– సెప్టెంబర్‌లోగా ఎలక్షన్లు నిర్వహించాలన్న సుప్రీంకోర్టు
– అంతలోనే మోడీ సర్కారు నోటిఫికేషన్ జారీ
– కేంద్రం తీరుపై జమ్మూకాశ్మీర్‌లోని ప్రతిపక్ష పార్టీల ఆగ్రహం
జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా మాట్లా డుతూ ‘శక్తిలేని, రబ్బర్ స్టాంప్ ఎల్జీ కంటే జమ్మూకాశ్మీర్ ప్రజలు అర్హులు. వారు తన ప్యూన్‌ను నియమించమని ఎల్జీని వేడుకుం టారు’ అని వివరించారు. మరో మాజీ ముఖ్య మంత్రి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ(పీడీపీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ.. జమ్మూ కాశ్మీర్ ప్రజల గురించి న్యూఢిల్లీ ఆలోచించే విధానంపై ఈ సవరణలు ప్రాథమిక ప్రశ్నను లేవనెత్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్‌లో బీజేపీ ఏ ఎన్నికల్లోనూ గెలిచే పరిస్థితిలో లేదన్న భయాల వల్లే ఈ మార్పులు చోటు చేసుకున్నాయని ఆమె ఆరో పించారు. రేపు జమ్మూకాశ్మీర్ లో ఏ ప్రభుత్వమైనా ఏర్ప డితే అది బీజేపీ వల్లే ఏర్పడదు అని ఆమె అన్నారు.
న్యూఢిల్లీ : జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ)కు ప్రత్యేక అధికారం ఉన్న పాలనా రంగాలను వివరిస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇది ఎన్నికైన శాసనసభ అమలులో ఉన్నా లేదా అన్నదానితో సంబంధం లేకుండా ఎల్జీకి అధికారాలను కట్టబెట్టింది. పోలీస్, పబ్లిక్ ఆర్డర్, ఆలిండియా సర్వీసెస్ ఆఫీసర్లు, సీనియర్ లా ఆఫీసర్ల నియామకం, బదిలీలకు సంబం ధించిన విషయాలపై నిర్ణయం తీసుకునే ఏకైక అధికారం కేంద్రం నియమించిన ఎల్జీకి అని కేంద్ర హౌం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నొక్కి చెప్పింది. వివిధ కేసులు, జైళ్లకు సంబంధిం చిన విషయాల్లో ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వాలా వద్దా అనే విషయాన్ని కూడా ఎల్జీ నిర్ణయిస్తారు.
ఐదేండ్లుగా జమ్మూ కాశ్మీర్‌లో ఎన్నుకోబడిన ప్రభుత్వం లేదు. ఎల్జీ కార్యాలయం ద్వారా జమ్మూకాశ్మీర్ కేంద్రం ప్రత్యక్ష పాలనలో ఉన్నది. ఆగస్టు 5, 2019న.. మోడీ ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూకాశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతం(యూటీ)గా చేయటంతో జమ్మూ కాశ్మీర్ దాని ప్రత్యేక హౌదా, రాష్ట్ర హౌదాను కోల్పోయిన విషయం విదితమే.
కేంద్రం నుంచి వెలువడిన తాజా నోటిఫికేషన్ విపక్ష పార్టీల నుంచి విస్తృత ఆందోళన, తీవ్ర విమర్శలను రేకెత్తించింది. వారు ఈ చర్యను జమ్మూ కాశ్మీర్ ప్రజలను మరింత ‘నిరుత్సాహపరచడం’గా అభివర్ణిస్తున్నారు. ఇది జమ్మూ కాశ్మీర్ ప్రజల ప్రజాస్వామ్య స్వరాన్ని బలహీనపరచటమే లక్ష్యంగా ఉన్నదని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్‌సీ) ప్రధాన ప్రతినిధి తన్వీర్ సాదిక్ అన్నారు. ఎన్నికైన ప్రభుత్వానికి బదులుగా ఎన్నికకాని ఎల్జీకి అధికారాలు ఇవ్వటానికి కేంద్రం తీసుకున్న చర్య జమ్మూ కాశ్మీర్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వ భవిష్యత్తును అణగదొక్కే స్పష్టమైన ప్రయత్నమని ఆందోళన వ్యక్తం చేశారు.
ఆర్టికల్ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు.. ఈ ఏడాది సెప్టెంబర్‌లోగా జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని (ఈసీ) ఆదేశించిన విషయం విదితమే. అయితే, సుప్రీంకోర్టు తీర్పు అమలు కాకముందే ఎల్జీకి మరిన్ని అధికారాలను కట్టబెడుతూ మోడీ సర్కారు నోటిఫికేషన్‌ను జారీ చేయటం ప్రతిపక్షాలకు మరింత ఆగ్రహాన్ని తెప్పిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఈ ఏడాది సెప్టెంబర్‌లోగా జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే ఈ పరిస్థితుల్లో కేంద్రపాలిత ప్రాంతంలో ముఖ్యమంత్రి పాత్ర ఎలా ఉండబోతుందన్నది ఇక్కడ చర్చనీయాంశంగా మారుతున్నది. ”ముఖ్యమంత్రి కీర్తింపబడిన సర్పంచ్ లాగా ఉంటాడు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ మునిసిపల్ కౌన్సిల్ లాగా ఉంటుంది” అని ఒక రిటైర్డ్ ఉన్నతాధికారి చెప్పారు. జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2019లోని సెక్షన్ 55 ప్రకారం జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ”మంత్రి మండలి సలహా మేరకు” నిబంధనలను రూపొందించాలి. అయినప్పటికీ, ఎన్నికైన ప్రభుత్వం లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వం నిబంధనలను తనకు అను కూలంగా రూపొందించడం ప్రారంభించిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తూ రాష్ట్రాల అధికారాల్లోకి చొరబడటం పరిపాటిగా మారి పోయిందనీ, ఇప్పుడు జమ్మూకాశ్మీర్ విషయంలోనూ ఇదే తీరును కనబరుస్తున్నదని రాజకీయ విశ్లేషకులు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.