నవతెలంగాణ – జన్నారం
అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని తెలంగాణ ఉద్యమకారుడు టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు కమ్మల విజయ ధర్మ అన్నారు. గురువారం రుణమాఫీ మాట నిలబెట్టుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చలో ప్రజాభవన్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో గురువారం ఉదయం 4.30గంటలకు జన్నారం పోలీసులు కమల విజయ ధర్మను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు. రాష్టవ్యాప్తంగా రైతులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాత్రి నుంచి రైతులను, రైతు సంఘాల నాయకులను అక్రమంగా అరెస్టుచేసి పోలీసు స్టేషన్లలో నిర్బంధించడం తగదన్నారు. రైతులను పోలీసులు చేస్తున్న అక్రమ అరెస్టులను ఆపాలన్నారు. పోలీసుల నిర్బంధకాండతో రైతుల కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు. అక్రమంగా నిర్బంధించిన రైతులందరినీ వెంటనే పోలీసులు బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అధికారంలోకి వస్తే ఏకకాలంలో 2 లక్షలు రుణమాఫీ చేస్తామని హామీఇచ్చి మోసం చేసినందుకే రైతులు ఆందోళనకు దిగారు అన్నారు. ఏ రాజకీయపార్టీతో సంబంధం లేకుండా తమకు తామే సంఘటితమై మొదలుపెట్టిన ఈ రైతు ఉద్యమం ఇంతటితో ఆగదన్నారు.. రైతుల సంఘటిత శక్తి ముందు దగాకోరు కాంగ్రెస్ ప్రభుత్వం తలవంచక తప్పదుఅని హెచ్చరించారు.