మున్సిపల్‌ కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలి

నవతెలంగాణ-హిమాయత్‌నగర్‌

ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌.బాల్‌ రాజ్‌
తెలంగాణ రాష్ట్ర మున్సిపల్‌ స్టాఫ్‌, అవుట్‌ సోర్సింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ మూడో రాష్ట్ర మహాసభల పోస్టర్‌ ఆవిష్కరణ
రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లలో కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ విధానాన్ని రద్దు చేసి కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని ఏఐటీ యూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌.బాల్‌రాజ్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం హిమాయత్‌నగర్‌లోని సత్యనారాయణ రెడ్డి భవన్‌లో తెలంగాణ రాష్ట్ర మున్సిపల్‌ స్టాఫ్‌, ఔట్‌ సోర్సింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశం లో ఎస్‌.బాల్‌ రాజ్‌ తెలంగాణ రాష్ట్ర మున్సిపల్‌ స్టాఫ్‌, ఔట్‌ సోర్సింగ్‌ వర్కర్స్‌ యూనియన్‌ 3వ రాష్ట్ర మహా సభల పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ రాష్ట్రంలో నేటికీి జీఓ 4 ప్రకారం అనేక మున్సిపాల్టీల్లో కార్మికులకు 11వ పీఆర్సీ విడుదలై సుమారు రెండేండ్లు గడుస్తున్నా ఏరియర్స్‌ చెల్లించలేదన్నారు. మున్సిపల్‌ కార్మికులకు ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించి, ఏరియర్స్‌ చెల్లించేందుకు సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో మున్సిపల్‌ కార్మికులకు ఈఎస్‌ఐ గుర్తిం పు కార్డులు లేక అనారోగ్య సమస్యల పరిష్కారం కోసం కార్మిక కుటుంబాలు అనేక ఆర్ధిక ఇబ్బందులు పడుతు న్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఈఎస్‌ఐ గుర్తిం పు కార్డులు అందించాలనీ, పీఎఫ్‌ చెల్లింపులు సంక్రమంగా జరిపించాలన్నారు. కార్పొరేషన్‌, మున్సిపాల్టీలు, పురపాలక సంఘాల్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్య పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ కార్పొరేషన్‌లు, మున్సిపాల్టీల్లో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, కార్మికులను రెగ్యులరైజ్‌ చేసే వరకు కనీస వేతనాల చట్టాన్ని అనురిస్తూ కనీస వేతనం రూ.24 వేలు ఇవ్వాలని కోరారు. యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షులు కె.ఏసురత్నం, కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ యూనియన్‌ 3వ రాష్ట్ర మహా సభలు జూన్‌ 6, 7వ తేదీల్లో మేడ్చల్‌ పట్టణం జేెఎల్‌ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహిస్తున్నామని వెల్లడించారు. రెండు రోజుల పాటు ఈ మహా సభలకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,000 మంది మున్సిపల్‌ కార్మికులు ప్రతినిధులుగా హాజరవుతారని తెలిపారు. ఈ మహాసభల్లో మున్సిపల్‌ కార్మికుల సమస్యలపై చర్చిస్తామనీ, పలు తీర్మానాలను ప్రవేశ పెడుతామని తెలిపారు. ఈ రాష్ట్ర మహాసభల సందర్బంగా జూన్‌ 6వ తేదీన మేడ్చల్‌ పట్టణంలో జరిగే బహిరంగ సభకు కార్మికులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి నండూరి కరుణకుమారి, యూనియన్‌ రాష్ట్ర నేతలు పి.వెంకటయ్య, కె.రవిచంద్ర, కె.జయచంద్ర, పి.నర్సింగరావు, బొడ్డుపల్లి కిషన్‌, తదితరులు పాల్గొన్నారు.

Spread the love