నిర్లక్ష్యం ఇంకెన్నాళ్లు.?

– అద్దె భవనాల్లో అంగన్వాడీ కేంద్రాలు 
– కనీస సౌకర్యాల్లేక సిబ్బంది ఇబ్బందులు 
– 9 గ్రామాల్లో అద్దె భవనాల్లో అంగన్వాడీల నిర్వహణ
– బెజ్జంకి క్రాసింగ్ గ్రామంలో అనవాళ్లులేని అంగన్వాడీ కేంద్రం
నవతెలంగాణ – బెజ్జంకి
స్త్రీ,శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమగ్ర శిశు అభివృద్ధి పథకం(ఐసీడీఎస్‌)ద్వారా అంగన్వాడీ కేంద్రాల నిర్వహణకు ఏటా ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా..అద్దె భవనాలు,ఇరుకు గదుల్లోనే ఉపాధ్యాయులు,చిన్నారులు, లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు.ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల మండలంలో సుమారు 9 గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలు నేటికీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి.నూతన గ్రామ పంచాయతీలు అభివృద్ధికి చిహ్నలని గత ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు గంభీరంగా చెప్పిన సందర్భాలున్నాయి. నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటైన బెజ్జంకి క్రాసింగ్ గ్రామంలో అంగన్వాడీ కేంద్రం నేటికి ఏర్పాటుచేయకపోవడం గత ప్రభుత్వం అంగన్వాడీలపై నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే విమర్శలు వెల్లవెత్తుతున్నాయి.రాష్ట్రంలో నూతనంగా పాలనాధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మిస్తే చిన్నారులకు విద్యతో పాటు పౌష్టికాహారం అందుతుందని పలువురు ప్రజలు కోరుతున్నారు.
అద్దె భవనాల్లో అంగన్వాడీ కేంద్రాలు: చిన్నారుల కోసం ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాలను పట్టించుకునేవారు కరువయ్యారు.కేంద్రాల్లో చేర్పించిన 3 నుండి 6 సంవత్సరాల పిల్లలకు విద్యతో పాటు పౌష్టికాహారం ప్రభుత్వం అందిస్తోంది.మండలంలో మొత్తం 23 గ్రామాల్లో 33 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా అందులో 12 కేంద్రాలకు మాత్రమే స్వంత భవనాలు ఉన్నాయి.11 కేంద్రాలు అద్దె భవనాల్లో,మరో 10 కేంద్రాలు ప్రభుత్వ పాఠశాల భవనంలో కొనసాగుతున్నాయి. బెజ్జంకి మండల కేంద్రంలో(2),రేగులపల్లి,పోతారం,గుగ్గీల్ల,వడ్లూర్,నర్సింహుల పల్లి,కల్లేపల్లి(2),బేగంపేట,దాచారం గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. బెజ్జంకి క్రాసింగ్ గ్రామంలో నేటికీ అంగన్వాడీ కేంద్రం అనవాళ్లు కనిపించకపోవడంతో నర్సింహుల పల్లి గ్రామ అంగన్వాడీ ఉపాధ్యాయురాలు నిర్వహణ బాధ్యతలు చూస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు పట్టించుకొని అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
వేతనం నుండి అద్దె చెల్లింపు:  అద్దె భవనాల్లో నడుస్తున్న కేంద్రాలకు ప్రతి నెలా రూ. వెయ్యి చొప్పున అద్దె చెల్లిస్తున్నారు.కనీస సౌకర్యాల్లేని అద్దె ఇళ్లలో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు,గర్భిణులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.చిన్నపాటి అద్దె గదిలోనే సామగ్రిని భద్రపర్చడం,ఒకపూట వండిపెట్టడం,చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య అందించడం వంటి పనులన్నీ ఒకేచోటే నిర్వహించాల్సిన దుస్థితి నెలకొంది.ఇరుకు గదులతో చిన్నారులు,సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు.మూత్రశాలలు సౌకర్యాలు లేని ఇరుకైన అద్దె గదుల్లోని కేంద్రాలకు వెళ్లేందుకు నిరాసక్తత చూపుతున్నారు.దీంతో అంగన్వాడీ కేంద్రాల్లో హాజరుశాతం పడిపోతుందనే వాదన వినిపిస్తోంది.మండల కేంద్రంలో ఒక అంగన్వాడీ ఉపాధ్యాయురాలు తనకు ప్రభుత్వం నుండి వచ్చే వేతనం నుండి కొంత వెచ్చించి అద్దె చెల్లిస్తున్నట్టు సమాచారం.
మోక్షమెప్పుడో మరి: అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవన నిర్మాణాలకు ఎప్పుడు మోక్షం కలుతుందోనని చిన్నారుల తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు.మండలంలోని అయా గ్రామాల్లో అద్దె భవనాల్లో సాగుతున్న కేంద్రాలకు నూతన భవనాలను నిర్మించడంపై ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ దృష్టి సారించాలని ఆయా గ్రామస్తులు కోరుతున్నారు.
ఇద్దరికి బదులుగా ఒక్కరే: మండలంలోని అయా గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాల పర్యవేక్షణకు ఇద్దరు సూపర్ వైజర్లు విధులు నిర్వర్తించాల్సి ఉంది.ఇద్దరికి బదులుగా ఒక్కరే సూపర్ వైజర్ విధులు నిర్వర్తించడంతో అంగన్వాడీ కేంద్రాల్లో తిష్ఠ వేసిన సమస్యలను పరిష్కరించడం జఠిలంగా మారుతోంది.
సొంత భవనాల కోసం అర్జిస్తున్నాం: మండలంలోని అయా గ్రామాల్లో అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాల నిర్మాణం కోసం ప్రభుత్వాలను అర్జిస్తూనే ఉన్నాం.సానుకూల స్పందించడం లేదు.భవనాలకు అద్దెను ఏవరు భరించడం లేదు.పూర్తిగా ప్రభుత్వమే చెల్లింపులు చేస్తోంది.హుస్నాబాద్ డివిజన్ పరిధిలో 9 క్లస్టర్లుండగా 6 మంది సూపర్ వైజర్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు.ఒక్కరూ డిప్యూటేషన్ పై వెళలడంతో 5 మంది సూపర్ వైజర్లు మండలానికి ఒక్కరూ చొప్పున విధులు నిర్వర్తిస్తున్నారు.
-జయమ్మ,ఐసీడీఎస్ సీపీడీఓ.
Spread the love