చెప్పేందుకే నీతులు!

morals-for-saying– ప్రతిపక్షాలకు ప్రధాని సుద్దులు
– తన వైఫల్యాలను కప్పిపుచ్చే ప్రయత్నం
– ప్రభుత్వ విధానాలకు ప్రజలు మద్దతిచ్చారని బుకాయింపు
– కిందపడ్డా తనదే పైచేయి అంటున్న మోడీ
చింత చచ్చినా పులుపు చావలేదని సామెత. దశాబ్దకాలం పాటు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా మోడీ పాలన సాగిందో..మూడోసారీ అదే తీరు కనిపిస్తోంది. ఎన్నికల ప్రచారాల్లో టార్గెట్‌ చేసిన అంశాలనే వల్లెవేస్తూ, ప్రధానమైన అంశాలను దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నీట్‌ ,నెట్‌ యూజీసీ లీకులు, రైలు ప్రమాదాలు, జమ్మూకాశ్మీర్‌ లో ఉగ్రదాడులతో పాటు హాట్‌ టాపిక్‌గా మారిన కీలకమైన అంశాలను చాపచుట్టడం ఎలా అన్నదానిపైనే మోడీ సర్కార్‌ దృష్టిపెట్టిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వీటిపై కనీస స్పందన కనబర్చని ప్రధాని ప్రతిపక్షాలకు నీతులు వల్లించడం చర్చనీయాంశంగా మారింది.
న్యూఢిల్లీ : 18వ లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపక్షాలకు సుద్దులు చెప్పారు. ప్రజలు బాధ్యతాయుతమైన ప్రతిపక్షాన్ని కోరుకుంటున్నారన్నారు. వారు శ్రద్ధ, ఆసక్తితో జరిగే చర్చలను ఆశిస్తున్నారే తప్ప నినాదాలు, అవాంతరాలను కాదని అంటూ, ఇప్పటికైనా ప్రతిపక్షాలు తమ తీరును మార్చుకుంటాయని, ప్రజాస్వామ్యపు హుందాతనాన్ని కాపాడాలని కోరుకుంటున్నానని తెలిపారు. గత పదేండ్లుగా తాము ప్రతిపక్షంలో కూర్చోవడంపై ప్రతిపక్షం అసంతృప్తికి గురికాకూడదని, వికసిత్‌ భారత్‌ లక్ష్యాన్ని సాధించేందుకు తన ప్రభుత్వాన్ని అనుమతించాలని కోరారు. దేశంలోని ఇరవై ఐదు కోట్ల మందిని పేదరికం నుంచి బయటపడేశానని ప్రధాని పునరుద్ఘాటించారు.
ఎన్నికలకు ముందు ‘400 పార్‌’ అంటూ ఊదరగొట్టి కేవలం 240 స్థానాలకే పరిమితమైనప్పటికీ తాను సాధించింది ఘన విజయమని మోడీ చెప్పుకున్నారు. ఎన్నికల ప్రక్రియ అద్భుతంగా సాగిందని కితాబు ఇచ్చారు కానీ ఎన్నికల కమిషన్‌ ప్రవర్తనా నియమావళిని తుంగలో తొక్కిన విషయాన్ని దాటవేశారు. తన ఉద్దేశాలకు, విధానాలకు ప్రజలు మద్దతు పలికారని చెప్పుకొచ్చారు.
మోడీ విధానాలకు ప్రజలు మద్దతిచ్చారా?
ఎన్నికల రణక్షేత్రంలో మోడీ తన వద్ద ఉన్న ప్రతి అస్త్రాన్నీ ప్రయోగించారు. తన రాజకీయాలు, పరిపాలనపై ప్రజలు విముఖంగా ఉన్నారని ఆయనకు తెలుసు. కానీ దానిని కప్పిపుచ్చడానికి విశ్వప్రయత్నం చేశారు. రాజకీయ సమీకరణ కోసం అయోధ్య రామమందిర నిర్మాణాన్ని వాడుకున్నారు. అయినప్పటికీ ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ చావుదెబ్బలు తిన్నది. ఆయన విధానాలనే ప్రజలు అంగీకరించి ఉంటే ఎన్నికల ప్రచారంలో అగ్నిపథ్‌ పథకం, నిరుద్యోగం వంటి అంశాలు కీలకం అయి ఉండేవి కావు. ఆయన ఉద్దేశాలు, విధానాలకే ప్రజలు బ్రహ్మరథం పట్టి ఉంటే రాజ్యాంగానికి ఎదురైన పెను ముప్పుపై అట్టడుగు వర్గాల ప్రజలు ఆందోళన చెంది ఉండేవారు కారు. రాజ్యాంగానికి ఎదురవుతున్న ప్రమాదంపై ప్రతిపక్షాలు చేసిన ప్రచారం ఊరూవాడా పాకిందని, అదే తమ కొంపముంచిందని బీజేపీ, దాని మిత్రపక్షాల నేతలు బాహాటంగానే చెప్పుకున్నారు.
ప్రతిపక్షానికే ప్రజల బాసట
ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు చాలా స్పష్టంగా ఉంది. ప్రజలు మోడీ అహాన్ని దెబ్బతీశారు. పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. నినాదాలు చేయడం కాదని, బాధ్యతగా వ్యవహరించాలని మోడీ చేసిన హితబోధ వాస్తవానికి ప్రతిపక్షాలకు కాదు. అది ఆయనకు, ఆయన పార్టీకే వర్తిస్తుంది. ఎందుకంటే ప్రతిపక్షాలు చట్టసభల్లో నిరుద్యోగం, ధరల పెరుగుదల, ప్రజలకు జరుగుతున్న అన్యాయాల గురించే మాట్లాడాయి తప్ప నినాదాలు చేసి సభా సమయాన్ని వృథా చేయలేదు. వాస్తవానికి ఓటర్లు ప్రతిపక్షాలకే సత్తువ కల్పించారు.
నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి సమస్యలను సభలో ప్రస్తావించేందుకు తగిన బలాన్ని అందించారు. పాలకుల అప్రజాస్వామిక, రాజ్యాంగ విరుద్ధమైన చర్యలను ప్రతిఘటించేందుకు కావాల్సిన శక్తిని ఇచ్చారు. రాజ్యాంగాన్ని మార్చేందుకు అవసరమైన 400 స్థానాలు ఎన్డీఏకు దక్కకుండా చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఓటర్లు ప్రతిపక్షాలకు ఊతమిచ్చారు. పాలక పక్షాన్ని కుదించారు.
ప్రతిపక్షాల బాధ్యత ఇదే
ఓటింగ్‌ ప్రక్రియపై వ్యక్తమవుతున్న అనుమానాలను నివృత్తి చేయడం ద్వారా ప్రజల్లో విశ్వాసాన్ని కల్పించాలని, ప్రవర్తనా నియమావళి ప్రాధాన్యతను గుర్తించాలని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేయాల్సి ఉంది. అగ్నిపథ్‌ పథకం రద్దు, ఎంఎస్‌పీకి చట్టబద్ధత, భారత్‌-చైనా సరిహద్దులో యధాతథ స్థితిని కాపాడడం, ఎన్నికల బాండ్ల కుంభకోణంపై సమగ్ర విచారణ, అదానీ వ్యవహారాలపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు, దేశవ్యాప్త కులగణన, పెట్రోలియం ఉత్పత్తుల ధరల తగ్గింపు వంటి అంశాలపై కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది.
పాలక పక్షం ఏం చేయాలి?
భారతావని ఇప్పుడు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటోంది. ఇది మోడీ ఆ సమస్యల పరిష్కారం గురించి ఆలోచించాల్సిన సమయమే తప్పించి మూడోసారి గెలిచినందుకు సంబరపడాల్సిన సందర్భం కాదు. గత పదేండ్ల కాలంలో దేశంలో నిరుద్యోగం పెరిగిపోయింది. దేశంలో ఎక్కడో ఒక చోట ప్రతిరోజూ పేపర్‌ లీకేజీల వార్తలు విన్పిస్తూనే ఉన్నాయి. మౌలిక లక్ష్యాలను కూడా నెరవేర్చడంలో మోడీ ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. నీట్‌ ప్రశ్నాపత్రం లీకేజీకి కాంగ్రెస్‌, ఆర్జేడీయే కారణమని నిందించేందుకు బీజేపీ ప్రయత్నించడం శోచనీయం. మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసిన వ్యాపం కుంభకోణంతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో లెక్కలేనన్ని పేపర్‌ లీకేజీలు జరుగుతున్న విషయాన్ని ఆ పార్టీ విస్మరిస్తోంది. ప్రభుత్వం ఇకనైనా సంక్షోభ తీవ్రతను గుర్తించి చట్టసభలో దానిపై కూలంకషంగా చర్చించాల్సిన అవసరం ఉంది. ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అంగీకరించడం ద్వారా ఈసీపై ప్రజల్లో నమ్మకాన్ని కలిగించాల్సి ఉంది. పాలక పక్షానికి చెందిన నేతలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పదేపదే ఉల్లంఘించినప్పటికీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ చేష్టలుడిగి చూస్తూ ఉండిపోయారు. పైగా ప్రతిపక్ష నేతలు, విమర్శకులనే బెదిరించారు. ఆయనను అభిశంసించాల్సిన అవసరం కూడా ఉంది. బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ప్రతిపక్షాలకు సుద్దులు చెబుతున్న ప్రధాని ముందుగా వారికి కొన్ని బాధ్యతలు అప్పగించాల్సి ఉంటుంది.
పదేండ్లూ.. అప్రకటిత ఎమర్జెన్సే..
మోడీ తన ప్రసంగంలో ఎమర్జెన్సీని ప్రస్తావించడం గురివింద గింజ సామెతను గుర్తుకు తెస్తోంది. అత్యవసర పరిస్థితి ప్రజాస్వామ్యానికి మచ్చ వంటిదని ఆయన చెప్పారు. యువతరం ఈ చీకటి అధ్యాయాన్ని ఎన్నటికీ మరచిపోదని, ప్రజాస్వామ్యాన్ని కాపాడతామని ప్రతిజ్ఞ తీసుకుంటుందని తెలిపారు. ఎమర్జెన్సీ నిజంగానే సంస్థాగత, వ్యక్తిగత స్వేచ్ఛను హరించింది. అది చీకటి అధ్యాయమే. కానీ ఇదే రకమైన ఆరోపణను మోడీ కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. అత్యవసర పరిస్థితికి సంబంధించిన చట్టబద్ధమైన నిబంధనలేవీ అమలు చేయకుండానే ఆయన అన్ని రకాల స్వేచ్ఛలను హరించారు. గత పదేండ్ల పాలనలో కేంద్ర దర్యాప్తు సంస్థలను, పోలీసులను దుర్వినియోగం చేశారని, విమర్శకులు, హక్కుల కార్యకర్తలను అరెస్టు చేశారని, మీడియాను భయపెట్టారని మోడీపై ఆరోపణలు వచ్చాయి. ఎమర్జెన్సీని విధించకుండానే రాజకీయ కక్షసాధింపు చర్యలకు ఎలా పాల్పడవచ్చో ప్రజలు చూశారు. మహారాష్ట్రలో పార్టీలను నిట్టనిలువునా చీల్చారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి తగినంత మెజారిటీ రాకపోవడానికి ఆ రాష్ట్రంలో తగిలిన ఎదురుదెబ్బలే ప్రధాన కారణం. అయినా ప్రజాతీర్పు నుంచి గుణపాఠం నేర్చుకునేందుకు మోడీ సిద్ధంగా లేరు.

Spread the love