ప్రస్తుత రోజుల్లో జీవితాలు ఎలా గడుస్తున్నాయో చెప్పనవసరం లేదు. ఉదయం లేచిన దగ్గర నుంచీ, రాత్రి పడుకునే వరకు ఎక్కువ సమయం కూర్చునే వుండాల్సిన పరిస్థితి.. టీవీ ముందరా, కంప్యూటర్ ముందరా, ఇలా కూర్చుని కూర్చుని ఒంట్లో కొవ్వుని పెంచేసుకుంటున్నాం. ఈ కొవ్వును తగ్గించుకోవడానికి వాకింగ్, జాగింగ్ లాంటి వ్యాయామాలు చేద్దామని అనుకోవడమే కానీ రోజువారీ హడావుడిలో చేసేందుకు సమయం కేటాయించుకోలేక పోతున్నాం. ఇటువంటి పరిస్థితికి ఓ పరిష్కారం ఉందంటున్నారు పరిశోధకులు..
కూర్చుని ఉండటమే అలవాటుగా ఉన్న అన్ని వయసుల వారిని కొంత మందిని ఎంపిక చేసుకున్నారు. అందరూ రోజు మొత్తం మీద కనీసం 5 నుంచి 9 గంటలు ఇండ్లలో, కార్యాలయాలల్లో కూర్చునే గడిపేస్తున్నారని అర్థమైంది. ఇలా కూర్చుని ఉండే సమయంలో ఎంతో కొంత మార్పు తీసుకువచ్చే అవకాశం ఉందేమో చూడమని సదరు అభ్యర్థులందరికీ సూచించారు. వారి సూచన మేరకు అభ్యర్థులంతా తమ జీవనశైలిలో చిన్నపాటి మార్పులు చేసే ప్రయత్నం చేశారు. పని మధ్యలో కాస్త లేచి అటూఇటూ తిరుగుతుండటం, మగవారైతే ఇంట్లో చిన్నాచితకా పనులు చేస్తుండటం, పిల్లలతో కాసేపు ఆడుకోవడం లాంటివి ప్రయత్నించారు. ఏడాది తర్వాత వారి జీవితాలని మరోసారి గమనించారు పరిశోధకులు. ఆ సందర్భంగా వారు కూర్చుని ఉండే సమయం అరగంట వరకు తగ్గినట్లు గ్రహించారు.
ఈ పాటి తగ్గుదలతో ఏమంత మార్పు వస్తుంది అనుకోవడం పొరపాటే.. ఈ చిన్న మార్పుతోనే షుగర్ లెవెల్స్ అదుపులోకి రావడం గమనించారు. కాలి కండరాలు కూడా బలంగా మారాయట. గుండెజబ్బు వచ్చే ప్రమాదం కూడా తగ్గినట్లు వెల్లడించారు. అంటే మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజూ పడీపడీ వ్యాయామాలు చేయనవసరం లేదు. ఉన్నంతలోనే కాస్త కాలుని కదిపే ప్రయత్నం చేస్తే చాలా రకాల దీర్ఘకాలిక అనారోగ్యాల బారిన పడకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఈ పరిశోధన తేటతెల్లం చేసింది.