మోడీ గుత్తాధిపత్యం ఉద్యోగాలను హరిస్తోంది

Modi monopoly It is killing jobs– రాహుల్‌ మండిపాటు
న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ గుత్తాధిపత్య నమూనా ఉద్యోగాలను హరిస్తోందని కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలను ధ్వంసం చేసి ప్రజలకు ఉద్యోగావకాశాలు లేకుండా చేశారని మోడీపై మండిపడ్డారు. జీఎస్టీని సరళతరం చేయాలని, బ్యాంకులు చిన్న చిన్న వ్యాపారులకు ఆర్థిక సాయం అందించి తద్వారా వారి వ్యాపారాలను అభివృద్ధి చేసుకునేందుకు, ఉద్యోగాలు కల్పించేం దుకు చేయూత అందించాలని డిమాండ్‌ చేశారు. జమ్మూకాశ్మీర్‌ ఎన్నికల ప్రచారం సందర్భంగా యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలలో నిరాశానిస్పృహలు చూశానని, దేశంలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారు పడుతున్న ఇబ్బందులకు ఇది అద్దం పడుతోందని చెప్పారు. జమ్మూలో కొద్ది రోజుల క్రితం ఆల్‌ ఇండియా ప్రొఫెషనల్‌ కాంగ్రెస్‌ (ఏఐపీసీ) ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తాను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో జరిపిన చర్చల వీడియోను రాహుల్‌ ఈ సందర్భంగా షేర్‌ చేశారు. ‘జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు వంటి అసమర్ధ విధానాల ద్వారా చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై ప్రభుత్వం ఓ పద్ధతి ప్రకారం దాడి చేస్తోంది. దేశాన్ని ఉత్పత్తి చేసే ఆర్థిక వ్యవస్థ నుండి వినియోగించే ఆర్థిక వ్యవస్థగా మార్చేస్తోంది. ఈ వృద్ధి రేటుతో మనం చైనాతో పోటీ పడలేము. దేశ ప్రజలందరికీ సౌభాగ్యాన్ని అందించలేము’ అని రాహుల్‌ చెప్పారు. గుత్తాధిపత్యం చెలాయిస్తున్న ఐదు పది మంది నుండి చిన్న, మధ్య తరహా వ్యాపారులు తీవ్రమైన దాడిని ఎదుర్కొంటున్నారని తెలిపారు.

Spread the love