– బీఆర్ఎస్లో అలకలు.. బుజ్జగింపుల పర్వం…
– అధినేత నచ్చజెప్పినా ఆగని నేతలు
– పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి కోనేరు కోనప్ప రాజీనామా
– కూతురికి టిక్కెట్ దక్కటంతో అలక వీడిన కడియం
– ఎట్టకేలకు మెత్తబడ్డ మాజీ ఎమ్మెల్యే ఆరూరి
– ఈ పరిణామాల మధ్యే మరో నాలుగు ఎంపీ సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్
– చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్, జహీరాబాద్- గాలి అనిల్ కుమార్, నిజామాబాద్ -బాజిరెడ్డి గోవర్థన్, వరంగల్ -డాక్టర్ కడియం కావ్య పేర్లు ఖరారు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు… అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్కు, ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల రూపంలో మరిన్ని కష్టాలు ఎదురవుతున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో అసలు అభ్యర్థులే దొరక్క ఇబ్బందులు పడుతుంటే, మరికొన్ని చోట్ల సీటు దక్కని నేతలు పార్టీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకోవటంతో అధినేతల్లో సైతం ఆందోళన మొదలైంది. వరంగల్ జిల్లాలో సీనియర్ నేత, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వర్థన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ తదితరులు బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పనున్నారనే వార్తలు బుధవారం ఉదయం నుంచి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. దీంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆరే స్వయంగా రంగంలోకి సమావేశాల మీద సమావేశాలు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, బస్వరాజు సారయ్య తదితరులు వరంగల్‌లో ఆరూరితో నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో వారు ఆయన్ను బలవంతంగా హైదరాబాద్‌లోని కేసీఆర్ వద్దకు తీసుకెళ్లారు. మాజీ సీఎంతో మంతనాల అనంతరం ఆయన మెత్తబడ్డారు. మరోవైపు కడియం శ్రీహరి సైతం కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నారనీ, ఆయన్ను వరంగల్ నుంచి పోటీ చేయించేందుకు ఆ పార్టీ అధిష్టానం అంగీకరించిం దంటూ గుసగుసలు సైతం వినిపించాయి. తనకు ఎంపీ టిక్కెట్ ఇచ్చి, తాను ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న స్టేషన్ ఘన్పూర్ నుంచి తన కూతురికి అవకాశమివ్వాలంటూ కడియం కోరినట్టు కూడా తెలిసింది. దీనికి అధికార పార్టీ అంగీకరించిందనే సమాచారంతో టీవీ ఛానళ్లలో కథనాలు కూడా ప్రసారమయ్యాయి. చివరికి కేసీఆర్ ఆయనతో జరిపిన చర్చలు ఫలప్రదం కావటంతో కడియం వెనక్కు తగ్గారు. ఇది జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే ఆయన కూతురు డాక్టర్ కావ్య పేరును వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించటం గమనార్హం. మరోవైపు ప్రస్తుత ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్-బీఎస్పీ మైత్రిని మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సంగతి విదితమే. ఆయన ఇప్పుడు మరో అడుగు ముందుకేసి బీఆర్ఎస్ సిర్పూర్ కాగజ్‌నగర్ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. గురువారం మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నట్టు కోనప్ప ప్రకటించారు. ఈ రకంగా బీఆర్ఎస్లో అలకలు, అసంతృప్తులు, బుజ్జగింపులు కొనసాగుతున్నాయి. ఇలాంటి పరిణామాల నేపథ్యంలోనే కేసీఆర్ బుధవారం మరో నాలుగు లోక్‌సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, నిజామాబాద్ – బాజిరెడ్డి గోవర్థన్, జహీరాబాద్ – గాలి అనిల్ కుమార్, వరంగల్ -డాక్టర్ కడియం కావ్య పేర్లను ఆయన ప్రకటించారు. ఇప్పటికే ఖమ్మం -నామా నాగేశ్వరరావు (సిట్టింగ్), మహబూబాబాద్ -మాలోత్ కవిత (సిట్టింగ్), మహబూబ్‌నగర్ -మన్నె శ్రీనివాసరెడ్డి (సిట్టింగ్), కరీంనగర్ -బోయినపల్లి వినోద్‌కుమార్, పెద్దపల్లి -కొప్పుల ఈశ్వర్ పేర్లను ప్రకటించిన సంగతి విదితమే. వీటితో కలిపి బీఆర్ఎస్ మొత్తం తొమ్మిది లోక్‌సభ స్థానాలకు తన అభ్యర్థులను ప్రకటించింది.