కనీస వేతనాల సమస్యపై ఉద్యమాలు

కనీస వేతనాల సమస్యపై ఉద్యమాలు– పటాన్‌చెరు సమగ్ర అభివృద్ధికి పాటుపడతా : సీపీఐ(ఎం) అభ్యర్థి జె.మల్లిఖార్జున్‌
విద్యార్థి ఉద్యమాల ద్వారా రాజకీయాల్లోకి వచ్చి కార్మికునిగా, కార్మికోద్యమ నాయకుడిగా ప్రజా పోరాటాల్లో పాల్గొన్న సీపీఐ(ఎం) పటాన్‌చెరు ఎమ్మెల్యే అభ్యర్థి జె.మల్లిఖార్జున్‌కు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. 1985లో పటాన్‌చెరులోని శాండ్విక్‌ పరిశ్రమలో కార్మికుడిగా పనిచేసి, అనంతరం అల్విన్‌ వాచ్‌ పరిశ్రమలో 2000 వరకు పనిచేశారు. అనంతరం సీపీఐ(ఎం) పూర్తికాలం కార్యకర్తగా ఉమ్మడి మెదక్‌ జిల్లాలో పనిచేస్తూ కార్మికులకు కనీస వేతనాలు, హక్కుల సాధన కోసం పోరాటాలు నిర్వహిం చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కనీస వేతనాల సవరణ సలహా మండలి సభ్యుడిగా ఉన్నారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే పటాన్‌చెరు నియోజకవర్గ సమగ్రాభివృద్ధి కోసం పాటుపడ తానని ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన నవతెలంగాణ ప్రతినిధితో తెలిపారు. కనీస వేతనాల సమస్యలపై ఉద్యమిస్తానని అన్నారు.
నియోజకవర్గ సమస్యలు..?
మినీ ఇండియాగా పిలవబడే పటాన్‌చెరు నియోజకవర్గం గ్రేటర్‌ హైదరాబాద్‌ పక్కనే ఉంది. వేలాది పరిశ్రమలు విస్తరించినా నియోజకవర్గ ప్రజల జీవితాల్లో మార్పు లేదు.
గుమ్మడిదల, జిన్నారం ప్రాంతంలో ఇప్పటికీ రోడ్లులేవు. వ్యవసాయం జీవనాధారంగా ఉంది. వాణిజ్య పంటల సాగుకు అవకాశమున్నా కోల్డ్‌ స్టోరేజీల్లేవు. దీంతో రైతులు నష్టపోతున్నారు. చుట్టూ పరిశ్రమలున్నా స్థానికులకు ఉపాధి దొరకడం లేదు. ఈ ప్రాంతంలో అప్పటి కమ్యూనిస్టు ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి కట్టించిన ఇండ్లే కనిపిస్తున్నాయి.
ఆ తర్వాత చాలా ప్రభుత్వాలొచ్చినా పేదలకు ఇండ్లు, స్థలాలివ్వలేదు. కార్మిక వాడల్లో కార్మిక భవనాలు, ఆస్పత్రులు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాలు, మంచినీటి వసతి, ప్రాంతీయ భాషలో చదువుకునేందుకు స్కూల్స్‌ లేవు. పారిశ్రామిక ప్రాంతమైనా పాలిటెక్నిక్‌, ఇంజనీరింగ్‌ కళాశాలల్లేవు. మియాపూర్‌- సంగారెడ్డి వరకు మెట్రోలైన్‌ విస్తరణ జరగకపోవడంతో నిత్యం ట్రాఫిక్‌తో తిప్పలెదురవుతున్నాయి.
మీకు సహకరించే ఆంశాలు..?
గత ఎన్నికల కంటే ఈ ఎన్నికలకు ప్రత్యేకత ఉంది. ప్రధాన పార్టీల అభ్యర్థుల పోటీకి దీటుగా ప్రచారంలో దూసుకుపోతున్నాం. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే నియోజకవర్గంలో రెండు సార్లు గెలిచినా కంపెనీ యజమానులు, రియల్టర్ల ప్రయోజనాలు తప్ప ప్రజల సమస్యలను పట్టించుకోలేదు.
కాంగ్రెస్‌ అభ్యర్థి గతంలో ప్రజా ప్రతినిధిగా పనిచేసి అవినీతి అక్రమాలకు పాల్పడిన చరిత్ర ఉంది. బీజేపీ అభ్యర్థి గతంలో ఎమ్మెల్యేగా చేసినా నియోజకవర్గం గురించి పట్టించుకోలేదు. ఆ ముగ్గురు అభ్యర్థుల పట్ల ప్రజల్లో సరైన అభి ప్రాయం లేదు. పారిశ్రామికవాడగా పేరున్న పటాన్‌చెరులో కార్మికుల సమస్యలతో పాటు రైతులు, వృత్తిదారులు, మహిళలు, నిరుద్యోగ సమస్యలపై పోరాటాలు చేశాం. అవి మాకు కలిసి వచ్చే అంశాలు. సీపీఐ(ఎం) పట్ల ఊహించని ఆదరణ ఉంది. మా సతీమణి లక్ష్మికుమారి పక్కనే ఉన్న ప్రగతినగర్‌ సర్పంచ్‌గా పనిచేశారు.
ప్రస్తుతం కార్పొరేటర్‌గా కొనసాగుతున్నారు. ప్రగతి నగర్‌ అభివృద్ధి రోల్‌మోడల్‌గా నిలిచింది. అక్కడ చేసిన అభివృద్ధి ప్రభావం అమీన్‌పూర్‌, తెల్లాపూర్‌, బొల్లారం మున్సిపాలిటీల్లోని ఓటర్లపై ఉన్నది.

Spread the love