‘యానిమల్‌’ వంటి సినిమాలు ప్రమాదకరం : జావేద్‌ అక్తర్‌

Movies like 'Animal' are dangerous: Javed Akhtarముంబయి : ‘యానిమల్‌’ వంటి సినిమాలు సమాజానికి చాలా ప్రమాదకరమని బాలీవుడ్‌ సీనియర్‌ లిరిక్‌ రైటర్‌ జావేద్‌ అక్తర్‌ వ్యాఖ్యానించారు. ఔరంగాబాద్‌లో ఇటీవల జరిగిన ‘అజంతా ఎల్లోరా ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’లో పాల్గొన్న ఆయన ప్రస్తుత సినిమా పరిస్థితుల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి సినిమాలు భారీ విజయాన్ని నమోదు చేయడం ప్రమాదకరమని పేర్కొన్నారు. ఈ సినిమాలో ఒక సీన్‌లో హీరో తన ప్రేమను నిరూపించుకోవడానికి హీరోయిన్‌ను బూట్లు నాకాలని అనడం, మరో సీన్‌లో మహిళలను చెంపదెబ్బ కొట్టడం సరైనదేనని చెప్పడం వంటి సన్నివేశాలు ఉన్నాయని, అయినప్పటికీ ఇలాంటి చిత్రాలను ప్రేక్షకులు ఎలా హిట్‌ చేస్తున్నారో అర్థం కావడం లేదని జావేద్‌ అక్తర్‌ అన్నారు. సమాజానికి ఇది ఎంతో ప్రమాదకరమని చెప్పారు. సమాజం మెచ్చుకునేలా పాత్రలను రూపొదించాలనుకునే ఈనాటి యువ చిత్ర నిర్మాతలకు ఇది పరీక్షా సమయమని తాను భావిస్తున్నానని అన్నారు. మన సినిమాల్లో నైతిక విలువలు ఉండాలని స్పష్టం చేశారు. ఎలాంటి సినిమాలు చూడాలి అనేది ప్రేక్షకులే నిర్ణయించుకోవాలని, ప్రస్తుతం బంతి ప్రేక్షకుల కోర్టులో ఉందని అన్నారు. తెరపై హీరో పాత్రను ప్రెజెంట్‌ చేయడం రచయితలకు పెద్ద సవాలుగా మారిందన్నారు. సమాజంలో ఏది ఒప్పు, ఏది తప్పు అనే దానిపై స్పష్టంగా ఉన్నప్పుడు గొప్ప పాత్రలు వస్తాయని, కానీ ప్రస్తుతం సమాజంలోనే గందరగోళం నెలకొందని తెలిపారు.

Spread the love