ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

Suicide of a mother with two childrenనవతెలంగాణ-మధిర
ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లా మధిర మండలం నిదానపురం గ్రామంలో గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిదానపురం గ్రామానికి చెందిన షేక్‌ బాజీ అనే యువకుడు ఎనిమిది సంవత్సరాల కిందట షేక్‌ ప్రేజా (చిలివేరు మౌనిక-పద్మశాలి, ఈమె తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగస్తులు) అనే యువతిని ప్రేమించి పెద్దలను ఎదిరించి పెండ్లి చేసుకున్నాడు. ప్రేజా తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినకుండా అతనిని వివాహం చేసుకుంది.వారి దాంపత్య జీవితం కొంతకాలం సజావుగానే సాగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు మెహక్‌(4), మెనురూల్‌(3) ఉన్నారు. షేక్‌ బాజీని గతంలో ఓ దొంగతనం కేసులో విజయవాడ పోలీసులు విచారించారు. షేక్‌ ప్రేజాను కూడా పోలీసులు పిలిచి విషయం చెప్పారు. అప్పుడు భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఇటువంటి వాటికి పాల్పడవద్దని ఆమె హెచ్చరించింది. ఈ క్రమంలో వారు ఖమ్మంకు తమ మకాం మార్చారు. ఓ షాపింగ్‌మాల్‌లో పని చేస్తున్నట్టు ఆమెను నమ్మించాడు. కొద్ది రోజుల తర్వాత తిరిగి నిదానపురం వచ్చారు. ఈ క్రమంలో బుధవారం రాత్రి ఖమ్మం పోలీసులు ఒక దొంగతనం విషయంలో బోనకల్లు మండలం మోటమర్రి గ్రామంలో షేక్‌ బాజీని పట్టుకొని ఖమ్మం తీసుకువెళ్లారు. ఆ విషయాన్ని మరుసటి రోజు( గురువారం) షేక్‌ పైజాకు పోలీసులు చెప్పటంతో ఆమె మనస్తాపానికి గురై తన భర్త జీవితంలో ఇక మారడేమో అనుకొని తన ఇద్దరు పిల్లలతో సహా తాను కూడా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. రూరల్‌ ఎస్‌ఐ లక్ష్మీ భార్గవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Spread the love