ఐఐటీ, ఐఐఎంల్లో 80శాతానికిపైగా అధ్యాపకులు జనరల్‌ కేటగిరే

More than 80 percent in IITs and IIMs

The teachers are general category– ఎస్‌సీ, ఎస్‌టీ అధ్యాపకులు తక్కువే : ఆర్‌టీఐ డేటా వెల్లడి
న్యూఢిల్లీ : ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటి), ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)లలో బోధించే అధ్యాపకుల్లో ఎస్‌సి, ఎస్‌టి వర్గాల కు చెందిన వారు చాలా తక్కువ శాతం మందే ఉన్నారు. వీటిల్లో దాదాపు 80 శాతానికి పైగా జనరల్‌ కేటగిరీకి చెందిన అధ్యాపకులే బోధిస్తున్నారని ఆర్‌టిఐ (రైట్‌ టు ఇన్ఫర్మేషన్‌ – సమాచార హక్కు) ద్వారా వెల్లడైంది. రెండు ఐఐటిలు, మూడు ఐఐఎంల్లో అయితే జనరల్‌ కేటగిరీ వాటా 90శాతానికి మించిపోయింది. మరో ఆరు ఐఐటిల్లో, నాలుగు ఐఐఎంల్లో జనరల్‌ వాటా 80-90 శాతం మధ్య వుందని సమాచార హక్కు ద్వారా అందిన సమాచారం తెలియజేస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌ వరకు ఐఐటి, ఐఐఎంల సంస్థల నుంచి తీసుకున్న సమాచారం మేరకు ఈ విషయాలు వెల్లడయ్యాయి.
కాగా, ఐఐటి, ఐఐఎంలతోపాటు ఇతర విద్యా సంస్థల్లో అధ్యాపకుల పోస్టుల కోసం కేంద్రం రిజర్వేషన్లను కల్పించింది. ఓబిసిలకు 27 శాతం, ఎస్‌సిలకు 15 శాతం, ఎస్‌టిలకు 7.5 శాతం మేరా రిజర్వేషన్లు ఇచ్చారు. అయితే వెనుకబడిన తరగతుల వారికి కేంద్రం అవకాశాలు కల్పిం చినా ఆచరణలో అవి అమలు కావడం లేదు. ఇండోర్‌ ఐఐఎంలో 109 పోస్టుల్లో 106 పోస్టులు జనరల్‌ కేటగిరీలోని వారితోనే నడుస్తున్నాయి. ఈ ఐఐఎంలో ఎస్సీ, ఎస్టీలకు చెందిన అధ్యాపకులే లేరని ఆర్‌టిఐ తెలిపింది. ఇక ఉదరుపూర్‌లో కూడా 90 శాతానికి పైగానే, ఐఐఎం లక్నో లో కూడా 95 శాతానికి పైగా జనరల్‌ కేటగిరీకి చెందినవారే అధ్యాపకులుగా ఉన్నారు. ఆరు ఐఐఎంలను పరిశీలించినట్లై తే ఒక్క ఎస్‌టి కేటగిరికి చెందిన అధ్యాపకులు కూడా లేరు. బెంగళూరు ఐఐఎంలో 85 శాతానికిపైగా జనరల్‌ కేటగిరీ అధ్యాపకులు ఉన్నారు. అందుకే రిజర్వేషన్లకు తగ్గట్టు గా అధ్యాపకుల్ని నియమించాలని అక్కడ నిరసనలు జరిగాయి.
ఐఐటి ముంబయి, ఐఐటి ఖరగ్‌పూర్‌లలో 700కి పైగా అధ్యాపక పోస్టుల్లో 90 శాతం పదవుల్లో జనరల్‌ కేటగిరిగికి చెందిన వ్యక్తులే ఉన్నారు. మండీ, గాంధీనగర్‌, కాన్పూర్‌, గౌహతి, ఢిల్లీ ఐఐటిల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. 80-90 శాతం మేరా జనరల్‌ కేటగిరీ వారే అధ్యాపకులుగా ఇక్కడ ఉన్నారు. మొత్తంగా 13 ఐఐఎంల్లో 82.8 శాతం మంది అధ్యాపకులు జనరల్‌ కేటగిరీ వారు వుండగా, కేవలం 5 శాతం ఎస్‌సి, ఒక శాతం ఎస్‌టి, 9.6 శాతం మంది ఓబిసి, ఆర్థికంగా బలహీనపడిన వర్గాలు (ఇబిసి), వికలాం గుల కోటాలకు చెందినవారు అధ్యాపకులుగా ఉన్నారు.
21 ఐఐటిల్లో 80 శాతం జనరల్‌ కేటగిరీ, 6 శాతం ఎస్‌సి, 1.6 శాతం ఎస్‌టి, 11.2 శాతం ఓబిసి, ఇబిసి, వికాలాంగుల కోటాలకు చెందిన అధ్యాపకులు ఉన్నారు. మొత్తంగా ఐఐటిల్లో గానీ, ఐఐఎంల్లో గానీ ఇంచుమించుగా ఇదే గణాంకాలు ఉన్నాయి. అయితే దేశవ్యాప్తంగా ఐఐటి, ఐఐఎంలన్నింటిలో ఇదే పరిస్థితి నెలకొందని కూడా చెప్పలేమని ఆర్‌టిఐ పేర్కొంది. పాట్నా ఐఐటి అధ్యాపకుల్లో 38 శాతం ఓబిసి, ఎస్సీలు 22 శాతం, ఎస్టీలు 13 శాతం, జనరల్‌ కేటగిరీ 12 శాతం మందే ఉన్నారు. భిలారు, ఇండోర్‌ ఐఐటిల్లో 50 శాతం మందే జనరల్‌ కేటగిరీ అధ్యాపకులు ఉన్నారు.
జమ్మూలో 51 శాతం జనరల్‌ కేటగిరీ, 19 శాతం ఎస్‌సి, 5 శాతం ఎస్‌టి, 23 శాతం ఓబిసి, 2 శాతం ఇతర కేటగిరీలకు చెందిన వారు అధ్యాపకులుగా ఉన్నారు. ఏడు ఐఐఎంల్లో 256 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆర్‌టిఐ డేటా తెలిపింది. ఈ పోస్టుల్లో ఓబిసి కేటగిరీకి చెందినవి 88, 54 ఎస్సీ, 30 ఎస్టీ కేటగిరీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇక ఐఐటిల్లో 1,557 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 451 ఓబిసి, 234 ఎస్‌సి,, 129 ఎస్‌టి పోస్టులు ఉన్నాయని ఆర్‌టిఐ తెలిపింది.

Spread the love