
– పెరుగుతున్న ప్రత్యేక భక్తి…
నవతెలంగాణ – అశ్వారావుపేట : ఏటికేడాది ప్రజల్లో ఆద్యాత్మిక భక్తి కంటే కులం,రాజకీయ పరం అయిన భక్తి పెరుగుతుంది.గతేడాది మండల వ్యాప్తంగా 69 గణపతి మండపాలు నిర్వహిస్తే ఈ ఏడాది సుమారుగా 80 లోపు గణపతి మండపాలు ఏర్పాటు అయినట్లు తెలుస్తుంది.ఇప్పటికే అధికారికంగా ఆన్ లైన్ లో 55 మండలాలకు అనుమతి ఇచ్చినట్లు పోలీస్ వారి సమాచారం.అనుమతి పొందకుండా ఏర్పాటు చేసిన మండపాలను పోలీసులే నేరుగా నమోదు చేసుకుని ఆన్ లైన్ దృవీకరణ ఇస్తున్నట్లు వినికిడి. అసలే రాజకీయ సీజన్ ప్రారంభం కావడంతో పార్టీలు,కులాలు,కుటుంబాలు వారీ వీధికి రెండు మూడు విగ్రహాలు వెలసినట్లు చెప్పుకుంటున్నారు.
ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మట్టి వినాయకుడు
నల్ల మట్టి ఆవు పేడ గోనె సంచులతో తయారుచేసిన గణనాథుడు.. కొబ్బరి బొండం మధ్యకు చీల్చి మూషికం తయారుచేసిన భక్తుడు.. అశ్వారావుపేట లక్ష్మీ గణపతి ఆలయం వద్ద నిర్వహిస్తున్న వైనం.. రసాయనాలతో తయారు చేసే విగ్రహాలు ఎంత ప్రమాదకరమో మనందరికీ తెలిసిన విషయమే పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని ఓ భక్తుడు నల్ల మట్టి, కొబ్బరి పీచు, ఊక, గోనె సంచులు, ఆవు పేడ తో గణనాధుని తయారుచేసి అందర్నీ ఆకట్టుకున్నాడు. అశ్వారావుపేట టౌన్ లోని జీవ మణి హాస్పిటల్ రోడ్ లో గల వెల్ టెక్స్ వ్యాపారి శ్రీనివాసరావు తనదైన ముద్రణ వేసుకున్నాడు.మట్టితో తయారుచేసిన గణ నాథుని వెనుకాల గోనె సంచులతో అచ్చం పుట్ట వలె ఉండే ఓ ఆకారాన్ని తయారుచేసి మట్టితో రూపొందించిన పాములను, మొలకెత్తిన విత్తనాలను పుట్ట పై జల్లి సహజ సిద్ధంగా తయారు చేశాడు. ఈ చక్కటి ప్రతిమలను చూసేందుకు భక్తులు పోటీ పడ్డారు. కొబ్బరి బొండం వలచి వినాయకుడి వాహనం మూషికం తయారు చేసిన విధానం చూపరులను అమితంగా ఆకట్టుకుంటుంది. మానవాళికి హాని చేసే రసాయనాలను తగ్గించి మట్టితో తయారుచేసిన విగ్రహాలు భక్తులందరూ వాడేందుకు తన ఈ ప్రయోగం దోహదపడుతుందని శ్రీనివాసరావు తెలిపారు.