55కు పైగా వాంగ్మూలాలు

– 473 పేజీలతో కూడిన చార్జీషీటు
– ఐఐటీ బాంబే దళిత విద్యార్థి ఆత్మహత్య కేసులో పలు కీలక విషయాలు
ముంబయి : ఐఐటీ బాంబేలో సంచలనం సృష్టించిన దళిత విద్యార్థి దర్శన్‌ సోలంకి ఆత్మహత్య కేసులో పలు ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి. పోలీసులు ఇప్పటికే 473 పేజీలతో కూడిన చార్జీషీటును కోర్టు ముందు దాఖలు చేశారు. ఇందులో 55కు పైగా వాంగ్మూలాలు ఉన్నాయి. గతేడాది అక్టోబర్‌ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి మధ్య ఐఐటీ బాంబేలో దర్శన్‌ సోలంకి గడిపిన సమయాన్ని అందులో విశ్లేషించారు.
అతను ఎదుర్కొన్న సంఘటనలు, నెలకొన్న పరిస్థితులు, తోటి విద్యార్థులతో ఎదరురైన అవమానాలు, చదువు, పరీక్షల్లో అతని ప్రదర్శన.. ఇలా పలు అంశాలకు సంబంధించి పోలీసులు అందులో పొందుపరిచారు. దర్శన్‌ సోలంకి ఈ ఏడాది ఫిబ్రవరి 12న క్యాంపస్‌లో ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే. దర్శన్‌సోలంకి తల్లిదండ్రులు, సోదరి, తోటి విద్యార్థులు, ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు ఇచ్చిన వాంగ్మూలాలు ఇందులో ఉన్నాయి. ఈ చార్జీషీటును ముంబయి క్రైం బ్రాంచ్‌ పోలీసులకు చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు ముందు మంగళవారం ప్రవేశపెట్టిన విషయం విదితమే.

Spread the love