మాలే : మాల్దీవులు అధ్యక్షు డిగా ప్రతిపక్ష కూటమి అభ్యర్థి మహ్మద్ ముయిజ్జు ఎన్నికయ్యారు. ప్రస్తుత అధ్యక్షులు ఇబ్రహీం మొహమ్మద్ సోలిహ్ తో హోరాహో రీగా జరిగిన పోటీలో ముయిజ్జు ఎన్నికైనట్టు అధికారులు ఆదివారం ప్రకటించారు. శనివారం మాల్దీవులు అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా 86 శాతం ఓటింగ్ నమోదయింది. ముయిజ్జుకి సుమారు 54 శాతం ఓట్లు లభించగా, ప్రస్తుత అధ్యక్షులు మొహమ్మద్ సోలిహ్ కి 46 శాతం ఓట్లు లభించాయి. పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్, ప్రొగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ అనే ప్రతిపక్ష పార్టీల కూటమి తరుపున ముయిజ్జు పోటీ చేశారు. ముయిజ్జు ఎన్నికతో మాల్దీవుల విదేశాంగ విధానంలో తీవ్రమైన మార్పులు రానున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా సోలిహ్ ఓటమి భారత్‌కు పెద్ద దెబ్బగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముయిజ్జు తన ప్రచారం సమయంలో కూడా ఇదే విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించేవారు. ‘భారత్ ఫస్ట్’ అనే విధానాన్ని సోలిహ్ అనుసరిస్తున్నారని ఆరోపించారు. మాల్దీవులు స్వాతంత్య్రాన్ని, సార్వభౌమత్వాన్ని పరిరక్షిస్తానని వాగ్దానం చేశారు.