ప్రత్యేక పాలనలో దోమల బెడద

Mosquito pest under special regime– మంచం పట్టిన సంగెం  
– పట్టించుకోని అధికార ఘనం 
నవతెలంగాణ – నసూరుల్లాబాద్ 
గ్రామపంచాయతీ ప్రత్యేక పాలన లో దోమల బెడద అధికమైంది. గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారులు గ్రామాల్లో పర్యవేక్షణ లేకపోవడం నిధులు కేటాయించకపోవడంతో గ్రామాల్లో పారిశుధ్యం పడకేసింది. వాతావరణ మార్పులు. తరచూ వర్షాలు కురుస్తుండటంతో గ్రామాల్లో పారిశుధ్యం క్షీణించి దోమలు విజృంభించడంతో డెంగ్యూ, విషజ్వరాలతో మంచం పట్టిన  నసురుల్లాబాద్ మండలం, గత కొన్ని రోజుల నుంచి దోమలు జనంపై దండయాత్ర చేస్తున్నాయి. దీనితో మండలంలోని సంగెం గ్రామంలో జనాలు రోగాల పాలైతున్నారు. దోమల బెడద తో సంగెం గ్రామానికి చెందిన కొందరికి డెంగ్యూ సోకడంతో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చికిత్స పొందుతున్నారు. చికిత్స కోసం లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. గ్రామంలో దోమల బెడదతో ప్రజలు అల్లాడుతున్నారు. ప్రభుత్వం పారిశుధ్య నిర్వహణ కోసం ఏటా లక్షలాది రూపాయలు  ఖర్చు చేస్తున్నా ప్రయోజనం ఉండడం లేదు. పారిశుధ్యం క్షీణించడంతో దోమలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఫలితంగా ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. శీతాకాలంలో సాధారణంగా వచ్చే శ్వాసకోశ సంబంధిత వ్యాధులకు దోడు దోమకాటుతో ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. చీకటి పడితే చాలు రోడ్లపై కొద్దిసేపు నుంచోవాలంటేనే దోమల దెబ్బకు భయపడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో పగటి వేళల్లో కూడా దోమల దాడితో ప్రజలు అల్లాడిపోతున్నారు. దోమల బెడదతో చిన్నాపెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ రోగాల బారిన పడుతున్నారు. వీధులు, మురుగుకాల్వలు చెత్తాచెదారాలతో అపరిశుధ్రంగా మారుతున్నాయి. డ్రెయిన్లు పూడికతో పేరుకుపోతుండగా, ఖాళీ స్థలాలు చిట్ట ఆడవిలను తలపిసున్నాయి.
ప్రత్యేక అధికారుల పాలన అస్తవ్యస్తం
మండలంలోని నసురుల్లాబాద్, సంగెం, మిర్జాపూర్ గ్రామాల్లో దోమలు విజృంభిస్తున్నాయి. పారిశుధ్యంతో దోమలు ఏ మాత్రం తగ్గడంలేదు. ఈ పరిస్థితుల్లో తరచూ ఎక్కడికక్కడ ఫాగింగ్‌ చేయడంతో పాటు మురుగు కాల్వల్లో దోమల మందు పిచికారీ చేయాలి. అయితే అలాంటి ఆలోచనే అధికారులు చేయడంలేదు. గతంలో వర్షాకాలం ఆరంభంలో దోమల నియంత్రణకు కాల్వల్లో ఆయిల్‌ బాల్ , కాలువల్లో  చేపలు విడుదల చేస్తుండేవారు. అయితే ప్రత్యేక అధికారులు ఇలాంటి చర్యలు ఎక్కడా తీసుకోవడంలేదనే ఆరోపణ ఉంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి సంగెం గ్రామాల్లో దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
Spread the love