– కొత్త నిబంధనలతో రెండు నోటిఫికేషన్లు జారీ
– రాజకీయ ప్రముఖులు, ఎన్జీవో సంస్థల ‘నిర్వచనం’లో మార్పులు
– ఎప్పుడు కావాలంటే అప్పుడు..ఈడీకి సమాచారం
– సార్వత్రిక ఎన్నికలకు ముందు తాజా ఉత్తర్వులపై సర్వత్రా అనుమానాలు
న్యూఢిల్లీ : 2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మోడీ సర్కార్ ‘కేంద్ర దర్యాప్తు సంస్థ’లకు మరిన్ని అధికారాల్ని కట్టబెట్టింది. ‘మనీ
లాండరింగ్ చట్ట’ (పీఎంఎల్‌ఏ) పరిధిని మరింత విస్తరిస్తూ, ‘ఎన్‌ఫోర్స్‌మేంట్ డైరెక్టరేట్’ను రాజకీయ ఆయుధంగా మార్చుతోంది. ప్రతి రాష్ట్రంలో రాజకీయ నాయకుల్ని, ఎన్జీవో సంస్థల్ని ‘ఈడీ’ టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్షాల ప్రభుత్వాల్ని కూల్చడానికి ఈడీ సోదాలు, సీబీఐ కేసులు, ఐటీ దాడుల్ని…మోడీ సర్కార్ ప్రయోగిస్తూ వస్తోంది. తద్వారా ప్రతిపక్షాల్ని బలహీనపరుస్తూ ఆయా రాష్ట్రాల్లో రాజకీయ లక్ష్యాల్ని సాధించుకుంటోందన్న విమర్శలున్నాయి. మరికొద్ది నెలల్లో దేశమంతటా సార్వత్రిక ఎన్నికల వేడి ఏర్పడనున్నది. ఈ నేపథ్యంలో ‘ఈడీ’ అధికారాల్ని విస్తరిస్తూ కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా రెండు నోటిఫికేషన్లు జారీచేయటం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఏమిటా మార్పులు?
రాజకీయ నాయకులు, ప్రముఖులు, రాష్ట్రాల సీఎంలు, రాష్ట్ర ప్రభుత్వ అధిపతులు, సీనియర్ నాయకులు, సైనిక అధికారులు, న్యాయ వ్యవస్థ, మిలటరీ ఉన్నతాధికారులు, రాష్ట్రాల కార్పొరేషన్ అధిపతులు, ప్రముఖ రాజకీయ పార్టీల ప్రతినిధులు..వీరందర్నీ ‘పొలిటికల్లీ ఎక్స్‌పోజ్డ్ పర్సన్స్’గా (పీఈపీ) నోటిఫికేషన్ పేర్కొన్నది. ఈ నోటిఫికేషన్ ప్రకారం, వీరి ఆర్థిక లావాదేవీల్ని ప్రత్యేకంగా వర్గికరిస్తూ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇకపై ఆ సమాచారాన్ని నిల్వ చేయాల్సి ఉంటుంది. ఈడీ ఎప్పుడు కావాలంటే, అప్పుడు ఆ సమాచారం పొందే అధికారముంది. ఎన్జీవో సంస్థల నగదు లావాదేవీల్ని బ్యాంకులు ప్రత్యేకంగా వర్గీకరిస్తాయి. తమ క్లయింట్స్ వివరాల్ని ‘నిటి ఆయోగ్’కు తెలపాల్సి ఉంటుంది. ఆర్థిక లావాదేవీల చరిత్ర అంతా ఈడీకి అందుబాటులో ఉంచుతాయి. ఆర్థిక సమాచారాన్ని బ్యాంకులు ఎలా అందజేయాలి, ఎంతకాలం పాటు ఆ సమాచారాన్ని నిల్వ ఉంచాలి? అన్నది వివరించారు. ఒక్కమాటలో చెప్పాలంటే..దేశంలోని ప్రతిఒక్క రాజకీయ ప్రముఖుడి ఆర్థిక సమాచారం ఇకపై ఈడీకి అందుబాటులో రానున్నది.
121 మందిపై ఈడీ దాడులు
ఈ ఏడాది రాజస్థాన్, తెలంగాణ, కర్నాటక సహా కీలక రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 2024 మే తర్వాత సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి. పలు రాష్ట్రాల్లో రాజకీయ ప్రత్యర్థులపైకి కేంద్ర దర్యాప్తు సంస్థల్ని మోడీ సర్కార్ ఉసిగొల్పుతోంది. కేసుల పేరుతో వేధింపులు, బెదిరింపులకు పాల్పడుతోంది. 2014 తర్వాత ప్రతిపక్షాలకు చెందిన 121మంది రాజకీయ నాయకులపై ఈడీ దాడులు జరిగాయి. బీహార్‌లో ఆర్జేడీ నేతలపై గతకొన్ని రోజులుగా ఈడీ దాడులు చేస్తోంది. దేశవ్యాప్తంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎన్జీవోలను కేంద్రం టార్గెట్ చేస్తోంది. ఎఫ్‌సీఆర్‌ఏ నిబంధనల్ని కఠినతరం చేసి విదేశాల నుంచి ఎన్జీవో సంస్థలు విరాళాలు స్వీకరించకుండా చేసింది.