నవతెలంగాణ-హైదరాబాద్ : ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో శుక్రవారం మూడు రైళ్లు ఢీకొన్న ఘోర ప్రమాదంలో మరణించిన వందలాది మందిని గుర్తించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో పలు ఆస్పత్రుల్లోని మార్చురీలు శవాలతో నిండిపోయాయి. రైలు ప్రమాద దుర్ఘటనలో 288 మంది మరణించగా, 900 మందికిపైగా గాయపడినట్లు అధికారికంగా ప్రకటించారు. బాలాసోర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీ నిండిపోవడంతో ఒడిశా ప్రభుత్వ అధికారులు స్పందించారు. 87 అంబులెన్స్‌లలో 187 మృతదేహాలను భువనేశ్వర్‌లోని పలు ఆస్పత్రులకు తరలించారు. అక్కడి ఎయిమ్స్ ఆస్పత్రిలో 110 గుర్తు తెలియని మృతదేహాలను భద్రపరిచారు. మరో 77 మృతదేహాలను భువనేశ్వర్‌లోని క్యాపిటల్ హాస్పిటల్, అమ్రీ హాస్పిటల్, సమ్ హాస్పిటల్‌తోపాటు మరికొన్ని ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. కాగా, ఒక్కో ఆస్పత్రిలో గరిష్ఠంగా 40 మృతదేహాలను మాత్రమే భద్రపరిచే వీలుందని ఎయిమ్స్ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో రైళ్ల ప్రమాదంలో మరణించిన వందలాది మంది మృతదేహాలను గుర్తించే వరకు మార్చురీలో ఉంచడం చాలా కష్టసాధ్యమని అన్నారు. దీంతో శవపేటికలు, ఐస్, రసాయనాలు సమకూర్చుకుని మృతదేహాలను భద్రపరిచే ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. వేసవి కావడంతో మృతదేహాలు త్వరగా పాడవుతాయని అన్నారు. శనివారం రైలు ప్రమాద స్థలాన్ని, ఆస్పత్రులను సందర్శించిన ప్రధాని మోడీ దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకెళ్లినట్లు అధికారులు వెల్లడించారు.