మోడీ విధానాలతో దేశానికే ముప్పు

Modi's policies are a threat to the country– ప్రజలకు పేదరికం, కార్పొరేట్లకు రూ.కోట్ల ఆదాయం
– అగ్రిస్‌యాక్టుతో రైతులు కూలీలుగా మారే అవకాశం
– పోరాటాలతోనే ప్రభుత్వాలకు బుద్ధి : సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు
– మిర్యాలగూడలో ప్రారంభమైన సీపీఐ(ఎం) నల్లగొండ జిల్లా మహాసభలు
– రెడ్‌షర్ట్‌ వాలంటీర్స్‌తో భారీ ప్రదర్శన, బహిరంగసభ
నవతెలంగాణ-మిర్యాలగూడ
ప్రధాని మోడీ విధానాల వల్ల భవిష్యత్‌లో దేశానికి ముప్పు వాటిల్లనుందని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు విమర్శించారు. సీపీఐ(ఎం) నల్లగొండ జిల్లా 21వ మహాసభలు మిర్యాలగూడలో సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వేలాదిమందితో మహా ప్రదర్శన నిర్వహించారు. అనంతరం సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి అధ్యక్షతన ఎన్నెస్పీ క్యాంపులో జరిగిన బహిరంగసభలో రాఘవులు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు ఉద్యమాల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. దేశ సంపదను కొల్లగొట్టి పది మంది కార్పొరేట్లకు కోట్లాది రూపాయలను అప్పనంగా అప్పజెప్తున్నారని, సామాన్య ప్రజలు మాత్రం పేదరికంలోకి నెట్టబడేలా విధానాలను అనుసరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుచట్టాలపై ఢిల్లీలో రైతులు ఉద్యమం చేపట్టగా మోడీ వెనక్కు తగ్గారని, కొన్ని హామీలను సైతం ఇచ్చారని గుర్తుచేశారు. కానీ వాటిని ఇప్పటివరకు అమలుచేయలేదని అన్నారు. రైతులకు కనీసం గిట్టుబాటుధర చట్టం తేవాలని, సంక్షోభం నుంచి వ్యవసాయాన్ని కాపాడాలని, ఢిల్లీ ఆందోళనలో అమరులైన రైతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, రైతులపై పెట్టిన అక్రమకేసులను ఎత్తివేయాలని డిమాండ్‌ చేస్తూ మరోమారు రైతులు ఢిల్లీ బాట పడుతున్నారని చెప్పారు. మోడీ విధానాల వల్ల రైతులు దివాళా తీస్తున్నారని, అప్పులు, ఆత్మహత్యలు పెరిగి గ్రామాలను వదిలి పట్టణాలకు వలస వెళ్త్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల కష్టార్జితంతోనే అంబానీ తన కొడుకు పెండ్లికి రూ.4వేల కోట్లు ఖర్చు పెట్టారని విమర్శించారు. విద్యుత్‌ భారాలను పేదలపై మోపేందుకు గతంలో అదానీ తెలంగాణకు రూ.2029కోట్లు, ఆంధ్రాకు రూ.1750కోట్లు లంచంగా ఇచ్చారని విమర్శించారు. దేశంలో ఏ ఒక్క రాజకీయ పార్టీ నిజాయితీగా లేదని, సీపీఐ(ఎం) మాత్రమే పేదల కోసం నిజాయితీగా పనిచేస్తుందన్నారు.
రైతుల భూములను కార్పొరేట్‌శక్తులకు అప్పజెప్పేందుకు అగ్రిస్‌యాక్టు పథకాన్ని మోడీ ప్రభుత్వం తీసుకొచ్చేందుకు యత్నిస్తోందని తెలిపారు. ఈ యాక్ట్‌ ద్వారా భూములను కంప్యూటరీకరణ చేసి రైతు ఐడీ కార్డుతో దాన్ని అనుసంధానం చేసి కొనుగోలు, అమ్మకాలు సులువుగా జరిగేందుకు వెసులుబాటు కల్పిస్తుందన్నారు. తద్వారా బలహీనమైన రైతులకు ఆశచూపి ఆ భూములను లాక్కొనే ప్రయత్నం చేస్తున్నారని, ఈ యాక్ట్‌ ద్వారా భవిష్యత్‌లో రైతులు కూలీలుగా మారే అవకాశం ఉందన్నారు. రాష్ట్రాలకు హక్కులు లేకుండా మోడీ కొత్తచట్టాలు తీసుకొస్తున్నారని, దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు మున్సిపాలిటీలుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఒకే దేశం, ఒకే ఎన్నిక విధానం ద్వారా స్థానిక సంస్థలు నిర్వీర్యం కావడంతో పాటు ప్రాంతీయ పార్టీలు కనుమరుగవుతాయని తెలిపారు. ప్రజలు తిరగబడితే ప్రభుత్వాల మనుగడ కష్టమని, ఇటీవల శ్రీలంక, నేపాల్‌లో జరిగిన పరిణామాలే ఉదాహరణ అని అన్నారు. లగచర్లలో ఫార్మాకంపెనీ రద్దు కమ్యూనిస్టులు ముందుండి పోరాడటం వల్లనే సాధ్యమైందని గుర్తు చేశారు. ప్రజాఉద్యమాలు నిర్వహించి బలమైన శక్తిగా ఎదుగుతామని, ఎర్రజెండాకు పూర్వ వైభవం తేవాలని పిలుపునిచ్చారు. అనంతరం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి. మల్లు లక్ష్మీ మాట్లాడారు. ఈ సభలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య, డబ్బికార్‌ మల్లేశ్‌, సయ్యద్‌ హాషం, కందాల ప్రమీల, పాలడుగు ప్రభావతి, నాగార్జున, చినపాక లక్ష్మీనారాయణ, కూన్‌రెడ్డి నాగిరెడ్డి, బండా శ్రీశైలం, జిల్లా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love