– రాష్ట్రానికి భారీ వర్షసూచన
– ఎల్లో, ఆరెంజ్ ఎలెర్ట్‌ల జారీ
– వాతావరణ శాఖ హెచ్ఛరిక
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల్లో మరింత జలకళ ఉట్టిపడనుంది. చెదురు,మదురు వర్షాల నేపథ్యంలో ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండుకుండలా తయారయ్యాయి. తాజాగా మరో మూడు, నాలుగు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ మేరకు ఆయా జిల్లాలు అప్రమత్తం కావాలంటూ సూచించింది. నిజానికి నిండు వేసవిలో అకాల వర్షాలు కురిసి కొంత ఉపశమనం కలిగిన మాట వాస్తవమే. ఎప్పుడైతే వానాకాలం పంటల సీజన్ ప్రారంభమైందో, అప్పటి నుంచి వానలు ముఖం చాటేశాయి. ఫలితంగా రైతులు కొంతఇబ్బంది పడాల్సి వస్తున్నది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ వానలు పడ్డాయి. దీంతో చెరువులు, కుంటల్లో కొంత నీరు చేరింది. ఇకపోతే ప్రాజెక్టులను పరిశీలిస్తే శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి పదిరోజుల్లో పది టీఎంసీల నీరు వచ్చిచేరినట్టు అధికారిక సమాచారం. ప్రస్తుతం ఆ ప్రాజెక్టులో 30 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్టు చెబుతున్నారు. ఇందులో మూడు టీఎంసీల కాళేశ్వరం జలాలు ఉండగా, మిగతావి గోదావరి పరివాహక ప్రాంతం నుంచి వస్తున్న వరదగా నీటిపారుదలశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం పోచంపాడు ప్రాజెక్టుకు ఎగువ నుంచి 23 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది. ముప్కాల్ పంప్‌హౌస్ నుంచి 4300 క్యూసెక్కుల కాళేశ్వరం జలాలను ఎత్తిపోస్తున్నారు. ఇకపోతే పునరుజ్జీవ పథకంలో భాగంగా ఎస్సారెస్పీ ప్రాజెక్టులోకి జులై ఏడో తేదీన మొదలైన కాళేశ్వరం జలాల ఎత్తిపోత తాత్కాలికంగా నిలిపేశారు. ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రకటించారు ఎస్పారెస్పీ ప్రాజెక్టులోకి నీటిమట్టం 30 టీఎంసీలు చేరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.
రానున్న రోజుల్లో భారీ వర్షాలు
రాష్ట్రంలో వచ్చే నాలుగైదు రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలుజిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడినభారీ వర్షాలు కురుస్తాయనీ, మరికొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ ఆయా జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్ రారీ చేసింది.
ఈ రెండు రోజుల్లో ఆదిలాబాద్, కుమ్రంభీం-ఆసిఫాభాద్, మంచిర్యాల, నిజామాబాద్, జయశంకర్-భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వానలు పడనున్నాయని సమాచారం. అలాగే ఉమ్మడి కరీంనగర్, వరంగల్, భువనగిరి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపుతోకూడిన వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలియజేసింది. మంగళవారం నుంచి బుధవారం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం-ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న-సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్,. హన్మకొండ, జనగమా, సిద్దిపేట, కామారెడ్డి, హైదరాబాద్, భువనగిరి జిల్లాల్లో పలుచోట్ల భారీ వానలు పడనున్నాయి. ఈ మేరకు ఆయా జిల్లాలకు ‘ఎల్లో’ అలెర్ట్‌ను ప్రకటించింది. బుధవారం నుంచి గురువారం వరకు మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, హబూబాబాద్‌లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సమాచారం.
ఆయా జిల్లాలకు ‘ఆరెంజ్’ అలెర్డ్‌ను జారీ చేసింది. ఇక ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను విడుదల చేసింది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వానలు కురవనున్నాయంటూ ఆరెంజ్ అలెర్డ్‌ను ప్రకటించింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, కొత్తగూడెం జిల్లాలకు భారీ వర్షసూచన ఉందనీ,ఈ మేరకు ఎల్లో అలెర్ట్‌ను హైదరాబాద్ వాతావరణ శాఖ జారీ చేసింది.