నవతెలంగాణ – ఉత్తరప్రదేశ్: దేశంలోని పలుచోట్ల గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీలో యమునా నది ఉప్పొంగి, ఢిల్లీలో పలు ప్రాంతాలు నీట మునిగాయి. తాజాగా ఓ షాకింగ్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. గ్రేటర్ నోయిడాలోని ఎకోటెక్-3 సమీపంలో కార్లు మునిగిన వీడియో ఇది. ఆ కార్ల పైకప్పులు కేవలం ఒక అంగుళం మాత్రమే బయటకు కనిపిస్తున్నాయి. అన్ని కార్లు కూడా దాదాపు తెల్లవే. హిండన్ నది నీటిమట్టం పెరగడంతో శనివారం నదికి సమీపంలోని వారిని ఇళ్ల నుండి ఖాళీ చేయించారు. ప్రభావిత ప్రాంతాల్లో నోయిడా సెక్టార్ 63లోని ఎకోటెక్, ఛిజార్సీ ఉన్నాయి. నోయిడా, జాతీయ రాజధాని ప్రాంతంలోని ఇతర ప్రాంతాలలో నేడు తెల్లవారుజామున తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిశాయి. ఈరోజు మధ్యాహ్న సమయానికి యమునా నది ప్రమాదకరస్థాయి 205.33 మీటర్ల ఎగువన ప్రవహిస్తోంది. మధ్యాహ్నం 205.4 మీటర్ల స్థాయికి చేరుకుంది. ఢిల్లీలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడవచ్చు. ఢిల్లీకి ఎలాంటి భారీ వర్షాల హెచ్చరిక లేదు. కానీ జూలై 25 రాత్రి నుండి తేలికపాటి వర్షాలు ఉంటాయి.