గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలి: ఎంపీడీఓ

నవతెలంగాణ – కమ్మర్ పల్లి
వర్షాలు కురుస్తున్నందున సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో పారిశుధ్య  కార్యక్రమాలు చేపట్టాలని ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ అన్నారు.  మంగళవారం ఆయన మండలంలోని నాగపూర్ గ్రామంలో గ్రామపంచాయతీ సిబ్బంది నిర్వహిస్తున్న పారిశుద్ధ కార్యక్రమాలను ఆయన సందర్శించి పరిశీలించారు. మురికి కాలువల్లో నీరు నిల్వ ఉంటే దోమలు వృద్ధి చెంది ప్రజలు అనారోగ్యాల బారిన పడేందుకు ఆస్కారం ఉంటుందని పేర్కొన్నారు.మురికి కాల్వలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని పంచాయతీ కార్యదర్శి సంధ్య కు సూచించారు. మురికి కాలువల్లో, నీరు నిల్వ ఉండే గుంతల్లో పంచాయతీ పరిశుద్ధ కార్మికులతో బ్లీచింగ్ పౌడర్ చల్లించాలని కార్యదర్శికి సూచించారు. ప్రజలకు నల్ల నీటిని అందించే పైప్ లైన్ లకు లీకేజీలు లేకుండా చూసుకోవాలన్నారు. పైప్ లైన్ లీకేజీలు ఏమైనా ఉంటే తక్షణమే మరమ్మతులు చేయించాలన్నారు. అనంతరం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీని, వనమహోత్సవం ఫిట్టింగ్ సైట్ ను ఆయన పరిశీలించారు. త్వరలో చేపట్టనున్న మొక్కలు నాటే కార్యక్రమం కోసం అవసరమైన మొక్కలను సిద్ధంగా ఉంచాలని నర్సరీ నిర్వాహకులకు సూచించారు. అంతకుముందు ఆయన గ్రామపంచాయతీ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. గ్రామంలో ఇంటి పన్నుల వసూలను పెంచాలన్నారు. వంద శాతం  పన్నుల వసూలుకు సిబ్బంది కృషి చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ఈజిఎస్ ఏపీవో విద్యానంద్, పంచాయతీ కార్యదర్శి సంధ్య, ఫీల్డ్ అసిస్టెంట్, తదితరులు పాల్గొన్నారు.

Spread the love