శ్రీదేవి మంత్రి… తెలంగాణ భాషను ఎగతాళి చేస్తే తట్టుకో లేకపోయారు. తన యాసను, సంస్కృతిని కాపాడుకోవాలనే దృఢ సంకల్పంతో ఉద్యమంలోకి అడుగుపెట్టారు. ప్రత్యేక తెలంగాణ కోసం మలిదశ పోరాటంలో అలుపెరుగని కృషి చేశారు. ఇప్పుడు తెలంగాణ అధికార భాషా సంఘం తొలి అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఉత్తర్వులన్నీ తెలుగులో విడుదలయ్యేలా కృషి చేస్తున్న ఆమె తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తన ఉద్యమ అనుభవాలను మానవితో ఇలా పంచుకున్నారు…
తెలుగు తల్లికి నీరాజనాలు
అధికారభాషా సంఘం అధ్యక్ష పదవిని నేను ఓ అధికారంగా భావించడం లేదు. అభ్యర్ధనే నా అభిమతం. చిన్నారులు, విద్యార్థినీ, విద్యార్థులు, యువత… ఇలా అన్నింటా మన తెలంగాణ భాషా వికాసం ఆమనిగా విరబూస్తే, ఈ కోయిలలన్నీ తెలుగు పలుకులు గానం చేస్తుంటే అప్పుడు నా కృషి ఫలించినట్టుగా భావిస్తాను. అనునిత్యం తెలంగాణ తెలుగు తల్లికి నీరాజనాలు అర్పిస్తాను. భరతమాత బిడ్డగా గర్విస్తాను. తెలుగు భాషపై ఆమోఘమైన పట్టు ఉన్న నాయకుడు మన ముఖ్యమంత్రి. నాకు ఈ బాధ్యత అప్పగించడమే ఎనలేని ఒక గొప్ప ప్రశంసా పత్రంగా భావిస్తున్నాను. నాకు ఇచ్చిన ఈ భాధ్యతను తెలుగు భాషాభివృద్ధి కోసం నా శాయశక్తులా కృషి చేస్తాను.
రెజ్లర్లపై దౌర్జన్యం అమానుషం
బంగారు పతకాలు సాధించి, మన భారత్ కీర్తిని విశ్వమంతా చాటిచెప్పిన రెజ్లర్లను లైంగికంగా వేధించడం దుర్మార్గం. బిజేపి ప్రభుత్వం దోషులను కాపాడుతున్న తీరు మరింత జుగుప్సాకరం. న్యాయంకోరిన మహిళా రెజ్లర్లపై చేయిస్తున్న దౌర్జన్యం అమానుషం. దిక్కుతోచని మహిళా రెజ్లర్లు గంగమ్మకు మొరపెట్టుకోవడం మన దైన్యస్థితిని తెలియజేస్తుంది. నిజంగా బిజేపి నేతలకు మన భారతీయ సంస్కృతిపౖౖె గౌరవంలేదు. కేవలం రాజకీయ ప్రయోజనంకోసమే వీటిని వాడుకుంటున్నారు. వారి కపటప్రేమను నిరూపించే అనేక సంఘటనలను మనం చెప్పుకోవచ్చు.
ఏరికోరి కోడలిగా చేసుకున్నారు
మా వారు పిండిప్రోలు లక్ష్మణమూర్తి. ప్రస్తుతం వ్యాపార రంగంలో ఉన్నారు. వీరి సొంతూరు చిత్తూరు జిల్లా. అయితే వారి కుటుంబం కూడా ఉద్యోగరీత్యా ఎప్పుడో నల్లగొండ వచ్చి స్థిరపడింది. మా అత్తమ్మ నన్ను ఏరి కోరి కోడలిగా చేసుకున్నారు. సొంత తల్లిలా నన్ను చూసుకుంటారు. ఆమె కేసీఆర్‌కు వీరాభిమాని. మా అమ్మాయి నైమిష ప్రీతమ్, మెడిసిన్ చదువుతోంది. అయితే తెలంగాణ కోసం ఎంతో తపించిన మా నాన్న 1998లో చనిపోయారు. తాను కోరుకున్న తెలంగాణను, నా ఎదుగుదలను చూడలేకపోయారనే బాధ నాలో మిగిలిపోయింది. నేను పుట్టింది మహబూబ్‌నగర్ జిల్లా, సిరిసినగండ్ల. మా అమ్మ మంత్రి రాధా దేవి, నాయిన మంత్రి శశి భూషణ్ రావు. మాది బ్రాహ్మణ కుటుంబం. అయినా నాయిన ప్రభావంతో విప్లవ, అభ్యుదయ భావాలతో పెరిగాను. నాన్న రెవెన్యూ ఉద్యోగి. ఆయన ఉద్యోగ రీత్యా నల్లగొండలో స్థిరపడ్డాం. నా చదువంతా నల్లగొండలోనే కొనసాగింది. చదువుకూడా సర్టిఫికేట్లు, మార్కులు, ర్యాంకుల కోసం కాకుండా సమాజ శ్రేయస్సు కోసం, పేదల అభ్యున్నతి కోసం చదివాను. సంస్కారవంతమైన చదువు చదవాలని, మనిషికి వాగ్భూషణమే సుభూషణమని, ఏ అలంకారాలు మనిషిని మనిషిగా నిలబెట్టలేవని నాయినా ఎప్పుడూ అంటుండేవాడు. అటువంటి కుటుంబం నుండి వచ్చిన నాకు సమాజసేవంటే ఎంతో ఇష్టం. మా నాన్న, చిన్నాన్నలు 1969 నాటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు.
నాయిన వల్లనే…
సంగీతం, నృత్యంలో కూడా నాకు ప్రవేశం ఉంది. ఎన్నో ప్రదర్శన లిచ్చాను. ఎన్నో బహుమతులు కూడా అందుకున్నాను. పువ్వు పుట్ట గానే పరిమళించినట్టు బాల్య దశలోనే అన్ని రంగాలలో ముందుండాలని సాహిత్య, సామాజిక రంగాలలో మక్కువ కల్పించిన మా గురువు కీ.శే.కట్టా రామచంద్రా రెడ్డిని నేనెప్పుడూ మర్చిపోలేను. బాల్యంలోనే కలం పట్టి కవితలల్లి పలువురి ప్రశంసలను పొందటం నాలో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని పెంచింది. అంతేగాక మా నాయిన కవి, గాయకుడు, రచయిత, నటుడు తెలుగు భాషాభిమాని. నాయిన వల్ల కూడా తెలుగు భాషపై మక్కువ ఏర్పడింది.
తగిన గౌరవం కోసం…
డిగ్రీ పూర్తయ్యాక పెండ్లి చేశారు. తర్వాత హైదరాబాద్ వచ్చేశాను. అమీర్‌పేట్‌లో వర్కింగ్ ఉమెన్ హాస్టల్ నడుపుతూ పీజీ పూర్తి చేశాను. అప్పట్లో ఒకామె తెలంగాణ భాషను వెక్కిరిస్తుంటే తట్టుకోలేకపోయాను. నా భాషను కాపాడుకో వాలని, తగిన గౌరవం దక్కాలని తపించాను. అప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించింది. నా భాషకు, సంస్కృతికి సముచిత గౌరవం దక్కాలంటే నేనూ ఉద్యమంలో భాగస్వామిని కావాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. రాష్ట్రం వచ్చినా రాకున్నా నా జీవితం తెలంగాణ ఉద్యమానికే అంకితం అనుకున్నాను.
అలుపెరుగని పోరాటం
మా నాయిన తెలంగాణను ఎప్పటికీ సాధించుకోలేమని నిరాశతో ఉండేవాడు. దాదాపు ఆ తరం వారు అందరూ ఆశలు వదులుకున్న వేళ బాపు కేసీఆర్ రూపంలో ఆ లోటు భర్తీ అయింది. ఆయన నాయకత్వంలో 2003 నుంచి తెలంగాణ కోసం అలుపెరుగని పోరాటం చేశాను. అయితే నేనెప్పుడూ పదవుల గురించి ఆలోచించలేదు. సామాన్య ఉద్యమ కారిణికి ఇంత గొప్ప బాధ్యతను ఇచ్చారంటే దానికి కారణం బాల్యం నుండి సాహిత్య రంగంలో నిబద్ధతతో కృషి చేయడంతో పాటు ఓ ఉద్యమకారిణిగా నాకు దక్కిన గౌవంగానే భావిస్తాను. మా నాయిన కల తెలంగాణ. ఆయన కలను నిజం చేశారు మన ముఖ్యమంత్రి. అందుకే నేను ఆయన్ని గౌరవంగా బాపు కేజీఆర్ అని పిలుచుకుంటాను. దేశ చరిత్రలో ప్రత్యేకంగా గుర్తించుకోదగిన మహోద్యమాన్ని సాగించి పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో అగ్రగామిగా దూసుకెళ్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన అతి తక్కువ కాలంలోనే సమగ్రమైన ప్రగతి పరుగులు పెడ్తున్నది.
సాహితీ విలువలు పెరుగుతాయి
చిన్నప్పటినుండి పిల్లలకు మాతృభాష మీద అవగాహన, అభిరుచి కలిగించాలి. యువతకు సాహిత్యం పట్ల మక్కువ కలిగించి వారిని ఆ దిశగా ప్రోత్సహించాలి. సాంస్కృతికోద్దరణ వైపుగా వారిలో ఆసక్తిని పెంపొందించాలి. ఆ విషయంలో కొన్ని అవార్డులు, రివార్డులు ప్రకటించాలి. దీనివల్ల కూడా సాహితీ విలువలు పెరుగుతాయి. ఇంట్లో తెలుగు మాట్లాడటం, తెలుగు పుస్త కాలు చదవటం వంటివి అలవాటు చేయాలి. తెలుగు సాహిత్యంలో ఎన్నో కొత్త ప్రక్రియలు, సంప్రదాయాలు మన తెలంగాణ కవుల నుంచే మొదలయ్యాయి. మల్లియ రేచన, పంపన, పాల్కురికి సోమన, బమ్మెర పోతన, బండారు అచ్చమాంబ వంటి తెలంగాణ సాహితీ మూర్తులు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. కావున ఇక్కడి బిడ్డలు కళాకారులై విశ్వానికి వెలుగులు నింపాలని నా ఆకాంక్ష. నేను వివిధ పత్రికలకు సాహితీ వ్యాసాలు చాలా రాశాను. వాటిని త్వరలో పుస్తకరూపంలో మీ ముందుకు తీసుకురాబోతున్నాను.
తమ ప్రతిభను చాటుకుంటున్నారు
ఆధునిక మహిళ సమాజంలో కీలకపాత్ర వహిస్తు న్నది. అన్ని రంగాల్లో సత్తా చాటుకుంటున్నది. అన్ని శాస్త్రాలను ఔపాసన పట్టి, అద్భుత విజ్ఞానాన్ని సంపాదించి, మహోన్నతంగా విశ్వ వేదిక మీద తన ప్రతిభను చాటుతున్నది. ”ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్” అన్నట్లు ఆఖరికి వేదాధ్యయన కాలంలో వేదాలు కూడా నేర్చి, దీటుగా నిలబడుతున్నది. ఉదాహరణకు గార్గి, మైత్రి వంటివారు. మీరాబాయి భక్తి ఉద్యమంతో ప్రాశస్త్యం పొందింది. అట్లాగే అక్క మహాదేవి. ఆధునిక కాలంలో చూసు కుంటే అన్నా చాందీ కేరళ హైకోర్టు ప్రథమ మహిళా న్యాయమూర్తిగా పేరు తెచ్చుకుంది. సుచేతా కృపలాని ఉత్తర ప్రదేశ్ తొలి మహిళా ముఖ్య మంత్రిగా పేరు తెచ్చు కుంది. అలానే విజయలక్ష్మి పండిట్ ఐక్య రాజ్యసమితి జనరల్ అసెంబ్లీ లో స్థానం సంపాదించుకున్న తొలి మహిళగా గొప్ప స్థానాన్ని పొందింది. ఇక సరోజినీ నాయుడు భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి మహిళ. కిరణ్ బేడీ తొలి ఐపీఎస్ అధికారిణి. ఇలా ఎందరో మహిళలు ఇంకెందరో గొప్ప స్థానాన్ని తమ జ్ఞాన సంపదతో సంపాదించడమే కాకుండా చరిత్రలో ఆదర్శమూర్తులుగా నిలిచిపోయారు.
సమాజం భయపడుతుంది
స్త్రీలు ఎంతగా అభివృద్ధి చెందినా బానిసలుగా చూస్తున్న వారు కూడా చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం ఈ ప్రమాదం మరింత పెరిగింది. భారతీయ సంస్కృతికి, సనాతన ధర్మానికి సిసలైన వారసులమని చెప్పుకునే బిజేపి నిజస్వరూపం రెజ్లర్ల విషయంలో బట్టబయలైంది. బిల్కిస్ బానో అనే గుజరాత్ ముస్లిం మహిళ కుటుంబంలో ఎనిమిది మందిని హత్యచేసి, ఏడు నెలల కూతురును బండకేసి కొట్టి చంపి, ఆమెపై లైంగిక దాడి చేసిన నిందితులకు బిజేపి నేతలు సన్మానం చేసిన తీరుకు యావత్ సభ్య సమాజం తలదించుకుంది. గుజరాత్ ఫైల్స్ రచయిత, జర్నలిస్టు రానా అయూబ్‌ను సంఫ్‌ు పరివార్ వేధిస్తున్న తీరు చూసి సమాజం భయపడుతోంది. సోషల్ మీడియా వేదికగా ఆమెను వేధిస్తున్నారు. కథువాలో ఎనిమిదేండ్ల గిరిజన బాలికను గుడిలో బంధించి, బలవంతంగా మద్యంతాపి ఎనిమిది రోజులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ నిందితులకు మద్దతుగా బిజేపి నాయకులు ర్యాలీ నిర్వహించారు. యుపి ఉన్నావ్‌లో ఒక యువతిపై ఏకంగా బిజేపి ఎంఎల్ఏనే దాడికి పాల్పడ్డాడు. ఇది మహిళల పట్ల వీళ్ళకున్న గౌరవం. ప్రజలంతా ఏకమై ఇలాంటి వాళ్ళను తరిమి కొట్టాలి. దేశాన్ని కాపాడుకోవాలి.