ఇక స్పీడ్‌..

And speed..– రాష్ట్రాభివృద్ధికి ప్రత్యేక కమిషన్‌
– మొత్తం 19 ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి
– పనులు వేగంగా ప్రారంభించాలి : సీఎం ఆదేశాలు
– వివరాల కోసం ప్రణాళికా శాఖ ప్రత్యేక పోర్టల్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులు, కార్యక్రమాలను త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తోంది. ఇందుకు సంబంధించిన కసరత్తును ముఖ్యమంత్రి రేవంత్‌ దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. తద్వారా స్పీడ్‌ (స్మార్ట్‌ ప్రోయాక్టివ్‌ ఎఫిషియంట్‌ అండ్‌ ఎఫెక్టివ్‌ డెలివరీ) పేరిట సరికొత్త కార్యాచరణను చేపట్టాలంటూ ఆయన ఉన్నతాధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఒక ప్రత్యేక కమిషన్‌గా దీన్ని ఏర్పాటు చేయనున్నారు. స్పీడ్‌ పరిధిలో మొత్తం 19 ప్రాజక్టులు, కార్యక్రమాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనుంది. సంబంధిత విభాగాల అధికారులు నెలకోసారి సమావేశమై వాటిని సమీక్షిస్తారు. నిర్ణీత కాలవ్యవధిలో ఆయా ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు వీలుగా క్షేత్రస్థాయిలోని ఆఫీసర్లు, సిబ్బందితో ఎప్పటికప్పుడు సమాలోచనలు చేసి, ప్రణాళికలు రూపొందిస్తారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి. రాష్ట్రాభివృద్ధికి ప్రామాణికమైన మౌలిక సదుపాయాల కల్పనలో వివిధ విభాగాల మధ్యనున్న అడ్డంకులు, అవరోధాలన్నింటినీ అధిగమించేందుకు ‘స్పీడ్‌’ ప్రత్యేక చొరవను ప్రదర్శిస్తుందని ఉన్నతాధికారులు తెలిపారు. ఒకవేళ పనుల్లో జాప్యం జరిగినా, వాటి పురోగతికి ఆటంకాలేర్పడినా నేరుగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి, ఆయన జోక్యంతో అవసరమైన నిర్ణయాలను అది తీసుకుంటుందని వారు వివరించారు. కేవలం నగరాలు, పట్టణాలకే పరిమితం కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, మారుమూల గ్రామాల్లోని అభివృద్ధి పనులను కూడా ఇది పర్యవేక్షిస్తుంది. వివిధ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీలు, గ్రామ పంచాయతీల్లోని పనులు, వాటిని చేపట్టటానికి కావాల్సిన నిధులు, అంచనాలపై కూడా ఇది స్పష్టమైన ప్రణాళికలు రూపొందించి, ఉన్నతాధికారులకు పంపుతుంది. స్పీడ్‌ చేపట్టబోయే ప్రాజెక్టుల పురోగతిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక విధానాన్ని రూపొందించాలంటూ ముఖ్యమంత్రి కార్యాలయం ఇప్పటికే సంబంధిత అధికారులను, ఆయా విభాగాలను ఆదేశించింది. పనితీరుపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించేందుకు, వాటి పర్యవేక్షణకు ప్రత్యేక ఏర్పాటు చేయాలంటూ సూచించింది. ఈ మొత్తం ప్రక్రియనంతటినీ ప్రజలకు చేరువ చేసేందుకు వీలుగా రాష్ట్ర ప్రణాళికా విభాగం ప్రత్యేకంగా ఆన్‌లైన్‌ పోర్టల్‌ను నిర్వహించనుంది. ప్రతీ రోజు నిర్వహించే పనులు, వాటి పురోగతికి సంబంధించిన డేటాను ఆ పోర్టల్‌లో ఎప్పటికప్పుడు అప్‌లోడ్‌ చేస్తారు.
‘స్పీడ్‌’ పరిధిలోని 19 ప్రాజెక్టులివే…
1) మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌
2) శాటిలైట్‌ టౌన్ల అభివృద్ధి
3) మెట్రో రైల్‌ విస్తరణ
4) జీహెచ్‌ఎమ్‌సీ పునర్‌ వ్యవస్థీకరణ
5) రీజనల్‌ రింగ్‌ రోడ్‌
6) హైదరాబాద్‌ నగరంలో ఎలివేటెడ్‌ కారిడార్లు
7) రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాలు
8) ఢిల్లీలో తెలంగాణ భవన్‌ నిర్మాణం
9) మహిళా శక్తి పథకం అమలు
10) జిల్లా సమాఖ్య భవనాల నిర్మాణం
11) రెసిడెన్షియల్‌ స్కూళ్లు, వాటి కాంప్లెక్సుల నిర్మాణం
12) అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల సంస్థాగత అభివృద్ధి
13) ఐటీఐల్లో అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లు
14) ఉస్మానియా దవాఖానాకు నూతన భవనం
15) నూతన నర్సింగ్‌, నూతన పారామెడికల్‌ కాలేజీల ఏర్పాటు
16) హెల్త్‌ టూరిజం ప్రమోషన్‌
17) ఎకో టూరిజం ప్రాజక్టుల ప్రమోషన్‌
18) టెంపుల్‌ సర్క్యూట్స్‌ టూరిజం
19) యాంటీ డ్రగ్స్‌ స్ట్రాటజీ అమలు

Spread the love