– ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
నవతెలంగాణ- ఖమ్మం
మహిళా హక్కుల రక్షణతో పాటు వారి సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవన్‌లో ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల ఐద్వా రాష్ట్ర జోనల్ క్లాసులు గురువారం నుంచి మూడు రోజులు జరగనున్నాయి. మాచర్ల భారతి అధ్యక్షతన జరిగిన ప్రారంభ సభలో మల్లు లక్ష్మి పాల్గొని మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చాక మహిళలపై లైంగిక వేధింపులు పెరిగాయన్నారు. 2014 ముందు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ధరలు పెంచుతుందని గగ్గోలు పెట్టి అధికారంలోకి వచ్చిన బీజేపీ.. తానూ అదే పనిచేస్తూ సామాన్యుల నడ్డి విరుస్తుందని విమర్శించారు. ధరలు పెరగడం వల్ల అనేకమంది మహిళలు పోషక పదార్థాలు తినక రోగాల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన నరేంద్ర మోడీ ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటు వాళ్లకు అప్పజెప్పి ఉన్న ఉద్యోగాలనే పీకేస్తున్నారని ఆరోపించారు. 2020 నాటికి పేదలందరికీ ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టిస్తానని చెప్పిన మోడీ ఎక్కడా ఒక ఇల్లు కూడా మంజూరు చేయలేదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళలపై అత్యాచారాలు, హత్యలు, వేధింపులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా రెజ్లర్లపై బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్‌సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డా మోడీ మాట్లాడకపోవడం విచారకరమన్నారు. రెజ్లర్ల న్యాయ పోరాటానికి ఐద్వా అండగా ఉంటుందని, మోడీ ఇప్పటికైనా వారికి న్యాయం చేయడానికి ముందుకు వచ్చి, ఎంపీపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొత్త పార్లమెంట్ భవనాన్ని భారత రాష్ట్రపతిగా ఉన్న మహిళతో ప్రారంభించకుండా మహిళలను అణగదొక్కుతున్నారన్నారు. రాష్ట్రంలో అనేక మంది పేదలు ఇల్లు లేక స్థలాలు లేక బాధపడుతున్నారని, ఇప్పటికే మూడు లక్షల మంది డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని, 40 వేల మంది ఇండ్ల స్థలాల కోసం అడుగుతున్నారని, వెంటనే వారందరికీ స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించాలని డిమాండ్ చేశారు. అనంతరం బుగ్గవీటి సరళ ప్రిన్సిపాల్‌గా ‘తెలంగాణ ప్రజా పోరాటం మహిళల పాత్ర’ అంశంపై ఐద్వా ఉపాధ్యక్షులు బత్తుల హైమావతి బోధించారు. కార్యక్రమంలో ఖమ్మం జిల్లా ఐద్వా అధ్యక్షులు బండి పద్మ, సంఘం రాష్ట్ర నాయకులు అప్రోజ్ సమీనా, ప్రభావతి, ఎం.రమణ, పయ్యావుల ప్రభావతి, నాగ, సులోచన, మెహ్రునిసా బేగం, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.