– రైతుల పోరాటంతో మోడీనే దిగొచ్చాడు
– బాధితులకు అండగా ఉంటాం
– బుల్డోజర్లకు అడ్డుగా నిలబడుతాం
– అవసరమైతే సుప్రీంకోర్టుకైనా వెళ్తాం
– ముందు సీఎం రేవంత్‌రెడ్డి, సోదరుడు తిరుపతిరెడ్డి ఇండ్లు కూల్చండి : కేటీఆర్
నవతెలంగాణ-రాజేంద్రనగర్
మూసీ బాధితులు ఐక్యంగా ఉండి పోరాడితే ప్రభుత్వాలు ప్రజాశక్తి ముందు తలవంచక తప్పదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఢిల్లీలో రైతులు ఏడాది పాటు పోరాడితే ప్రధాని మోడీనే దిగి వచ్చి నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్నారని, మూసీ బాధితులు కూడా అదేస్థాయిలో పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. మూసీ బాధితులకు అండగా బీఆర్‌ఎస్ ఉంటుందన్నారు. బుల్డోజర్లకు అడ్డుగా నిలబడుతామని హామీ ఇచ్చారు. అవసరమైతే బాధితుల తరపున సుప్రీంకోర్టుకైనా వెళ్తామని స్పష్టం చేశారు. సోమవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని అత్తాపూర్‌లో మూసీ బాధితులను ఆయన పరామర్శించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి ఇల్లు, అతని సోదరుడు తిరుపతిరెడ్డి ఇల్లు పూర్తిగా బఫర్ జోన్‌లో ఉన్నాయని వాటిని మొదట కూల్చాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నమామి గంగే 2400 కిలోమీటరు ప్రాజెక్టుకు రూ.40 వేల కోట్లు ఖర్చు చేస్తే.. అదే రేవంత్ రెడ్డి 55 కిలోమీటర్ల ప్రాజెక్టుకు రూ.లక్షన్నర కోట్లు ఏ విధంగా అవుతుందని ప్రశ్నించారు. మూసీ వరదల పేరుతో సామాన్యుల ఇండ్లు కూల్చి అక్కడ మాల్స్ ఎలా కడతారని అన్నారు. బాధితులకు డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పడం దారుణమన్నారు. చందాలు వసూలు చేసి మరీ తిరుపతిరెడ్డికి నాలుగు బెడ్‌రూమ్‌ల ఇండ్లు కట్టిస్తామని, ఆయన అక్కడికి వెళ్తారా అని ప్రశ్నించారు. 2013లో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ప్రత్యేక చట్టం చేశారని, ఇండ్లు, భూమి తీసుకుంటే మార్కెట్ వాల్యూకు మూడు రెట్లు నష్టపరిహారం ఇవ్వాలని ఆ చట్టంలో ఉందన్నారు. ఆ చట్టం ప్రకారం బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఒక న్యాయం, పేద ప్రజలకు మరో న్యాయమా అని ప్రశ్నించారు.ఢిల్లీలో రాహుల్ గాంధీ బుల్డోజర్ రాజ్యాన్ని వ్యతిరేకిస్తుంటే.. రాష్ట్రంలో మాత్రం రేవంత్‌రెడ్డి బుల్డోజర్ రాజ్యాన్ని నడుపుతున్నారని అన్నారు.
హైడ్రా విషయంలో ప్రభుత్వానికి హైకోర్టు చీవాట్లు పెట్టిందని తెలిపారు. మూసీ పరివాహ ప్రాంత ప్రజలందరూ ఒక వాట్సాప్ గ్రూప్‌ని క్రియేట్ చేసి ఎవరికి ఏ కష్టం వచ్చినా ఒకరికొకరు అండగా నిలబడాలని అన్నారు. కేసులకు భయపడితే తెలంగాణ వచ్చేదే కాదన్నారు. తమ ఎమ్మెల్యేలు, నాయకులు బాధితులకు ఏ కష్టం వచ్చినా క్షణాల్లో వాలిపోతారని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు కంటతడి పెడుతూ.. కేటీఆర్ దృష్టికి తమ సమస్యను తీసుకొచ్చారు. అక్కడే ఉన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్వర్‌రెడ్డి బాధితుల మాటలు విని కన్నీరు పెట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, చాపకూర మల్లారెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, గంగుల కమలాకర్, కౌశిక్ రెడ్డి, వివేకానందగౌడ్, ఎమ్మెల్సీలు మధుసూదనచారి, శంభేపురి రాజు, నాయకులు కార్తీక్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.