– ఆంధ్ర వేటగాళ్లతో విడిసి ఒప్పందం
నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండల కేంద్రంలో గత మూడు రోజులుగా కోతుల వేట కొనసాగుతుంది. కోతులను పట్టేందుకు స్థానిక గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆంధ్రకు చెందిన వేటగాళ్లతో ఒప్పందం చేసుకొని కోతులను పట్టిస్తున్నారు. వేటగాళ్లు పట్టుకునే ఒక్కో కోతికి రూ. 400 చెల్లించేలా బేరం కుదుర్చుకొని గత మూడు రోజులుగా వేటగాళ్లు వాటిని పడుతున్నారు. గత కొంతకాలంగా గ్రామంలో కోతుల బెడద ఎక్కువైంది. గ్రామంలో పలువురిపై కోతులు దాడులు చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటనలు జరిగాయి. ఇండ్లపై పెంకుల్ని పగలగొట్టి నష్టం చేశాయి. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కోతుల్ని పట్టించాలనే గ్రామస్తుల కోరిక మేరకు స్థానిక గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అటవీ శాఖ అధికారుల సహకారంతో కోతుల వేట కొనసాగుతుంది. స్థానిక అటవీ రేంజ్ కార్యాలయంలో కోతుల్ని పట్టేందుకు బోన్లు ఏర్పాటు చేశారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చెట్లపై తిష్ట వేసి విద్యార్థులను భయబ్రాంతులకు గురి చేస్తున్న కోతుల్ని పట్టుకునేందుకు పాఠశాలలో కూడా ప్రత్యేకంగా ఒక బోనును ఏర్పాటు చేశారు. కోతులు పట్టేందుకు ఏర్పాటు చేసిన బోనులో ఎరగ వేసేందుకు అరటి పండ్లు, పల్లీలు, పుట్నాలు గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో సమకూరుస్తున్నారు. కాగా బోనులో చిక్కిన కోతుల్ని సమీప అటవీ ప్రాంతంలో వదిలిపెట్టకుండా ఇచ్చోడ అటవీ ప్రాంతంలోని కోతుల సంరక్షణ కేంద్రానికి తరలించేలా చర్యలు చేపడుతున్నారు. గ్రామంలో ప్రజలను గాయపరుస్తూ, ఆస్తులకు పంటలకు నష్టం కలిగిస్తున్న కోతుల బెడద తీరని ఉండడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా గత మూడు రోజులుగా సుమారు 60 నుండి 70 కోతులు పట్టుకున్నట్లు ఆంధ్ర వేటగాళ్లు తెలిపారు.