గ‌తిత‌ప్పు‌తున్న బ‌స్సు‌లు..!

– మితిమీరుతున్న ప్రయివేటు ట్రావెల్స్‌ ఆగడాలు
– పరిమితికి మించి ప్రయాణికులతో పయనం
– గూడ్స్‌కు అనుమతి లేకపోయినా తీసుకెళ్తున్న వైనం
– నిబంధనలు విస్మరిస్తున్నా పట్టించుకోని అధికారులు
– నెల వ్యవధిలో ఇద్దరు మృతి..పలువురికి గాయాలు
జిల్లాలో ప్రయివేటు ట్రావెల్స్‌ ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. అతివేగం..నిర్లక్ష్యంతో పాటు నిబంధనలు విస్మరించడం కారణంగా ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. త్వరగా వెళ్తామని..టికెట్‌ ధర తక్కువగా ఉంటుందనే కారణంగా ప్రయివేటు బస్సుల్లో వెళ్తున్న ప్రయాణికులు గమ్యం చేరే వరకు గ్యారెంటీలేని పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాకు చెందిన ప్రయివేటు ట్రావెల్స్‌ వరుస ప్రమాదాలకు గురికావడం.. ప్రయాణికులు మరణించడం వంటి ఘటనలు సర్వత్రా ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఎప్పటికప్పుడు బస్సుల అనుమతులు, ఫిట్‌నెస్‌, నిబంధనలను తదితర వాటిని పరిశీలించాల్సిన రవాణశాఖ అధికారులు వాటి వైపు దృష్టిసారించకపోవడం మూలంగా ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
నెల రోజుల క్రితం ఆదిలాబాద్‌ నుంచి బయలుదేరిన ఓ ప్రయివేటు ట్రావెల్‌ బస్సు నిర్మల్‌ సమీపంలో బోల్తాపడింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతిచెందగా..పలువురు గాయపడ్డారు. టూర్ల కోసం అనుమతి తీసుకున్న బస్సును హడావుడిగా హైదరాబాద్‌కు పంపించడం.. అందులోనూ పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్లడం, అతివేగం వంటి కారణాలతోనే బస్సు బోల్తా పడినట్లు అధికారులు గుర్తించారు.
తాజాగా ఆదిలాబాద్‌ నుంచి హైదరాబాదుకు బయలుదేరిన ఓ ప్రయివేటు ట్రావెల్‌ బస్సు మార్గమద్యలో కామారెడ్డి వద్ద ప్రమాదానికి గురైంది. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం.. డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా ఆగి ఉన్న ఓ లారీని ఢకొీట్టింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు మరణించగా.. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఇలా వరుస ఘటనలు చోటుచేసుకుంటుండటంతో ప్రయివేటు ట్రావెల్స్‌ సామర్థ్యంపై అనుమానాలు తలెత్తుతున్నాయి.
నవతెలంగాణ- ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన ప్రయివేటు ట్రావెల్స్‌ బస్సులు ప్రమాదాలకు గురికావడం ఆందోళనకు దారితీస్తోంది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే రెండు బస్సులు ప్రమాదాలకు గురికావడం.. ఇద్దరు ప్రయాణికులు ఘటన స్థలంలోనే మృతిచెందడం వారి కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. పలువురు గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. వరుస ఘటనలు జరుగుతుండటంతో ప్రయివేటు ట్రావెల్స్‌ బస్సుల పనితీరుపై సర్వత్రా అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆదిలాబాద్‌ నుంచి ప్రతి రోజూ సుమారు 15 వరకు ప్రయివేటు ట్రావెల్‌ బస్సులు వందలాది ప్రయాణికులతో హైదరాబాద్‌కు వెళ్తుంటాయి. ఇది వరకు కేవలం రాత్రివేళలో మాత్రమే అందుబాటులో ఉండే ఈ ప్రయివేటు ట్రావెల్స్‌ కొన్ని రోజుల నుంచి ఉదయం పూట హైదరాబాద్‌కు ట్రిప్పులు నడిపిస్తున్నాయి. కొన్ని ట్రావెల్స్‌ యాజమాన్యాలు టూర్ల కోసం తిప్పుతామని అనుమతి తీసుకొని రోజువారీగా హైదరాబాదు వంటి దూర ప్రాంతాలకు ప్రయాణికులను తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. మరోపక్క సీట్ల సామర్థ్యం మేరకు కాకుండా క్యాబిన్‌లోనూ ప్రయాణికులను కూర్చొబెట్టుకోవడం వంటివి చేస్తుంటారని ఆరోపణలున్నాయి. మరోపక్క రెగ్యూలర్‌ డ్రైవర్లను కాకుండా తాత్కాలిక డ్రైవర్లతో బస్సులను ఆయా ప్రాంతాలకు నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. మరోపక్క త్వరగా వెళ్లాలనే ఆతృతలో అతివేగం.. డ్రైవర్‌ నిర్లక్ష్యం కూడా ప్రమాదాలకు కారణమవుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి.
అనుమతి లేకపోయినా..!
ప్రయివేటు ట్రావెల్స్‌ బస్సులు రోజువారీగా వివిధ ప్రాంతాలకు ప్రయాణికులను తీసుకెళ్తుంటామని రవాణశాఖ నుంచి అనుమతులు తీసుకుంటాయి. సీట్ల సామర్థ్యం మేరకు వివిధ రకాల అనుమతి తీసుకొని నడిపిస్తుంటాయి. కానీ కొన్ని ప్రయివేటు ట్రావెల్స్‌ నిబంధనలు విస్మరిస్తూ ప్రయాణికుల భద్రతకు ముప్పు తీసుకొస్తున్నాయి. కేవలం ప్రయాణికులను తీసుకెళ్తామని అనుమతి తీసుకొని గూడ్స్‌(వివిధ రకాల సరుకులు. వస్తువులు)ను తరలిస్తుంటాయి. బస్సు పై భాగంలో పెద్ద ఎత్తున పార్శిల్‌లను నింపుతూ అటుఇటూ చేరవేస్తుంటాయి. వాస్తవానికి ప్రయాణికుల లగేజీ తప్పితే..గూడ్స్‌ వస్తువులు, సరుకులు తీసుకెళ్లడానికి అనుమతి లేకపోయినా యథేచ్ఛగా తరలిస్తున్నాయి. నిత్యం పదుల సంఖ్యలో వాహనాలు క్వింటాళ్ల కొద్దీ వస్తువులను రవాణా చేస్తున్నాయి. ఇలాంటి దృశ్యాలు రోజూ కండ్ల ముందు కనిపిస్తున్నా సంబంధితశాఖ అధికారులు దృష్టిసారించిన దాఖలాలు కనిపించడం లేదు. కొన్ని ప్రయివేటు ట్రావెల్స్‌ యథేచ్ఛగా అనుమతులు ఉల్లంఘిస్తున్నా మామూలుగా తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. కేవలం ప్రమాద ఘటనలు జరిగినప్పుడు మాత్రమే హడావుడి చేస్తూ తనిఖీలు చేపడుతున్నారని.. అనుమతులు లేని కారణంగా బస్సులను సీజ్‌ చేశామని చెబుతున్నారని పలువురు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు.
అనుమతి లేని వాటిని సీజ్‌ చేశాం : శ్రీనివాస్‌, ఎంవీఐ, ఆదిలాబాద్‌
నిబంధనలు ఉల్లంఘించిన ఏడు ప్రయివేటు ట్రావెల్స్‌ బస్సులను సీజ్‌ చేశాం. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నాం. ఆయా ప్రయివేటు బస్సుల యాజమన్యాలు వివిధ రకాల అనుమతులు తీసుకున్నారా లేదా అనే దానిపై పరిశీలన చేస్తున్నాం. నిబంధనలు విస్మరించిన వాటిపై చర్యలు తీసుకుంటాం.

Spread the love