ దిశగా ఎలాంటి ముందడుగు వేయడం లేదు.

Spread the love