ఉదయం ఎండ..సాయంత్రం ఓటరు క్యూ

Sun in the morning. Voter queue in the evening– 17 పార్లమెంట్‌, కంటోన్మెంట్‌ అసెంబ్లీ ఎన్నికలు
– మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 4 గంటలకే ముగింపు
– మొరాయించిన ఈవీఎంలు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
– పలు చోట్ల బీజేపీ నేతల అత్యుత్సాహం
– మహిళల కోసం ప్రత్యేక కేంద్రాలు
– సెల్ఫీ తీసుకునేందుకు పోలింగ్‌ కేంద్రాల అలంకరణ
నవతెలంగాణ-విలేకరులు
రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్‌ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్‌ ప్రక్రియ కూడా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ సాయంత్రం 6 గంటలకు వరకు కొనసాగింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్‌ ముగిసింది. సాయంత్రం పూట ఓటర్లు బారులు తీరడంతో పోలింగ్‌ ముగిసే సమయానికి క్యూలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. ఉదయం 7 గంటల నుంచే జనం పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు. మధ్యాహ్నం ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు రాలేదు. చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రజలు ఓటింగ్‌లో పాల్గొన్నారు. కొన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద బీజేపీ అభ్యర్ధులు, శ్రేణులు ఘర్షణలు సృష్టించే ప్రయత్నాలు చేశారు. పలు గ్రామాల్లో తమ స్థానిక సమస్యలను పరిష్కరించడం లేదని గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించారు. అధికారుల చర్చలతో ఓటింగ్‌లో పాల్గొన్నారు. పలు ప్రాంతాల్లో సాంకేతిక లోపాలతో ఈవీఎంలు మొరాయించగా, అధికారులు సరిచేయడంతో ఓటింగ్‌ ప్రక్రియ కొనసాగింది. అంతేకాదు, ఈ సారి పలు చోట్ల మహిళలకు ప్రత్యేక క్యూ లైన్లు, పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు. ఓటేసిన అనంతరం సెల్ఫీలు తీసుకోవడానికి వీలుగా పోలింగ్‌ కేంద్రాలను వైవిధ్యభరితంగా ముగ్గులు, పూలతో అలంకరించారు.
హైదరాబాద్‌లో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ ఎంపీ స్థానాలతో పాటు, కంటోన్మెంట్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలోని మల్కాజిగిరి పార్లమెంటు స్థానానికి పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. షేక్‌పేట్‌లో ఓట్లు గల్లంతయ్యాయంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. చేవెళ్ల పార్లమెంట్‌ పరిధిలో పోలింగ్‌ ప్రక్రియ సాఫీగా సాగింది. ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు క్యూ కట్టారు. గంట గంటకూ పోలింగ్‌ శాతం పెరుగుతూ వచ్చింది. మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గంలోని నాదర్‌గూల్‌లో మహిళా పోలింగ్‌ కేంద్రానికి ఏర్పాట్లు చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో గచ్చిబౌలిలోనూ మహిళలకు ప్రత్యేక పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కరీంనగర్‌, పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. మెదక్‌, జహీరాబాద్‌ రెండు పార్లమెంట్‌ నియోజకవర్గాల్లోనూ త్రిముఖ పోటీ జరగడంతో పోటీపడి ఓటర్లను పోలింగ్‌ కేంద్రాలకు రప్పించారు. ఒకటి రెండు చోట్ల చెదురుమదురు సంఘటనలు జరిగాయి. నారాయణఖేడ్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య తోపులాట జరిగింది. సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్‌ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌ మధ్య వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. జనగామలోని ధర్మకంచలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య మాటల యుద్ధంతో ఉద్రిక్తత చోటు చేసుకోగా, పోలీసుల జోక్యంతో సద్దుమణిగింది.
పోలింగ్‌ ప్రశాంతంగా జరగడం.. కొన్ని చోట్ల భారీగా పోలింగ్‌ శాతం నమోదు కావడంతో ప్రధాన పార్టీలు ఎవరికీ వారే అనుకూలంగా లెక్కలు వేసుకుంటున్నారు. అయితే, హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, మల్కాజిగిరి, చేవెళ్లలో ఓటింగ్‌ శాతం తక్కువ రావడంతో పార్టీల నాయకులు ఢలాీపడ్డారు. ప్రచారంలో చెప్పుకున్న విధంగా గెలుస్తామనే ధీమాను వ్యక్తం చేయలేకపోతున్నారు. అయితే క్రాస్‌ ఓటింగ్‌ జరిగినట్టు ప్రారంభంలో ప్రచారం జరిగింది. క్రాస్‌ అయితే ఓట్లు ఎవరికి పడ్డాయనేది చర్చనీయాంశంగా మారింది.
100 శాతం ఓటింగ్‌తో ఆదర్శంగా సంగాయిపేట
మెదక్‌ జిల్లాలోని సంగాయిపేట తండాలోని ఓటర్లంతా ఓటేసి ఆదర్శంగా నిలిచారు. మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలోని కొల్చారం మండలం సంగాయి పేట తండాలో మొత్తం 210 ఓట్లు ఉన్నాయి. అందులో 95మంది పురుషులు, 115 మంది మహిళలు ఉన్నారు. వారంతా తమ ఓటు హక్కును వినియోగించుకొని 100శాతం పోలింగ్‌ను నమోదుచేశారు. దీంతో ఆ తండా ప్రజలను జిల్లా కలెక్టర్‌ అభినందించారు.
ఈవీఎంల మొరాయింపు..
యాదాద్రిభువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలోని 32వ పోలింగ్‌ కేంద్రంలో 40 నిమిషాలు ఈవీఎంలు మొరాయించాయి. వెల్లంకి గ్రామంలో 9వ పోలింగ్‌ బూత్‌ ఈవీఎంలో సాంకేతిక లోపం తలెత్తడంతో గంటల తరబడి ఓటర్లు బారులు తీరారు. ఎన్నారం గ్రామంలో 54, 55 పోలింగ్‌ బూత్‌లలో అరగంట పాటు ఈవీఎంలు మొరాయించాయి. సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలోని మంగల్‌తండా గ్రామంలో ఈవీఎం మొరాయించింది.
మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మహ్మదాబాద్‌ మండల పరిధిలోని గాదిర్యాల్‌లో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం వరకు 110 బూత్‌లు 30 నిమిషాలు మొరాయించాయి. దీంతో పోలింగ్‌ కేంద్రాల దగ్గర ఓటర్లు బారులు తీరారు. వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్‌ స్టేషన్‌ 228లో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి మూడు గంటల దాకా ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లకు ఇబ్బంది కలిగింది. పోలింగ్‌ స్టేషన్‌ ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ శ్రీనివాసులు తక్షణమే టెక్నికల్‌ ఆఫీసర్‌తో చూయించగా ఈవీఎం బ్యాటరీ లోపం వల్ల ఆగిపోయిందని తెలిపారు.
దొంగిలించిన ఓటు
వికారాబాద్‌ జిల్లా బంట్వారం మండల కేంద్రానికి చెందిన దొరేటి సుధాకర్‌ ఓటు మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో బూత్‌ నంబర్‌ 253లో సీరియల్‌ నెంబర్‌ 198లో ఓటు ఉంది. అతను పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లి చూస్తే తన ఓటు పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా వినియోగించుకున్నట్టు అధికారులు తెలిపారు. దాంతో ఆయన ఆందోళనకు దిగారు. తాను ప్రభుత్వ ఉద్యోగి కానప్పటికీ తన ఓటును పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఎలా వినియోగించుకున్నారో సమాధానం చెప్పాలని అధికారులను నిలదీశారు. ఎన్నికల అధికారులు కుమ్మకై తన ఓటును దొంగిలించారని ఆందోళన వ్యక్తం చేశారు. తనకు ఓటు వేసేందుకు అవకాశం ఇవ్వాలని, లేదంటే ఎలక్షన్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానని చెప్పడంతో వెంటనే అధికారులు స్పందించారు. జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి అక్కడి అధికారులతో మాట్లాడి ఆ వ్యక్తి ఓటు వేసేలా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
అధికారుల ఓవరాక్షన్‌..
చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం శంకర్‌పల్లి మండలం పర్వేద గ్రామంలో శంకర్‌పల్లి డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగరాజు తన సిబ్బందితో మధ్యాహ్నం 3 గంటలకు పోలింగ్‌ కేంద్రానికి చేరుకొని హల్‌చల్‌ చేశారు. ఓటేసేందుకు వెళ్తున్న ఓటర్లను చెదరగొడుతూ లాఠీచార్జీ చేశారు. దాంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ప్రజలంతా భయాందోళనతో పరుగులు తీశారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. గ్రామస్తులు ధర్నాకు దిగారు. పోలీసులు గ్రామస్తులకు క్షమాపణ చెప్పడంతో వారంతా శాంతించారు.
కరీంనగర్‌లో బీజేపీ అత్యుత్సాహం
ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా కరీంనగర్‌ బీజేపీ అభ్యర్థి బండి సంజరు ఫొటోతో కూడిన పోల్‌ చిట్టీలను రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేటలో కొందరు ఓటర్లకు పంపిణీ చేశారు. కొందరు తెలియక అవే చిట్టీలను తీసుకుని ఓటేసేందుకు పోలింగ్‌బూత్‌కు వెళ్లడంతో అధికారులు అడ్డుకున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్‌, బీజేపీ కార్యకర్తల నడుమ స్వల్ప వివాదం చోటుచేసుకుంది. జగిత్యాల జిల్లా కథలాపూర్‌ మండలం చింతకుంట గ్రామంలో బీజేపీ నేత నేతుల మల్లేశం పోలింగ్‌బూత్‌ వద్ద ప్రచారం చేస్తుండగా.. బీఆర్‌ఎస్‌ శ్రేణులు దాడి చేశారు. అతని కాలుపైకి టాటా ఏసీ వాహనం ఎక్కించడంతో మల్లేశంకు గాయాలు కాగా వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఇరుగ్రూపులు తోపులాట చేసుకోగా.. పోలీసులు చెదరగొట్టారు. జమ్మికుంట పక్క మండలం వీణవంకలోని చల్లూరు గ్రామంలో బీజేపీ నాయకు లు ఆదిరెడ్డి, ఎల్బాక మాజీ సర్పంచ్‌ ఓదయ్యల డబ్బులు పంచు తుండగా పోలీసులు పట్టుకుని రూ.25 వేలు సీజ్‌ చేశారు.
సిరిసిల్లలో మద్యం సీజ్‌..
పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలోని 16వ వార్డు బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ గుడ్ల శ్రీనివాస్‌ ఇంట్లో ఎలక్షన్‌ ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు తనిఖీ చేయగా అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు రూ.25వేల మద్యాన్ని సీజ్‌ చేశారు. కౌన్సిలర్‌పై కేసు నమోదు చేశారు. ఆయా పార్టీలకు సంబంధించిన నాయకులు, ప్రజాప్రతినిధుల ఇండ్లలో అధికారులు సోదాలు నిర్వహించారు.
సెల్ఫీ తీసుకున్న వ్యక్తిపై కేసు నమోదు..
నిజామాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వేములపల్లి గ్రామంలో రెడ్డవేణి జయరాజ్‌ తన ఓటు హక్కు వినియోగించుకుంటున్న క్రమంలో ఫోన్‌లో సెల్ఫీ తీసుకున్నాడు. గమనించిన అధికారులు ఫోన్‌ లాక్కుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పుట్టెడు దు:ఖంలోనూ ఓటేసిన కుటుంబం
నిజామాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం ఇటిక్యాల గ్రామంలో ఇంట్లో తల్లి చనిపోయి పుట్టెడు దు:ఖంలో ఉన్న ఓ కుటుంబం అంత్యక్రియలు ముగించుకుని ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Spread the love