నవతెలంగాణ-ఓయూ
ఓయూ ఆర్ట్స్ కళాశాల ఎదుట దశాబ్ది ఉత్సవాలను బహిష్కరిస్తూ నల్ల జెండాలు, నల్ల బెలూన్స్‌తో విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ఓయూ విద్యార్థి జేఏసీ చైర్మన్ మిడతనపల్లి విజరు మాట్లాడుతూ అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2 నుంచి నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాలను బహిష్కరిస్తున్నా మనీ, అన్ని విద్యార్థి సంఘాలు ఏకతాటి పైకి వచ్చి నిర్ణయం తీసుకుని తమ నిరసన తెలియజేస్తున్నామని తెలిపారు. తెలంగాణ విద్యార్థి అమరవీరుల త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ ప్రత్యేక రాష్ట్రం కల్వకుంట్ల కుటుంబ దోపిడీకి గురై అప్పుల రాష్ట్రంగా మిగిల్చిందన్నారు. దగా పడ్డ తెలంగాణలో కేసీఆర్ దశాబ్ది ఉత్సవాలను నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బతుకు తెలంగాణ కావాలని ప్రజలు కోరుకుంటుంటే బార్ల తెలంగాణగా మార్చారన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి దశాబ్ది ఉత్సవాలను విరమించుకుని ప్రగతి తెలంగాణ కోసం పాటుపడాలనీ, లేదంటే త్వరలోనే అన్ని విద్యార్థి సంఘాలు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి విద్యార్థి గర్జన భారీ బహిరంగ సభ నిర్వహించిని ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉరిబెండి వెంకట్ యాదవ్, రాష్ట్ర కన్వీనర్ బోరెల్లి సురేష్, ఓయూ జేఏసీ నాయకులు గంటెపంగు నాగరాజు, దాత్రిక స్వప్న, ఈశ్వర్, దేవేందర్, గిరిజన మహాశక్తి స్టేట్ ప్రెసిడెంట్ చందర్ నాయక్, మాదిగ జేఏసీ స్టేట్ సెక్రెటరీ జెస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు మోహన్ నాయక్, విద్యార్థి సంఘం దశరథ నాయక్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు ఎం.ప్రసాద్, నక్క మహేష్, గణేష్, నరేష్, కిరణ్, రేవంత్ బొమ్మెర స్టాలిన్ పాల్గొన్నారు.