80కోట్ల మందికిపైగా యువతకు మధుమేహం

80కోట్ల మందికిపైగా యువతకు మధుమేహం– చికిత్స తీసుకోని వారు సగానికి పైనే
– కొత్త అధ్యయనంలో వెల్లడి
న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా 80కోట్ల మందికి పైగా యువత మధుమేహంతో బాధపడుతున్నారు. గత అంచనాలతో పోలిస్తే ఈ సంఖ్య దాదాపు రెట్టింపుగా వుంది. వీరిలో సగానికి కన్నా ఎక్కువ మంది 30ఏళ్ళకు పై వారే. వీరెవరూ మధుమేహానికి చికిత్స తీసుకోవడం లేదని కొత్త అధ్యయనం పేర్కొంది. 2022లో 18ఏళ్ళు అంతకుపైన వయస్సుండి, టైప్‌ 1, టైప్‌ 2 మధుమేహ వ్యాధితో బాధపడుతున్న వారు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 82.8కోట్ల మంది వున్నారని లాన్సెట్‌ అధ్యయనం వెల్లడించింది. వీరిలో 30ఏళ్ళు అంతకు పైబడిన వారు 44.5కోట్ల మంది అంటే 59శాతం మంది చికిత్సను తీసుకోవడం లేదని అధ్యయనకర్తలు పేర్కొన్నారు. డయాబెటిస్‌తో బాధపడేవారు దాదాపు 42.2కోట్ల మంది వుంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ గతంలో అంచనా వేసింది. కానీ ఇప్పుడు రెట్టింపు సంఖ్యలో యువత ఆ వ్యాధి బారిన పడ్డారు. 1990 నుండి ప్రపంచవ్యాప్తంగా మధుమేహం రేటు రెట్టింపు అవుతూ వస్తోంది. అప్పుడు 7శాతంగా వున్న రోగులు 14శాతానికి పెరిగారు. పైగా ఈ కేసులు ఎక్కువగా తక్కువ, మధ్య తరగతి ఆదాయ దేశాల్లోనే నని అధ్యయనం సూచించింది. ఈ దేశాల్లో చికిత్స రేట్లు కూడా పెరుగుతునే వున్నాయని అధ్యయనకర్తలు పేర్కొన్నారు. అయితే ఆదాయం అధికంగా వుండే దేశాల్లో పరిస్థితులు మెరుగుపడ్డాయి.
సబ్‌ సహారా ఆఫ్రికా దేశాల్లో కేవలం ఐదు నుండి 10శాతం మందికి మాత్రమే చికిత్స అందుతోందని కామెరూన్‌లోని యూనివర్శిటీ ఆఫ్‌ యాండే ప్రొఫెసర్‌ జేన్‌ క్లాడ్‌ ఎంబన్యా చెప్పారు. ఈ పరిస్థితుల్లో చాలామంది తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశముందని హెచ్చరించారు. మందులు లేదా ఇన్సులిన్‌ ద్వారా డయాబెటిస్‌కు అందించే చికిత్స చాలా వ్యయభరితమైనది.

Spread the love