బోడేపూడి స్ఫూర్తితో ఉద్యమాలు : తెలంగాణ రైతు సంఘం

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
బోడేపూడి వెంకటేశ్వరరావు సీపీఐ(ఎం)శాసన సభాపక్ష నాయకుడిగా పనిచేస్తూనే రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఎంతగానో కృషి చేశారని తెలంగాణ రైతు సంఘం సీనియర్‌ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో బోడెపుడి 26వ వర్ధంతి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. చిన్నతనంలోనే కమ్యూనిస్టు ఉద్యమానికి ఆకర్షితులైన బోడెపుడిి పూర్తికాలం కార్యకర్తగా ఖమ్మం జిల్లాల్లో పని చేశారని తెలిపారు. ఉపాధ్యాయ వృత్తిని వదులుకుని ప్రజా సేవలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమైందని గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య ఉత్పన్నమైనా.. అక్కడ ప్రత్యక్షమై సమస్యను పరిష్కరించడానికి కృషి చేశారని చెప్పారు. ఉపాధ్యాయుల, ఉద్యోగుల, కార్మికుల సమస్యలతోపాటు రైతాంగ సమస్యలను కూడా ప్రభుత్వ దృష్టికి తేవడమేగాక ఉద్యమాల్లో ప్రత్యక్ష పాత్ర పోషించారని గుర్తుచేశారు. రాష్ట్రంలో కరువు, వరదలు ఏర్పడి తీవ్ర నష్టం జరిగినప్పుడు ఆయా ప్రాంతాలకు వెళ్ళి నష్టపోయిన వారికి ధైర్యం చెప్పడమేగాక ప్రభుత్వంతో పోరాడి పరిహారం ఇప్పించారని తెలిపారు. నేటి ప్రభుత్వాలు వాగ్దానాలు చేయడమే తప్ప ఆచరణలో పరిహారాలు ఇవ్వడం లేదని విమర్శించారు. ఈ క్రమంలో బోడెపుడి పోరాట స్ఫూర్తితో కమ్యూనిస్టు ఉద్యమాన్ని విస్తరించడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి ప్రసాద్‌, రాష్ట్ర నాయకులు ఆర్‌. ఆంజనేయులు, రైతు సంఘం నాయకులు ఆర్‌. రాహుల్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love