5000 దాటిన మృతులు గల్లంతైన వారు పది వేల పైనే

– వరద బీభత్సంతో అతలాకుతలమైన లిబియా
ట్రిపోలీ : లిబియాలో భారీ వర్షాలు, వరదలు సృష్టించిన బీభత్సంలో చనిపోయిన వారి సంఖ్య ఐదు వేలు దాటింది. మరో పది వేల మందికి పైగా ప్రజల ఆచూకీ తెలియడం లేదు. వర్షాల కారణంగా రెండు ఆనకట్టలు కూలిపోయాయి. తూర్పు ప్రాంతంలోని డెర్నా నగరం నీట మునిగింది. పట్టణంలోని నాలుగో వంతు ప్రాంతం కనుమరుగైపోయిందని సీఎన్‌ఎన్‌ వార్తాసంస్థ తెలిపింది. అల్‌మర్జ్‌, సుసాV్‌ా, షాహత్‌, అల్‌ బేడా నగరాలలో కూడా భారీగా ప్రాణనష్టం జరిగింది. ఇరవై వేల మందికి పైగా ప్రజలు సర్వం కోల్పోయి నిరాశ్రయులయ్యారు. సుమారు 90 వేల జనాభా కలిగిన డెర్నా నగరానికి దారితీసే రహదారులన్నీ వరదల కారణంగా దెబ్బతినడంతో సహాయ బృందాలు చేరుకోవడం కష్టమవుతోంది. రాజకీయ విభజనల కారణంగా 2014లో లిబియా రెండుగా చీలిపోయింది. అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రభుత్వం ట్రిపోలీలో ఉండగా, డెర్నా సహా తూర్పు ప్రాంతం మరో అధికార వ్యవస్థ అధీనంలో ఉంది. దీంతో ఆ ప్రాంతంలో మౌలిక వసతులు సరిగా లేవు. ఆర్థిక అసమానతలు, పర్యావరణ అసమతుల్యతతో ఆ ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
పర్వత ప్రాంతం నుండి డెర్నా నగరం మీదుగా ప్రవహించే వాడీ డెర్నా నదిలో అనేక భవనాలు కొట్టుకుపోతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో వైరల్‌ అవుతున్నాయి. శిథిలాల కింద పడి ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను వెలికితీసేందుకు సహాయ సిబ్బంది నిరంతరం శ్రమిస్తున్నారు. అంత్యక్రియల కోసం స్మశానవాటికలకు చేరుకుంటున్న మృతదేహాల సంఖ్యకు లెక్కే లేదు. మరోవైపు ఆస్పత్రులలోని మార్చురీలన్నీ మృతదేహాలతో నిండిపోయాయి. తగిన స్థలం లేకపోవడంతో కొన్ని మృతదేహాలను ఆరుబయట గోడల పక్కనే ఉంచారు. అత్యవసర సర్వీసులేవీ పనిచేయడం లేదని ప్రజలు వాపోతున్నారు. కాగా లిబియాకు మానవతా సాయం అందించేందుకు ఈజిప్ట్‌, తునీసియా, అల్జీరియా, టర్కీ, యునైటెడ్‌ ఆరబ్‌ ఎమిరేట్స్‌ ముందుకు వచ్చాయి. తాము కూడా సహాయ కార్యక్రమాలలో పాలుపంచుకుంటామని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుట్టెరెస్‌ చెప్పారు.

Spread the love